ఆంధ్రాలో మరొక ‘జగన్ చాప్టర్’ క్లోజ్...

జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల నుంచే సరకుల సరఫరా, జగన్ వాహనాల (Mobile Dispensing Units) కు గుడ్ బై;

Update: 2025-05-20 14:01 GMT
Mobile Dispensing Units (Civil Supplies)

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా 2021లో ప్రారంభించిన ఇంటికే రేషన్ సరుకుల పథకానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముగింపు పలికింది. ఇక నుంచి ఈ వాహనాల ద్వారా కాకుండా రేషన్ షాపులకే సరుకులు సరఫరా చేయాలని, ప్రజలంతా షాపుల దగ్గిరకే వెళ్లి నిత్యవవసర సరుకులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ రోజు సమావేశమయిన ఎన్డీఎ కూటమి క్యాబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రోజు క్యాబినెట్ సమావేశమయింది. ఇందులో తీసుకున్న ముఖ్య మయిన నిర్ణయం ఇది.

గతంలో ఇంటింటికి రేషన్ పేరుతో వాహనాల కొనుగోలు
రేషన్ కార్డు దారుల ఇంటి వద్దకే రేషన్ చేరవేసేందుకు వైసిపి ప్రభుత్వం నిర్ణయించింది.దీనికోసం యువకులకు స్వయం ఉపాధి పథకం ద్వారా వాహనాలను కొనిపించింది. ఈ వాహనాలను 2021 జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జండా ఊపి ప్రారంభించారు. ఈ కాన్వాయ్ ని వైసిపి నేతలు డ్రోన్ ల ద్వారా వీడియో తీసి అందరికి పంపి పండగ చేసుకున్నారు. రాష్ట్రవ్యాపితంగా 9,260 వాహనాలు రూ. 539 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసి యువకులకు అందించారు. ఇందులో 60 శాతం సబ్సిడీతో SC, ST, BC, , మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా వీటిని అందించారు. ఇంటింటికి రేషన్ అందించే ఉద్దేశంతో ప్రారంభించారు. తొలినాళ్లతో ఈ పథకానికి మంచి పేరు వచ్చింది. ఈ వాహనాలు నడపడం యువకులకు లాభసాటిగా ఉండేందుకు వాహనానికి అద్దెకింద రు.10 వేలు, పెట్రోలు కోసం 3 వేలు, హెల్పర్ చార్జీ లకు కింద మరొక రు. 3 వేలు మొత్తం రు.16 వేలు అందించారు. కల్తీకి, అవినీతి కి ఆస్కారం లేకుండా ఉండేందుకు ఈ పథకం ఉద్దేశించారు.
దీనికోసం ప్రతీ బియ్యం బస్తాకు సీల్‌తో పాటు యూనిక్‌ కోడ్‌ ఇచ్చి దాని ద్వారా ఆన్‌లైన్‌ ట్రాకింగ్ చేశారు.

ఈ పథకం మీద విమర్శలు
తర్వాత ఈ పథకం మీద విమర్శలు రావడం మొదలయింది. వాహనదారులు పెత్తనం చలాయించడం మొదలుపెట్టారు. వీధిలో ఒకచివర వాహనం నిలబెట్టి అక్కడికే అందరూరావాలని దబాయించేవారు.దానితో గతంతో రేషన్ షాపులు దగ్గిర క్యూలు కట్టినట్లు ఈ వాహనాల చుటూ ప్రజలు గుమికూడాల్సి వచ్చింది. తర్వాత వాహనాలు కూడా తమ ఇష్టం వచ్చినపుడు వచ్చేవి. గతంలో కార్డు హోల్డర్ నెలలో నిర్ణీత రోజుల్లో రేషన్ షాపులకు వెళ్లి సరుకులు తెచ్చుకునేవారు. అయితే, ఇవి వచ్చాక, వాహనం వచ్చినపుడుతప్పమరొక రోజు సరుకులు దొరికేవి కావు. మరొక వైపు వీధుల వెంబడి వాహనాలను తిప్పితే తమకు గిట్టుబాటు కాదని వాహనదారులూ వాపోవడం మొదలుపెట్టారు. చాలా సార్లు వాళ్లు ఆందోళనకు కూడా దిగారు.
ప్రధాన ఆరోపణ
మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ యజమానులు పౌర సరఫరా విభాగం అధికారులతో లాలూచీ పడి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చారు. అంతేకాదు, 2024 ఎన్నికల్లో వైసిపి ఈ వాహనాలను డబ్బులు చేరవేసేందుకు వాడుకుందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ వాహనాల వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ. 830 కోట్ల అదనపు ఖర్చు అవుతూందని కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక జరిగిన ఒక సమీక్షలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ పథకాన్ని ఎత్తేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇపుడు ఈ వ్యవస్థ ను రద్దు చేయాలని నిర్ణయించారు. అయితే, వృద్ధులకు, వికలాంగులకు ఇళ్లకే రేషన్ పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, ఎలా పంపిస్తారో తెలియదు.
Tags:    

Similar News