అన్నమయ్య సామాజిక దృక్పథం

అన్నమయ్య సమాజకవి, ఆనాటి సామాజిక జీవనం నుండి వేరుపడలేదు. అన్నమాచార్యుని కాలంనాటికి తెలుగు సాహితీరంగంలో పద్య కవితకు పట్టాభిషేకం జరుగుతున్నది..

Update: 2024-06-01 13:16 GMT

అన్నమయ్య సమాజకవి, ఆనాటి సామాజిక జీవనం నుండి వేరుపడలేదు. అన్నమాచార్యుని కాలంనాటికి తెలుగు సాహితీరంగంలో పద్య కవితకు పట్టాభిషేకం జరుగుతున్నది. పద్యాలు రాసేకవి పరమ పూజనీయుడు. పద్యమే కవితకు పరమావధి.. అప్పటికే శ్రీనాథుడు కనకాభిషేకానికి నోచుకున్నాడు. పోతన "మందార మకరందాలను" తెలుగు ప్రజల కందిస్తున్న పద్యం పండితలోకానికే పరిమితమైంది. సామాన్య జనానికి అర్ధమయ్యే, ఉపయోగపడే రీతిలో కవిత్వం లేదు. రచనలేదు. జానపద కవితారీతులున్నా పండితలోకంలో ప్రాధాన్యం లేదు. పద కవితలను వండితులు ఈసడించుకున్న కాలం అది అలాంటి కాలంలో వదంకు పట్టం కట్టి చదువురాని పల్లీయుల నోళ్లల్లో నానిన పద కవితా మహుడు అన్నమయ్య సంస్కృతంలో "సంకీర్తన లక్షణ" మనే లక్షణ గ్రంథాన్ని రాసిన అన్నమయ్య సామాన్యుల కోసం కలం పట్టటంలోనే అతని సామాజిక దృక్పథం తెలుస్తున్నది. ఆనాడు జానపదుల వాడుకలో నుండిన కాఅరులు, చందమామ, తుమ్మెద, సువ్వి, గొబ్బి, ఉయ్యాల, లాలి, లాలి, జోల, శోభన, తందనాలు, చాంగుభళాలు మొదలైన ఎన్నింటినో తన పదాల్లో ఉపయోగించినాడు.

అన్నమాచార్యుల వారు తన కాలం నాటి ప్రజల భాషను, వారి పలుకుబళ్లను, నాముళ్లను, సామెతలను తన రచనల్లో ఉపయోగించటంలోనే వారి సామాజిక దృక్పథమేమిటో అర్థమవుతున్నది. రచనకు సామాజిక ప్రయోజనం ఉందని, ప్రతి పదం అందరికీ అర్థమయ్యేరీతిలో ఉండాలని అన్నమయ్య సిద్ధాంతం.. లోక వ్యవహారములో నున్న పదాలను వాటి నట్లే పరిగ్రహించి అనుభవించాలంటారు అన్నమయ్య.

ఈనాడు మనం తెలంగాణా, రాయలసీమ మాండలీకాల్లో కొనసాగుతున్న రచనల గురించి వాద, ప్రతివాదాలు గమనిస్తున్నాము. ఐదువందల సంవత్సరాల క్రితం అన్నమయ్య ప్రజల భాషలో రాయటం, భక్తి సామాన్యునికి చెరువులో ఉండాలని లక్ష్యంగా పెట్టుకోవటం గొప్ప విప్లవం. అనూచానంగా వస్తున్న మార్గంలో కాకుండా, తద్భిన్నమైన మార్గంలో పయనించటమే అన్నమయ్య సామాజిక దృక్పథమేమిటో తెలియచెబుతున్నది.

ఒక రచయిత ప్రజల వైపు ఉన్నాడా? తద్వ్యతిరేకంగా ఉన్నాడా అనేది అతరు ఉపయోగించే భాషనుబట్టి తెలుస్తుంది. భాషతోపాటుగా నాటి సమాజంలోని అన్ని వర్గాల వారిని పాత్రలు చేయటంలోనే అతని దృక్పథం ఏమిటో తెలుస్తుంది. నాటి సమాజంలోని అన్నమయ్య రచనల్లో అన్ని వర్గాల వారు తమ తమ భాషలతో సజీవంగా దర్శనమిస్తారు..

"వద్ద గొల్లెత వదలకువే నీ

ముద్దు ముద్దు మాటలకు మొక్కేమయ్యా"

"యాలే యాలే యాలే గొర్లెత

నాలా గెఱగవా నన్నునేనేపు

చాలు వాలు. నింక చాలు నీ రచనలు

పోలవు బొంకులు పోవయ్యా"

పల్లెల్లోని గొల్లెతలే గాదు అటవీ ప్రాంతాల్లోని చెంచెతలు కూడ అన్నమయ్య రచనల్లో దర్శనమిస్తారు. అంతేగాదు చల్లలమ్మిన వల్లెపడుచులూ ఉన్నారు. మందులమ్మ వచ్చిన నాగరికులూ ఉన్నారు. రైతులు ఉన్నారు. మాలదానర్లు ఉన్నారు. వారి వారి వృత్తి భాష ఉంది. పలుకుబళ్లు ఉన్నాయి. తెలుగు సాహితీప్రపంచంలో ఇంత సమగ్రంగా నాటి సామాజిక జీవిత చిత్రణ చేసిన వారు మరొకరు లేరంటే అతిశయోక్తికాదు.

"అడిన మాటెల్ల అమృత కాన్యముగ పాడిన పాటెల్ల పరమగానముగ" జీవించి తరించినవారు అన్నమయ్య

ప్రజలకోసం వేంకటేశ్వరుణ్ణి ఉద్దేశించి రాస్తున్న తనను నాటి రాజు సాళువ నరసింహరాయలు తనపై పదం రాయమన్నందుకు తిరస్కరించిన వాడు అన్నమయ్య. తను రాస్తున్నది రాజాశ్రయం కొరకు కాదు, ధనధాన్యాదుల కొరకు కాదు. ప్రజల పరంగా భక్తి. అందుకే రాజు ఆగ్రహానికి గురైనాడు. బంధీ అయినాడు. అయినా వెరవలేదు. లొంగలేదు. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు.. సన్నిహితుడు, తన బాల్యమిత్రుడు అయిన రాజును ధిక్కరించటంలోనే అన్నమయ్య వైఖరి ఏమిటో చెప్పకనే చెబుతున్నది. అతడొక సమాజకవి.

సమకాలీన రాచరిక వ్యవస్థలో విజయనగరరాజులు రాజ్యకాంక్షతో పితృ, భాతృ, పుత్రులనే భేదం లేకుండా చంపుకోవటం అన్నమయ్యను కలచివేసింది.

"వెరతు వెరతు నిందు వేడుక పడ నిట్టి

కురుచ బుద్దుల నెట్లు కూడుదునయ్యా"

దేహమిచ్చిన వాని దీవిరి చంపెడివాడు

ద్రోహి గాక నేను దొరయటా

ఆహికముగ నిట్టి యధమ వృత్తికి నే

సాహసమున నెట్టు చాలుదునయ్యా"

తోడ బుట్టిన వాని చౌదరి చంపెడి వాడు

చూడ దుష్టుడుగాక సుకృతి యట

పాడైన యిటువంటి పాడు బుద్ధులు నేసే

నీడ నిలువ నెట్టు నేరుతునయ్యా" |

సంగమవంశపు చివరి పాలకుల్లో విరూపాక్షరాయల్లో అతని పెద్ద కుమారుడు రాజశేఖరరాయలు 1478లో చంపించినాడు. రాజశేఖరరాయలను అతని తమ్ముడు రెండవ విరూపాక్షరాయలు చంపించినాడు. తర్వాత సాళువ నరసింహరాజు అతణ్ణి తరిమికొట్టి తాను సింహాసనాన్ని అధిరోహించినాడు.

సమాజం నుండే రాజకీయాలు పుడతాయి, రాజకీయ వ్యవస్థ అంతా తానే అయి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. తన పుట్టుకకు కారణమైన సమాజాన్ని అదువులో ఉంచుతుంది. శాసిస్తుంది. అన్నమయ్య నాటి కాలంలో రాజకీయ వ్యవస్థ అతలాకుతలంగా ఉంది. ఒకవైపు నాటి రాజులు తల్లీదండ్రీ, కొడుకులు, సోదరులు అనే భేదం లేకుండా కుర్చీ కోసం చంపుకుంటూంటే- ఆ కురచబుద్ధులకు అన్నమయ్య చలించి పోయినాడు, మరొకవైపు, మహమ్మదీయుల దండయాత్రల్లో జరిగిన దౌర్జన్యాలు, హింసాకాండ స్వయంగా విని, చూసిన అన్నమయ్య రాజకీయాలంటేనే రోతగా భావించినాడు.

ఇందుచెప్పిన రెండింటిని ఎండగట్టటంలో అన్నమయ్య సామాజిక దృష్టి ఏమిటో తెలుస్తున్నది..

నిరపరాధుల చంపినెత్తురు వారించగ; తుటుములై భూనురుల తుండెములు మొండెములు

అరుదగు పతివ్రతులు అభిమానవతులు

పలుదొరలకమ్ముడుబోయి తొత్తులైరి:

అన్నలును చెల్లెండ్లు నాండ్లు మగలును నైరి

వన్నె చెడి యతులు ధనవంతులైరి;

ప్రజలకు కాబట్టని పాలను చూసి రోసి అన్నమాచార్యుల వారు ఇది కలికాలమని నిరసిస్తున్నారు.

కుల నిరసన చేయక పోయినా కులాన్నికాదన్న వాడు అన్నమయ్య. ఆనాటికే కులం బాగా వేళ్లూని కొనిపోయి ఉంది. కులవ్యవస్థను వ్యతిరేకించే స్వభావం నాటి సమాజానికి

లేదు. ఆ చైతన్యం లేదు. అట్లాంటి రోజుల్లో కులాన్ని కాదనటం గొప్ప అభ్యుదయం.

"ఎక్కువ కులజుడైన హీనకులజుడైన

నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు

వేరములు చదివియును విముఖుడై హరిభక్తి

యాదరించని సోమయాజికంటే

యేదియులేని కులహీనుడైనను విష్ణు-

పాదములు సేవించు భక్తుడే ఘనుడు

పరమమగు వేదాంత వఠన దొరికియు సదా

హరిభక్తి లేని సన్యాసికంటె

సరవి మాలిన యంత్య జాతికులజుడైన

నరసి విష్ణుల వెదకు నాతడే ఘనుడు"

"ఎలమి హరిదాసు లేజాతి యైన నేమి?

తలమేల? కులమేల? తపమే కారణము"

"మెండైన బ్రాహ్మణుడు-మెట్టు భూమి యొకటే

చందాలుండేటి సరి భూమి యొకటే"

అయితే ఆర్థికంగా ఉచ్ఛస్థాయిలో ఉన్నవారి హృదయ పరివర్తననే అన్నమయ్య కోరినాడు. ఫలితం వర్గ సామరస్యం.

"దిన మహోరాత్రములు-తెగి ధనాఢ్యుల కొకటే- పౌనరు నిరుపేదకును వొక్కటి అవియు"

ఇంకా వర్గం, జాతి, మతాలపై విసుర్లు కూడా ఉన్నాయి. ఆనాటికే అన్నమయ్య వీటి సామాజిక దుష్ప్రప్రభావాన్ని ఎండగడుతూ ముందుచూపుతో ఉన్నారు.

"పట్టి నటరాజసాలు వర్ణాశ్రమములు

వర్ణాశ్రములాల వడి చిత్ర గుప్తులాల

వర్ణించి సుమ్మిక తడవకురో మా రు"

"జాతి యిందేది అంత్య జాతి యుండేది

జాతులన్నిటా ఆత్మ సర్వేశ్వరుడు

ఆతలను అంటూ ముట్టనేరి భావన మెల్ల

"ఎంత చదువుల వల్ల వేవేల మతాల

ఎక్కరి మతమూ లంక నేమి సోదించేము

పెక్కు మతములు చూసి బెండు పడ్డవారులేరా?

"జాతి భేదములు శరీర గుణములు

జాతి శరీరము తోడనె చెడు

అన్నమయ్య కులనిరసన తోపాటు మూఢాచార తిరస్కారం, వీరశైవుల నమ్మకాలపై విసుర్లు కూడ ఉన్నాయి.

"మారు చేతు లీయ వద్దు....

బీరాన గుండెలు కోసి పెట్టవద్దు

గోరపడి చిచ్చులోన గుండాలు చొఱవద్దు

సిరిదల లియ్యవద్దు జీవాల చంపవద్దు

(అన్నమయ్యలోని మరొక ముఖ్యమైన ప్రత్యేకత స్త్రీద్వేషం లేకపోవటం. స్త్రీని. నిందాపూర్వకంగా పేర్కొనకపోవటం, తాను ఆత్మ-స్త్రీమూర్తిగా, పరమాత్మ-నాయకుడుగా భావించి ఆత్మ పరమాత్మలో సమైక్యం గాపటానికి చేసిన ప్రయత్నమే అన్నమయ్య శృంగార కీర్తనలు. నాటి స్త్రీలు ఆటపాటల్లో, చదువు నందెల్లో ప్రవీణులు, స్త్రీ తన్నుతాను వ్యక్తీకరించుకునే రీతుల్లో పద కవితలల్లిన వాడు అన్నమయ్య. నాటి స్త్రీ స్వతంత్రురాలు. శృంగారంలో అద్వితీయ, స్త్రీ పరంగా చూసినప్పుడు అన్నమయ్య కీర్తనల్లో స్త్రీ చైతన్య భావాలు కోకొల్లలుగా ఉన్నాయి. శృంగారంకు సంబంధించి నేడు వెల్లువగా వస్తున్న వైజ్ఞాక సారస్వతం ముందు ఐదువందల ఏళ్లక్రితం అన్నమయ్య అట్లాంటిభావాలు వ్యక్తం చేయటం తన కాలం కన్నా ఎంత ముందు చూపుతో ఉన్నాడో తెలియ చెబుతున్నది)




 

సామాజిక జీవనంలో స్త్రీకి సమానమైన ప్రాతినిధ్య మిచ్చినవాడు అన్నమయ్య అన్నమయ్య భార్య తాళ్లపాక తిమ్మక్క గొప్ప కవయిత్రి అనే విషయాన్ని ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాలి. ఈనాడు ఆమెను మనం తొలి తెలుగు కవయిత్రిగా పేర్కొంటున్నాము.. దీన్ని బట్టి తెలుస్తున్నది మనకు అన్నమయ్య ఆకాశంలో సగమైన స్త్రీల పట్ల ఎటువంటి దృక్పథం కలిగి ఉన్నాడో?

అన్నమయ్య సంసారి. పైగా ఇద్దరు భార్యలు, శృంగారాన్ని అనుభవించి పలవరించిన వాడు. వేశ్యలను కూడ నిరసించలేదు. దీంతో మనకు గురజాడ గుర్తొస్తారు. వేశ్యలూ మనుషులేనన్న స్రృహ ఉండటం ఎంత గొప్ప సామాజిక చింతన!!

చదివె ప్రాణి సకలము యీ చదువుమీది చదువు చదువదాయెగాని సిరులు

చంచలమని, చేతలధ్రువమని, వరగు సంసారము బయలని, కలిమియు లేమియు గడవగరాదని, యేచిన పరహితమెంతయుదనదని, చెప్పని చదువులు వట్టి దంభాలూ వ్యర్థాలూ అని ఆయన విశ్వాసం, అన్నమయ్య కాలం నాటికి చదువులిట్లా కాలబడి పోవటం ఆశ్చర్యమేమరి. చదువులు ఎవరికోసం, చదువువల్ల కలగవలసిన ప్రయోజనమేమిటని అన్నమయ్య ఆనాటికే ఆలోచించటం ఆయన విశాల సామాజిక దృక్పథాన్ని తెలియజేస్తున్నది.

కోదండమున వ్రేల వేసి, కోల గగ్గెరదోసి, గుంజిళ్లు వెట్టించి, బడి పెట్లు పెట్టి, చదువు కన్నా సర్పపు కాటేనయమన్న రీతిన భీతి పుట్టించే అప్పటి విద్యావ్యవస్థను అన్నమయ్య తడివి విమర్శించినాడు.

ఈ గ్రహింపు చిన్న సంగతంకాదు. విద్యార్థులకు పాఠాలు ఎట్లా బోధించాలి. ఏం చెబితే, ఎట్లా చెబితే వారి బుర్రకెక్కుతుంది. ఎటువంటి పాఠాలు బోధించాలనే విషయంలో కూడ అన్నమయ్యకు ఒక ఆలోచన ఉన్నట్టు ఉంది. పిల్లల్ని బళ్లల్లో కొట్టటం, హింసించటం పాముకాటుతో సమానంగా చూడటంలోనే అన్నమయ్య శాస్త్రీయ దృష్టి ఉంది. పిల్లల్ని కొట్టటం నేరంగా పరిగణించే పాశ్చాత్య దేశాలను మనం గొప్పగా పొగడుతున్నాం. మన ప్రాంతంలో ఐదువందల ఏళ్లక్రితమే అట్టాంటి ఆలోచన ఒకటి ఉండటం ఎంత గొప్ప..

అన్నమయ్యకు సేద్యం తెలుసు. అదేక కీర్తనల్లో మనం నాటి వ్యవసాయ ప్రస్తావన చూడవచ్చు.

(పంటల భాగ్యులు వీరా బహు వ్యవసాయులు

అంటిముట్టి యిట్లుగా పాడుదురు ఘనులు

పొత్తుల పాపమనేటి పోడు నఱికివేసి

చిత్తమని యెడు చేసు చేసుగా దున్ని

మత్తిలి శాంతమనే మంచి వాన

వదనున విత్తుదురు హరిభక్తి వివేకులు

కామక్రోధాదులనే కలుపు దువ్వి వేసి

వేమరు వైరాగ్యమనే వెలుగు వెట్టి

దోమటి చార విధుల యెరువుల వేసి

వోయుచున్నారు జ్ఞానపు టైరుద్యోగ జనులు

యెందుచూచిన శ్రీవేంకటేశ్వరుడున్నాడని యెడి

అందిన చేని వంటల సుభవించి

సందడించి తమవంటి శరణాగతులు దాము

గొంది నిముడు కొందురు గురుకృప జనులు

ఇందులో నాటి వ్యవసాయ పద్ధతి ఎంత విపులంగా ఉందో తెలుసుకోవచ్చు.)

ఇంకా రైతులు వారి జీవనశైలి తెలిమి వేటడు చల్లె చెలియ నీ మీదను కలికితనాలు నీకు గంపల బెట్టె

వలపులు నీ యెదుట వాములుగా కూడ బెట్టె

యెలమి నీకోరిక లీడేరినయ్యా ॥

"నగవులు మూట గట్టి నలనాక్షి నిన్ను జూచి

పగటు జీతలు నీకు బండ్ల బెట్టె

మొగ మిచ్చ టెల్లా నీ ముందర దొంతి వేంచె

తగులాయములు నీకు దలకూదెనయ్యా"

వావులు గాదెలు బోసె వనిత నీ పొందు సేసె మోవి సన్నలు నీ మీద మోపుగట్టెను.

చేట, గంప, వాములు, బండ్లు, మూట, దొంతి, గాదె, మోపు, రైతుల జీవితంలో ముడివేసుకున్న పదాలు.

తొడుగు మేయగ రాదు తూర్పెత్త పాలి వోదు

బడి బడి హరిభక్తి వంట పండ

ఒక తతి యనియు లే దురి వోవదెన్నడు

చెడని శ్రీహరి భక్తి చెట్టుకట్ట

వలువు దీసిన బోదు వాడిన దఱుగదు

కొలిచి శ్రీహరి భక్తి కుప్పసేయ

ఎలుకకు దినగ రాదే వేళ, జివుకదు

హరిభక్తి మనసు పాతలను బెట్ట

కఱవునకు లోనుగాదు సుంకరికి నబ్బ

దెలిమి శ్రీహరి సద్భక్తి యిల్లు నిండ

హరిభక్తి అనే పైరును దొంగ పశువులు మేయలేవు. ఆ ధ్యానమును తూర్పెత్తగా పొట్టులేదు గనుక అంతా కళ్లంలో గట్టిగా నిలుస్తుంది. పైరుకు అదను ఉంది. హరిభక్తికి అదనులేదు. పొట్టు తీసినా, వాడినా ధాన్య ప్రమాణం తగ్గిపోతుంది. హరిభక్తి ఇనుమడిస్తుందేగాని, తరగదు. హరిభక్తి అనే ధాన్యాన్ని మనసనే పాతరలో ఉంచితే ఎలుకలు తినలేవు. ఎన్నటికి అది మక్కిపోదు. ధాన్యాన్ని ఎలుకలు తింటాయి. ధాన్యం మక్కిపోతుంది. కరువు వచ్చినప్పుడు ధాన్యం ఖర్చవుతుంది. హరిభక్తి కరువులో కూడ తరగడు. ధాన్యపు ఆదాయాన్ని బట్టి పన్ను చెల్లించాలి. భక్తి ఆదాయ మెంత పెరిగినా పన్నులేదు.

మితిలేని విత్తు లెన్ని - మేదిని పై అల్లినాను

తతితో విత్తినవే - తెగ బండును

అదను చూడక నేలపై లెక్కలేనని విత్తనాలు చల్లినా అవి ఫలించవు. బాగా దున్నిన నేలలో అదునులో చల్లిన విత్తనాలే ఫలిస్తాయి.

కడు నజ్ఞానపు - కరవు కాలమిదె

వెడల దొబ్బి మా వెరవు దీర్చవే

పావపు వసురము - బందెలు మేయగ

పావుల పుణ్యము - పొల వోయ

శ్రీవతి నీకే చేయి చాచెదము

యేపున మమ్మిక - నీరేర్చవే

ఇలగలియుగమను - యెండలు గాయగ

చెలగి ధర్మమను - చెరువంకె

పొలసి మీ కృపాంబుధి చేరితిమిదే

తెలిసి నా దాహము తీర్చవె

వడిగొని మనసిజవాయువు విసరగ

పొడవగు నెఱుకలు పుటమెగసె

బడి శ్రీవేంకటపతి నీశరణము

విడువక బొబ్బిలి వెసగావగదే

జీవుల నావరించిన అజ్ఞానము ఈ సంకీర్తనలో భయంకరమైన కరువు కాలంగా నిరూపింపబడింది. కరువు కాలంలో అపురూపంగా పెంచుకున్న పంటలను పశువులు మేసి పోవటం, మండేఎండలు, వడగాడ్పులు జనాన్ని పీడిస్తాయి.

అన్నమయ్య అనేక ఊళ్లు తిరిగినవాడు. ఆ జనం తెలుసు. ఆ వరిసరాలు తెలుసు. వారి జీవన పరిస్థితులు తెలుసు. కదిరి నరసింహస్వామి దేవాలయంలోని ఒక శాసనం ప్రకారం 1390-91 కరువులో లెక్కలేనన్ని పుర్రెలు దొర్లినాయి. రాయలసీమలో అన్నమయ్య జీవించిన కాలంలో 1423-24, 1442, 1454,1475 లలో కరువులు వచ్చినాయి. 1470లలో కరువు పదేళ్లు కొనసాగింది.

బొమ్మిరెడ్డి, తిమ్మిరెడ్డి అనే రైతుల పేర్లుగల కీర్తన ఉంది. అందులో నీటిమడుగుల పొలం, కొండలమోచిన పాలం, రాజులుందేటి పొలం, మాకు లెల్లా సెలగిన పొలం అని రకరకాల పొలాలు పేర్కొనబడినాయి.

పోడు నరకటం, దున్నటం పదునుకోసం ఎదురుచూడటం, విత్తనాలు విత్తటం, కలుపుతీయటం, ఎరువులు వేయటం, జాగ్రత్తగా కాపాడుకోవటం, అన్నింటికీ భగవంతుడున్నాడని అందిన వంటను అనుభవించటం రైతు సాధారణ కృత్యాలు, పైరు విత్తటం, ధాన్యాన్ని గాదెల్లో పోయటం, రుచికరమైన వంటకాల్ని భుజించటం, విహరించటం, ఇండ్లు కట్టుకోవటం, ధనం కూడ బెట్టుకోవటం, భగవంతుని కృపవల్ల వంట ఫలించినప్పుడు రైతు అనుభవంలోని సుఖసంతోషాలు అన్నమయ్య కీర్తనలెన్నింటిలోనో కళ్లకు కనబడినట్టున్నాయి. ఈ కీర్తనల ద్వారా నాటి వ్యవసాయ పద్దతులు, రైతు స్థితిగతులు, పన్నులు, కరువులు, లావాదేవీలు, వ్యాపారం, పాడి మొదలైన వాటి గురించి సమగ్రంగా తెలుస్తున్నది. తన కీర్తనల ద్వారా నాటి సమాజాన్ని నిబద్ధం చేసిన మహానుభావుడు అన్నమయ్య

అన్నమయ్య తనకాలి కింది భూమిని ఎన్నడూ మరవలేదు. తన చుట్టూ ఉన్న సమాజాన్ని నిత్యం ఎరుకతో ఉంచుకున్నాడు. సమాజాన్ని కాదని ఊహల్లో బతకలేదు. శృంగారం చెప్పినా, ఆధ్యాత్మిక చింత చేసినా నాటి సామాజిక జీవితచిత్రణ నుండే వైష్ణవ కవులు ఎక్కడో ఉన్న తిరుపతుల్ని వర్ణిస్తే అన్నమయ్య తన కాలంనాటి తాను జీవించిన మండలాలలోని క్షేత్రాలను వర్ణించి వైష్ణవమతం తమది, తమ సొంతం అనే భావం కలిగించినాడు. చిత్తూరు, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని దాదాపు 60 క్షేత్రాలు సందర్శించి సంకీర్తనల్ని పద కవితా పితామహుడు అన్నమయ్య.

అప్పటి పెండ్లి తంతు కళ్లకు కట్టినట్టు వర్ణించినాడు. ముంజేతులకు కంకణాలు, నుదుట బాసికాలు, సేనలు పెట్టటం, నూతన దంపతులు దండలు మార్చుకోవటం, పెండ్లికూతురు, పెండ్లికొడుకు ఒకరి పాదాలు మరొకరు తొక్కటం అనే ఆచారం - పెండ్లి తంతు ముగియగానే వధూవరులు ఇంట్లోకి ప్రవేశించగానే 'గడప' వద్ద పేరంటాళ్లు చేతులు అడ్డముంచి పెండ్లి కూతురు చేత పెండ్లి కొడుకు పేరు, పెండ్లి కొడుకు చేత పెళ్లికూతురు పేరు చెప్పించటం - నాటి సమాజంలో ఏమేమి జరిగిందో, ఎట్లాంటి జీవిత పద్ధతులు ఉండేవో తెలియజెప్పుతున్నది "పిడికిట తలంబ్రాలు" పాటలో ఇదంతా గమనించవచ్చు

ఆ కాలంలో ఉట్లపండగ, వెంకటేశ్వరుని కొలువు, తెప్పతిరునాళ్లు, కోడ తిరునాళ్లు, తెప్పోత్సవం, రథోత్సవం, వసంతాలాట లాంటి వెన్నో పండగలు, వినోదాలు అన్నమయ్య లిఖితం చేసి చరిత్ర సోపానాలు పదిలం చేసినాడు.

ఆ కాలంలో ఉన్న ఆటలు - కోలాటం, బిల్లంగోడు, పుచ్చకాయలాట, తోలుబొమ్మలు, వామనగుంటలు, బొమ్మపెళ్లిళ్లు, చదరంగం, అల్లా నేరెళ్లు, దాలి ముచ్చటలాడడం లాంటి ఎన్నో విధితమవుతున్నాయి.

ఆనాడు మన పూర్వీకులు వాడిన అభరణాలు కూడ అన్నమయ్య వదల్లేదు. దాదాపు అన్ని రకాల ఆభరణాలు- కమ్మలు, హారాలు, మట్టెలు, నవరాలు, ముత్యాల పేరులు, కడియాలు - అందులోనూ ధనవంతుడైన స్త్రీలు బంగారు మట్టెలు వేసుకుంటే ఆర్ధిక స్తోమతలేని గొల్లెతలు కంచు మట్టెలతో సరిపెట్టుకొనేవారని తెలుస్తున్నది..

నాటి సమాజంలో రకరకాల మంచాలు, దోమతెరలు ఉండేవి. దోమతెర మంచం, ఉయ్యాల మంచం, పట్టెమంచం, తూగుమంచం వీటిల్లో కలవాళ్లు, లేనివాళ్లు వారి వారి ఆర్థిక స్తోమతను బట్టి వాడేవారని తెలుస్తోంది..

ఇంకా అప్పటి ఆహార పదార్థాలు ఇద్దెనలు, రాజాన్నాలు, అవకాయ ప్రస్తావనలు ఉన్నాయి. కారెపు వీడెము (కిళ్లీ) కూడ ఉండేది.

రావిచెట్టు కింద ఊళ్లోవాళ్లు కూడటం, ఓడవ్యాపారం, నీటిగడియారం, రాట్నం ప్రస్తావన కూడ ఉంది.

తన కాలంలోని పరిస్థితులను వేటినీ వదలక సందర్భోచితంగా కూర్చిపెట్టి తన సామాజిక దృక్పథం ఏమిటో తెలియజెబుతున్నాడు అన్నమయ్య. చివరికి బూతులు, తిట్లు కూడా ఉన్నాయి. ఇవి అన్నమయ్య ప్రజలకు ఎంత సన్నిహితంగా ఉండేవాడో తెలుసుకోడానికి ఉపకరిస్తాయి.

ధనం ఒకణ్ణి రాజుగా, మరొకరిని బంటుగా చేస్తుంది. ఒకరికి శుల్యాన్ని ఇప్పించి వాని కుమార్తెను మరొకరికి ఇప్పిస్తుంది. ఒకణ్ణి ధాన్యం అమ్మే వాణ్ణిగా, మరొకరిని కొనే వాణ్ణిగా చేస్తుంది. ఈ ధనమే కొట్లాటలకు కారణమవుతుంది. కొంతమంది భాగ్యవంతుల సంచుల్లో కొలువు దీరి కూర్చుంటుంది.

ఇంకా నాట గ్రామం ఎట్లా ఉండేదో అన్నమయ్య సంకీర్తనలు తెలియచెబుతున్నాయి. వనం చేసిన వాడు చెట్లు వాడిపోకుండా నీరు పోసి పెంచుతాడు.

గొల్లవాడు వచ్చిక బాగా బలసిన చోట్ల పశువులను నిలిపి తృప్తిగా మేపుతాడు. కన్నతల్లి బిడ్డలకు వెన్నపాలు మీగడలతో అన్నం పెడుతుంది. వైద్యుడు మందు మాకు లిచ్చి ప్రజల ఆరోగ్యం కాపాడతాడు. రైతు పాడిపంటలతో సిరులు అందిస్తాడు.

నాటి గ్రామీణ స్వయం సంపూర్ణ వ్యవస్థను అన్నమయ్య వివరించినట్టుగా ఉంది. జాజులు, చందమామలు, కోవెల, చిలుక తుమ్మెద పదములు, లాలి, సువ్వి, గొబ్బి, ఉయ్యాల, లాల, జోల, జోజో, జేజీ, జయజయ విజయీభవ, శోభన, మంగళ వైభోగములు, మేలుకొలుపులు, నలుగులు, దంపుళ్లు, గూగూలు, గుజ్జన గూళ్లు, చందమామ గుటకలు, నివాళులు, ఆరతులు, మంగళారతులు, జయమంగళాలు, అల్లోనేరెళ్లు, చాంగుభళాలు, బశాబళాలు, సాసముఖాలు, అవధానములు, చందానాలు, వెన్నెలలు మొదలైన కవితా రచనా విశేషాలు అన్నమయ్య సంకీర్తనల్లో చాలా ఉన్నాయి. అవన్నీ ఆనాడు వాడుకలో ఉన్నాయి. ప్రజల నాలుకల్లో నర్తిస్తున్నాయి. ప్రజల వ్యావహారికంలో ఉన్న వాటి రూపాల ద్వారానే తన భావాలను వారికి అర్ధమయ్యే రీతిలో చెప్పటం లోనే అన్నమయ్య సామాజిక దృక్పథం.

ఏమిటో తెలుస్తున్నది. తన సంకీర్తనలు వేంకటేశ్వరుని కోసమే అయినా అవి అందరివీ. అవి జనం పాదుకొనే మంత్రాలు, తన రచనలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో ఉండాలనుకోవటమే గొప్ప సామాజిక దృక్పథం.

అన్నమయ్య జనావళి కంతటికీ ఆ దేవదేవుడే అధికుడని చెప్పటంలో వారి సమదర్శనం కనిపిస్తున్నది. మానవులంతా ఒక్కడే తరతమ భేదాల్లేవనే సామాజికచింతన అన్నమయ్యది. చూడండి.

కందువగు హీనాధికము లిందులేవు

అందరికీ శ్రీహరే అంతరాత్మ

ఇందులో జంతు కులమంతా నొకటే

అందరికీ శ్రీహరే అంతరాత్మ

నిందార రాజు నిద్రించు నిద్రయు నౌకటే

అండనే బంటు నిద్ర అదియు నౌకటే

మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటె

చందాలుదుండేటి సరి భూమి యొకటే

అనయు దేవతలకును అలకాయ సుఖమొకటె

ఘన కీట పశువులకు కామ సుఖమొకటె

దిన మహోరాత్రములు తెగి ధనాధ్యున కొకటె

వానర నిరుపేరకును వొక్కటే

కొరలి శిష్టాన్నములు కొను నాకలొకటి

తిరుగు దుష్టాన్నములు తిను నాకటొకటె

పరగు దుర్గంధముల పై వాయు వొకడే

వరుస పరిమళముపై వాయు వొకటి

కడగి యేనుగు మీద కాయు యెందొకటి

పుడమి శునకము మీద పొలయు నెండొకటె

Tags:    

Similar News