డ్రోన్ల విన్యాసాలు ఎన్నెన్నో.. అసలింతకీ డ్రోన్లు ఎలా పుట్టాయంటే..

ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో పుట్టి ఇజ్రాయిల్ లో పెరిగిన కరీం అనే ఏరోస్ఫెస్ ఇంజినీర్ ఈ ఆధునిక అన్ మాన్డ్ ఏరియల్ వెహికల్ ను ఆవిష్కరించారు.

Update: 2024-10-18 09:21 GMT

అమరావతి డ్రోన్ సమ్మిట్-2024కి ఆంధ్రప్రదేశ్ రాజధాని ముస్తాబవుతోంది. అక్టోబర్ 22 నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. విజయవాడలో కృష్ణా నది ఒడ్డున అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 జరుగనుంది. అక్టోబరు 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 కోసం ఏపీ డ్రోన్ కార్పొరేషన్ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.


దాదాపు 400 మంది పరిశోధకులు, నిపుణులు, వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు, డ్రోన్ తయారీ కంపెనీలు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ ఈవెంట్ కోసం ఇప్పటివరకు నమోదు చేసుకున్నారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, వివిధ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో ఈ డ్రోన్ సమ్మిట్‌ జరుగనుంది. అక్టోబర్ 22 న బొబ్బూరి మైదానంలో 5 వేల డ్రోన్‌లతో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ ప్రదర్శన, కృష్ణా నది ఒడ్డున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వాహకులు ప్లాన్ చేసినట్టు ఎ.పి.డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె. దినేష్ కుమార్ చెప్పారు.

ఈ ఈవెంట్ కోసం రిజిస్ట్రేషన్ తేదీ అక్టోబర్ 17 తేదీతో ముగిసింది. రిజిస్ట్రేషన్, ప్రవేశం ఉచితం. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారంఈ సదస్సుకు 1,110 మంది ప్రతినిధులు, 190 మంది ఎగ్జిబిటర్లు, 83 మంది స్పీకర్లు, 422 మంది హ్యాకథానర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఆసక్తి ఉన్న వారు మిగతావివరాల కోసం https://amaravatidronesummit.com/index.htmlకు లాగిన్ అయి తెలుసుకోవచ్చు.

ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు హాజరవుతున్నారు. నదీ తీరంలో ఏర్పాట్లపై ఇప్పటికే వివిధ శాఖల అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

ఏమిటీ ప్రదర్శన, ఎందుకోసం?

డ్రోన్లను ఇప్పటి వరకు సైన్యం మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తోంది. అది కూడా వ్యూహాత్మక అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఇప్పుడు వీటిని పౌర సేవల్లో వినియోగించేలా విధాన రూపకల్పన కోసం ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అఖిల భారత స్థాయలో అక్టోబర్ 2 నుంచి ఢిల్లీలో ప్రదర్శన జరుగుతుంది. కేంద్ర పౌర విమానయానశాఖతో కలిసి ఏపీ ప్రభుత్వం డ్రోన్‌ సమ్మిట్‌ నిర్వహించతోంది. ‘దేశంలో డ్రోన్‌ రంగం ఆకాశమే హద్దుగా ఎదుగుతోంది. విభిన్న రంగాల్లో డ్రోన్ల ప్రయోగం విజయవంతంగా జరుగుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వరదల సమయంలో బాధితులకు ఆహారం, మందులు అందజేయడానికి డ్రోన్లు ఉపయోగించారు. ఇలా డ్రోన్లను విభిన్న అవసరాలకు ఉపయోగించే విధానాన్ని అభివృద్ధి చేయాలి. ఇందుకోసం ఒక ఎకో సిస్టమ్‌ను సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డ్రోన్‌ సిటీ నిర్మించాలని యోచిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం సదస్సు నిర్వహిస్తోంది’ నిర్వాహకులు చెప్పారు.

డ్రోన్ల ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు...

డ్రోన్లను ప్రజా అవసరాలకు ఉపయోగించడం కోసమే అమరావతిలో రెండు రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. డ్రోన్‌ ప్రాధాన్యాన్ని గుర్తించి దేశంలో అందరికంటే ముందుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2015లోనే డ్రోన్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానానికున్న ప్రాధాన్యతను గుర్తించినందునే అందరి కంటే ముందు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. డ్రోన్ల పరిశోధన, అభివృద్ధి, తయారీ కార్యక్రమాలకు ప్రభుత్వపరంగా చేయూతనందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

డ్రోన్‌ రంగానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలనూ ఒకేచోట కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అమరావతిలో జరిగే డ్రోన్‌ సదస్సులో తయారీదారులు, పెట్టుబడిదారులు, ఐఐటీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొంటున్నాయి. ఎవరెవరు ఏయే అవసరాల కోసం డ్రోన్లు ఉపయోగించుకోవాలనుకుంటున్నారో తెలుసుకొని దాని ప్రకారం ఒక విధానాన్ని రూపొందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక.

22వ తేదీ సాయంత్రం కృష్ణా నది ఒడ్డున పున్నమిఘాట్‌లో 5 వేల డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద ప్రదర్శన జరుగుతుంది. ఆకాశంలో ఈ డ్రోన్లతో విన్యాసాలు నిర్వహిస్తారు. డ్రోన్ ఎయిర్ షోలో అమరావతి ఆకృతి వచ్చేలా విన్యాసం ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. ఈ ప్రదర్శన కోసం తాత్కాలిక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. 5 వేల డ్రోన్లు ఈ విన్యాసంలో పాల్గొంటాయి. రేడియో కమ్యూనికేషన్ విధానంలో వీటిని ఆపరేట్ చేస్తారు. కంప్యూటర్ లో త్రీడీ విధానంలో డిజైన్ చేసి ప్రోగ్రామింగ్ ప్రకారం డ్రోన్ల ప్రదర్శన ఉంటుంది. సుమారు 17 నిమిషాల పాటు ఈ ప్రదర్శన ఉంటుంది.

డ్రోన్ల డిజైన్లు ఎన్నెన్నో...

డ్రోన్ల డిజైన్లు రకరకాలుగా ఉన్నాయి. అరచేతిలో ఇమిడేంత చిన్న వాటి మొదలు 2 మీటర్ల సైజుండేంత వరకు డ్రోన్లు ఉన్నాయి. రెక్కలు, సైజు, సామర్థ్యం, రేంజ్, పవర్ సోర్స్, వాటిలో వాడే కెమెరా పరికరాలు, మోటార్లను బట్టి డ్రోన్లు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే వ్యవసాయ రంగంలో ఎరువుల్ని ఆకాశం నుంచి చల్లేందుకు వీలైన డ్రోన్లు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులను పసిగట్టే డ్రోన్లూ ఉన్నాయి. విజయవాడలో ఇటీవల వరదలు వచ్చినపుడు డ్రోన్ల ద్వారా ఆహార పదార్ధాలను సరఫరా చేశారు.

ధర ఎంత ఉండవచ్చు..

డ్రోన్ల సైజును బట్టి ధరలు ఉన్నాయి. అతి తక్కువగా 2వేల రూపాయలకు కూడా డ్రోన్లు ఉన్నాయి. పని తీరు, సామర్ధ్యాన్ని బట్టి డ్రోన్ల ధరలు ఉన్నాయి. సైన్యం వాడే డ్రోన్ల ధరలు లక్షల్లో ఉన్నాయి. ఇజ్రాయిల్ వాడుతున్న డ్రోన్ల ధరలు కోట్లలో ఉన్నాయి. అమెరికా నుంచి ఇండియా దిగుమతి చేసుకోనున్న ప్రిడేటర్ డోన్లు ఒక్కొక్కటి 14 వందల కోట్ల రూపాయలు. 31 డ్రోన్లకు భారత్ మొత్తం 34,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది.

డ్రోన్ల చరిత్ర ఇలా మొదలైంది..

డ్రోన్లకు సుదీర్ఘ చరిత్ర ఉంది. మానవరహిత వైమానిక వాహనాలే ఈవేళ్టి డ్రోన్లు. కాలానుగుణంగా ఇవి మారుతూ వచ్చాయి. ఆటోమేటెడ్ ‘డ్రోన్స్’ లేదా రిమోట్‌గా నియంత్రించే వాహనం. నియంత్రిత స్థాయిలో వేగం, ఎత్తుతో ప్రయాణించగలవు. వాస్తవానికి మొదటి ప్రపంచ యుద్ధం సమయంలోనే బ్రిటన్, అమెరికా కలిసి పైలట్ లేని విమానాలను అభివృద్ధి చేశాయి. 1917 మార్చిలో వీటిని పరీక్షించారు.


1918 అక్టోబర్ లో అమెరికన్ ఏరియల్ టార్పెడో ను పరీక్షించింది. అయితే అవి చాలా పెద్దగా ఉండేవి. యుద్ధ అవసరాలకే పనికి వచ్చేవి. ఇప్పుడు వాటి సైజు బాగా తగ్గి అరచేతిలో ఇమిడేంత చిన్న వాటి వరకు వచ్చాయి. అన్ని అవసరాలకు పనికి వచ్చేలా వీటిని తయారు చేస్తున్నారు.

డ్రోన్ అంటే నిర్వచనం ఏమిటీ?

అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- మానవరహిత వైమానిక వాహనం (యుఏవీ) నుంచి పేరు పుట్టింది. ఇది ఒక ఎయిర్‌బోర్న్ సిస్టమ్. భూమి మీద నుంచి మనిషి ఆపరేట్ చేసే పరికరం. రిమోట్‌గా లేదా ఆన్‌బోర్డ్ కంప్యూటర్ ద్వారా నిర్వహించే గాల్లో ఎగిరే చిన్న వాహనం.

ఎవరి ప్రయోగం ఇది...

ఇప్పుడు వాడుతున్న డ్రోన్ ఆవిష్కరణ తొలిసారి 1970, 1980లలో జరిగింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో పుట్టి ఇజ్రాయిల్ లో పెరిగిన కరీం అనే ఏరోస్ఫెస్ ఇంజినీర్ ఈ ఆధునిక అన్ మాన్డ్ ఏరియల్ వెహికల్ ను ఆవిష్కరించారు. కరీం కు చిన్నప్పటి నుంచి ఏవియేషన్, ఇంజినీరింగ్ అంటే మక్కువ. ఆయన ఈ డ్రోన్ ను తయారు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. 1970లలో యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లిన తర్వాత లీడింగ్ సిస్టమ్స్ ను ప్రారంభించి మానవ రహిత వైమానిక వాహనాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. ఆల్బాట్రాస్ అనే డ్రోన్ నమూనాను సృష్టించాడు. నేటి తేలికపాటి డ్రోన్‌లకు అది దారితీసింది. దీని బరువు 200 పౌండ్లు అంటే సుమారు 91కిలోలు. ఇది అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్ ను ఆకర్షించింది. ఆతర్వాత రకరకాల డ్రోన్లు వచ్చాయి.

Tags:    

Similar News