ఏపీలో ఎన్ఐడీఎం ను ప్రారంభించిన అమిత్ షా
ఆరు నెలల్లో ఏపీకి మోదీ రూ. 3 లక్షల కోట్లు సాయం అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు.;
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. NDRF 20వ వ్యవస్థాపక దినోత్సవాన NIDM దక్షిణ సంస్థ కార్యాలయం అందుబాటులోకి తెచ్చామని అన్నారు. గన్నవరం మండలం కొండపావులూరులో NDRF రైజింగ్ డే వేడుకలు జరిగాయి. NDRF 10వ బెటాలియన్‌ను ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. తిరుపతి రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. చంద్రబాబు, మోదీ జోడీల నాయకత్వంలో ఏపీ మూడింతల ప్రగతి సాధిస్తుందని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.11,440 కోట్లు సాయం కింద కేంద్రం కేటాయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుర్తుచేశారు.
స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రుల ఆత్మగౌరవం ముడి పడి ఉంది. సున్నితమైన అంశంలో కేంద్రం ప్రజలకు భరోసా ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు కష్టపడ్డారు. గత ఐదేళ్లల్లో రాజధాని నిర్మాణం నిలిపివేశారు. ఇప్పుడు కూటమి వచ్చాక కేంద్రం నిధులు ఇచ్చి పనులు ప్రారంభించింది. రైల్వే జోన్ విషయంలో కేంద్రం మాట నిలబెట్టుకుంది. ఏపీకి జీవధార అయిన పోలవరం నిర్మాణం పూర్తి చేసి 2028 నాటికి నీరు ఇచ్చీ తీరుతాం. రూ. 2 లక్షల కోట్లతో విశాఖపట్నం గ్రీన్ ఎనర్జీకి కేటాయించాం. ఎయిమ్స్‌ను రూ. 1600 కోట్లతో నిర్మాణం చేస్తున్నాం. లక్షా 20 వేల కోట్లతో జాతీయ రహదారులు నిర్మాణం జరుగుతుంది. చంద్రబాబు వెనుక మేమంతా ఉన్నాం.. ఏపీని అభివృద్ధి చేస్తాం. NIDM టీం అద్భుతమైన పని తీరు చూపింది. డిజార్డర్స్ మేనేజ్మెంట్ శిక్షణ వరకే పరిమితం కాదన్నారు.
అమిత్ షా పని తీరును అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 2014లో NDRF కార్యాలయం కోసం శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. 2018లో ఇక్కడ NIDM కార్యాలయం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశామని చెప్పారు. వీటికోసం ఏపీ ప్రభుత్వం యాభై ఎకరాలు కేటాయించిందని అన్నారు. నేడు మళ్లీ ఎన్డీఏ హయాంలోనే వీటిని ప్రారంభించామన్నారు. టెర్రరిస్టు, నక్సలైటు, ఇతర సమస్యలను అమిత్ షా బాగా పరిష్కరించారని సీఎం చంద్రబాబు తెలిపారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుతో ఉక్కు కర్మాగారం నిర్మాణం జరిగిందని చెప్పారు. ఇప్పుడు రూ.11,440 కోట్లు ఇచ్చి కేంద్రం ఊపిరి పోసిందన్నారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేశామని, గోదావరి పెన్నా, పోలవరం- బనకచర్లను అనుసంధానం చేసేలా కేంద్రం సహకారం కోరుతున్నామని అన్నారు.
దక్షిణ భారతదేశ డిజార్డర్స్ మేనేజ్మెంట్ కార్యాలయం ఇక్కడ నిర్మించడం ఆనందంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. లక్షా యాభై వేల మందికి పైగా ప్రజల ప్రాణాలను కాపాడారని చెప్పారు. ఏడు వేల మృతదేహాలను తమ కుటుంబాలకు అప్పగించారన్నారు. 19,368 మూగ జీవాలను కాపాడారని చెప్పారు. ఎన్టీఆర్‌ఎఫ్ సేవలు మనకు ఎంతో ముఖ్యమైనవని అన్నారు.