REDSANDEL - TIRUPATI | మచ్చా... ఇప్పుడు యాపీనేనా..
తిరపతి తాతయ్యగుంట గంగమ్మకు కోపం వచ్చిందంట. అందుకేనా యర్రపుష్ప జైలుకుపోయింది!
By :  SSV Bhaskar Rao
Update: 2024-12-13 13:00 GMT
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా. పుష్ప అంటే ఫైర్ యా.
తిరుపతిలో ఏందియో. యాడయినా నేనే బాసు. కాదా..?
మచ్చ... సరేలే రా రేయ్... కేశవ కిండల్ గా ఉంది రా నీకో.. 
అబ్బా.. నేనేమంటిబా... 
నువ్వేమంటావు కేశవా. ఇప్పుడు నీకు యాపీగా ఉండలా. నన్ను పోలీసోళ్ళు ఎత్తుకొని పోతా ఉంటే నవ్వతా ఉండవు రా నువ్వు. కేశవ చెప్తారా నీ సంగతి. 
అబ్బా... ఊరుకో మచ్చా. నేను ఏమన్నా అంటినా ఇప్పుడా. 
నాకు ఎంత బాధ వుండాడో నీకు తెల్సా ..
అబ్బ చా... ఊరికే ఉండరా అబ్బా..
తిరపతిలో ఎర్రచందనం యట్టా తీసుకపోతా ఉండారో.. అందరికీ తెలుసు. 
నేనే అదే చేస్తి. ఊరికే లెక్క వస్తా ఉండేది. 
నేనేమన్నా మోసం జెస్తినా..
కట్టపడితి. కేశవా... 
మనకు సరిగా రేటు ఈ లేదనే కదా మంగళం శీనుకు యతిరేకంగా పోతిమి.
మనమేమన్నా మోసం జేసినామా..?
మంగళం సీను అంటే పక్కన పెట్టుబా.. కేశవా
నువ్వు కూడా నన్ను మోసం జేస్తివి కదరా.. 
మచ్చా.. నేనేం చేసినానబ్బా..
అబ్బ చా.. కాదా.. ఊరుకుండరో కేశవ.. కాదురా..
పుష్ప వన్ తీసినప్పుడు సినిమా.. అంతా అబ్బో.. యబ్బో  అంటిరి. 
నాకప్పుడే తెలుసురా.. మీరు ఏదో నాకు ఫిట్టింగ్ పెడతావుండారని. 
ఊరుకో మచ్చా.. ఆయన్ని చూడలేదంటే నమ్మకపోతివి. చూసింది అంటే.. నమ్మకపోతివి.
ఇప్పుడేంది మచ్చా అట్టా అంటాండావో..
అవునుయా..
పుష్ప-2 తీసినప్పుడు. నువ్వేం చెప్పినావు రా. ఎర్రచందనమే కాదు .మచ్చా గంగమ్మను కూడా గుర్తు చేసుకోమన్నావు. తిరుపతిలో నడిఈధి గంగమ్మ, తాతయ్యగుంట గంగమ్మ పవర్ఫుల్ అని జెప్పినావా? లేదా కేశవా??
అవును మచ్చా.. నిజ్జిమే.. నేనే చెపితిని. దాంట్లో తప్పేముండాది మచ్చా.
అవును మచ్చా చెప్పినవ్.
పుష్ప-2లో తాతయ్యగుంట గంగమ్మ జాతర మొత్తం చూపించిన. యాసం కూడా వేసిన. జుట్టు ఇరబోసుకొని, మెళ్ళో నిమ్మకాయ దండేసుకుని, ముఖానికి రంగు బూసుకోని ఎగర్తా ఉంటి. 
కేశవా .. అవునా కాదా జెప్పు.
నువ్వేమో.. నా పక్కపక్కనే ఎగరతా ఉంటివి. ఊలలేస్తా వుంటివి. అవునా కాదా మచ్చా. 
ఔ మచ్చ నిజ్జిమే కదా. దాంట్లో యామన్నా తప్పు ఉండదా.
అబ్బా చా. అ పక్కన ఓళ్లు ఎందుకు వచ్చినారుబ్బా. అప్పుడే నాకు డౌట్ కొట్టినాది రా. 
ఊరుకో మచ్చా... దీంట్లో డౌట్ ఎందుకు మచ్చా. జాతరన్నాక అందరూ వచ్చారు. దానికి మనం అనలేం కదా మచ్చా. 
అవును రా కేశవ. తాతయ్య గుంటగంగమ్మ పవర్ఫుల్ అని నువ్వే చెప్తే కదా. సినిమా ఇడదల కాకముందే. ఆ అమ్మ కాడికి పోదామంటే ఇప్పుడు ఎందుకులే మచ్చ అంటివి. 
ఇప్పుడేమైంది జూడు. 
నాకు తెలుసు మచ్చా ఆ యాసం యేసుకోని నేను ఎగరత ఉంటే... రాకూడనోళ్ళందరూ వచ్చినార్ర. అప్పుడే అనిపించింది. నాకు ఈళ్లంతా కలిసి ఏదో ఫిట్టింగు పెట్టినారని.
ఇప్పుడు సూడు యా.
నేను సినిమాకు పోతే.. వాళ్ళు ఎవరో వచ్చినారంట.
తొక్కుకుని సచ్చిపూడిస్తే, నాకేంది మచ్చా ఈ కట్టం.
అయినా...
నాకు తెలియక అడుగతాండా..
ఈ సినిమా తీసింది నేనే. 
దీంట్లో నేనే ఈరో.
నా సినిమా చూడడానికి నేను వచ్చినా. 
నా పాటికి నేను కుర్చీలో కూసున్నా.. 
నా కాలిపైన..  నా కాలే యేసుకున్నా..
 నా పాటికి నేను సినిమా చూస్తా ఉంటే. 
ఇదేంది మచ్చా. 
సినిమా అన్నాక జనం వస్తారు. తోసుకోకుండా  జూసుకోవాల. ఆమె ఎవరో బయట చచ్చిపోతే.. 
దానికి నాకు నేనేమి జేసేది మచ్చా. 
ఇదేమి న్యాయం బా.. 
నాకు తెలుసులే మచ్చా. 
ముందు పుష్పా తీసినప్పుడే... పవన్ బాబాయి ఒక మాట చెప్పినాడు.
అప్పుడే నాకు డౌట్ కొట్టినాది కేశవ. 
ఆయనేం చెప్పినాడు. ఏమి ఎరికో.. నాకు ఎట్లా తెలుసబ్బా.
అదే రా సామి.. 
బెంగళూరులో పవన్ బావ ఏమన్నాడు.
ఎర్రచందనం దొంగతనం చేసే.. సినిమాలతో హీరోయిజం 
చేస్తా ఉండారు. అని చెప్పలా. నువ్వు కూడా ఇన్నావు కదరా కేశవ.
ఔ మచ్చా.. నిజిమే.. దానికి నాకు ఏమి సంబంధం మచ్చా. 
నాకు అప్పుడే డౌట్ కొట్టినాది. సరేలే అని గమ్మునే వుండినా.
ఎలక్షన్లప్పుడు నా స్నేహితుడు అనే కదా. నేను నంద్యాలకు బోయింది. 
అప్పుడేమో నన్నువైసిపి వాళ్ళకి మద్దతు ఇచ్చినారు అని చెప్పి కేసు పెడితిరి. 
సామీ.. నేను పోయింది అందుకు కాదు. అని జెప్పుకుంటే కోర్టులో ఇన్నేరు. వదిలేసినారు.
సరేలే అనుకుంటి.
మచ్చా..కేశవ..
పుష్ప-2  ఇడదల చేస్తేనే. టిక్కెట్టు పెంచుకోమని గూడా ఆంధ్ర గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇచ్చిండ్ల. 
అది పక్కన పెడదాం లే..
నా సినిమా విడుదల చేస్తా ఉంటే..  
ఆ గుంతకల్లు, పాకాలలో నా బోర్డులు పెట్టమని వైసిపి వాళ్ళకి నేనేమైనా చెబితినా. లేదే..
వాళ్ల సంతోసం.. వాళ్ళిట్టం. 
నా సినిమా. నేను చూడాలనుకున్న.
హాలుకుపోయిన. బయట యామి జరగతా వుండాదని నా కెట్ట తెలుస్తదిబ్బా.
అయినా, అది నాకు ఏమన్నా సంబంధం ఉండదు కేశవ. 
రేయ్ కేశవ.  మచ్చా.. ఇప్పుడు యాపీనే గదా. 
బాసు.. వాళ్ల బాసు.. అంతా సంతోసమా..?
తిరపతిలో ఏమంటాడారబ్బా..
మెగాస్టార్ అభిమానుల్లో స్పందన కనిపించడం లేదు. హైదరాబాదులో జరిగిన ఘటనపై సీనియర్ జర్నలిస్ట్ మించల నాగరాజు ఏమన్నారంటే,
"మెగ ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ హీరోలుగా వచ్చే సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో సినిమా థియేటర్లకు వీరే కాదు. మిగతా సినిమాల కథ నాయకులు వెళ్లకపోవడమే మంచిది" అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 
ఇంకా ఆయన ఏమంటున్నారంటే, "స్టార్ డం కలిగిన సినిమాలు కావచ్చు. రాజకీయ ప్రముఖులు హాజరయ్యే సభలకు ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారో, సినిమా హాళ్ల వద్ద అది సాధ్యం కాదు" అనే విషయాన్ని ప్రముఖులు గుర్తించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి పార్టీ ప్రారంభించే సమయానికి ముందే అవిలాల చెరువులో వందలాది ఎకరాలు లక్షలాదిమందితో నిండిపోయింది. ఆ సందర్భంలో కూడా వెల్లువలా దూసుకు వచ్చిన అభిమానుల వల్ల ఓ తరంగాన్ని తలపించింది. అప్పట్లో ఒకరు ఇద్దరు రైలు ప్రమాదంలో అభిమానులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కూడా అల్లు అరవింద్ స్వయంగా వెళ్లి బాధిత కుటుంబానికి పరిహారం అందించి సాంత్వన చెప్పారు. ఈ ఘటనకు తిరుపతిలోని ప్రస్తుతం జనసేనలో ఉన్న నాయకులు కూడా సాక్షులె. 
దీంతోపాటు గతంలో రాజకీయ నాయకురాలిగా మారిన సినిమా హీరోయిన్ విజయశాంతి పేదలకు చీరల పంపిణీ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కూడా తొక్కిసలాట జరిగిన విషయాన్ని ఓ జర్నలిస్టు గుర్తు చేశారు.