ఆమ్రపాలి IAS వర్కింగ్ స్టైలే వేరు

కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతాలలో పర్యటించిన జిల్లా ప్రత్యేక అధికారి కాట ఆమ్రపాలి

Update: 2025-10-27 15:41 GMT

మొంథా తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జిల్లాకు నియమించిన జిల్లా ప్రత్యేక అధికారి, పర్యాటక శాఖ ఎండి, కాట ఆమ్రపాలి సోమవారం మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి మండలంలోని గరాలదిబ్బ, గిలకలదిండి గ్రామాలలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించారు. ఆశ్రయం పొందుతున్న ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కేంద్రంలో ఉన్న గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంగినపూడి బీచ్ ను సందర్శించి అక్కడి వాతావరణ పరిస్థితులను పరిశీలించారు.


ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ బీచ్ వద్ద మీడియాతో మాట్లాడుతూ మొంథా తుపాను ప్రభావంతో 27 నుంచి 29వ తేదీ వరకు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే, సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ వెనక్కి రప్పించామన్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 188 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలందరిని తరలిస్తున్నామని తెలిపారు.


సమాచార నిమిత్తం జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని, మండల ప్రత్యేక అధికారులను కూడా నియమించినట్లు తెలిపారు. అదేవిధంగా రైతులెవ్వరు కూడా కోతలు కోయకుండా వాయిదా వేసుకునేలా అప్రమత్తం చేయడం జరిగిందని, ఒకవేళ ఎవరైన ఇప్పటికే కోత కోసి ఉంటే గనక ధాన్యం మొలకెత్తకుండా ఉండేందుకు దానిపై ఉప్పు ద్రావణం పిచికారీ చేసేవిధంగా క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. తుఫాను ముగిసేంతవరకు ప్రజలెవరూ ఇళ్ళ నుండి బయటకు రాకుండా తమ ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని కోరుతూ, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిరావాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు. 

Tags:    

Similar News