అరెస్టులు దాటుకొని..విజయవాడకు చేరుకుని
అంగన్‌వాడీలను అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. వందల సంఖ్యలో నేతలను గృహ నిర్బంధం చేశారు. అయినా బెదరకుండా వేలాది మంది విజయవాడకు చేరుకున్నారు.;
By : Vijayakumar Garika
Update: 2025-03-10 05:16 GMT
ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్‌వాడీలు ఏకమయ్యారు. తమ సమస్యల పరిష్కారం కోసం తమ గళం వినిపించేందుకు ఓ చోట చేరారు. పోలీసుల అరెస్టులు దాటుకొని విజయవాడకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ముక్త కంఠంతో విజయవాడ ధర్నా చౌక్ వేదికగా కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు హెచ్చరికలు జారీ చేయనున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలు తీవ్రతరం చేస్తామని అల్టిమేటం ఇవ్వనున్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తమ సమస్య పరిష్కారం కోసం నిరసనలు తెలిపేందుకు ఇదే అనువైన సమయమని ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీలు భావించారు. విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీనికి వామ పక్ష పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు మద్దతు తెలిపారు. ఈ మహా ధర్నా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీలు విజయవాడకు తరలి వచ్చేందుకు సన్నద్ధం అయ్యారు. అయితే ఎక్కడి వారిని అక్కడే నిలువరించి, విజయవాడ ధర్నా చౌక్‌కు ఎవరినీ చేరనీకుండా చేయాలని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడకు రానీకుండా ఏ జిల్లా అంగన్‌వాడీలను ఆ జిల్లాలోనే అడ్డుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా కీలక నేతలను, కార్యకర్తలను ఆదివారం రాత్రి నుంచే హౌస్ అరెస్టులు చేయడం మొదలు పెట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం, చిత్తూరు, తిరుపతి, కడపతో పాటు పలు జిల్లాల నాయకులను ఈ రకంగా గృహ నిర్బంధం చేశారు.
అయినా అంగన్‌వాడీలు విజయవాడ మహాధర్నాకు వెళ్లాలని పట్టుబట్టారు. పోలీసుల వలయాలను ఎలాగై ఛేదించాలని నిర్ణయించుకున్నారు. కొంత మంది రైళ్లు, మరి కొంత మంది బస్సులు, ఇతర వాహనాల్లో తరలి వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నాయి. అయితే పోలీసుల కళ్లు కప్పెట్టలేక పోయారు. చివరకు పోలీసులకు దొరికి పోయారు. కాకినాడ జిల్లాకు చెందిన 30 మందిపైగా అంగన్‌వాడీలను అన్నవరం పోలీసు స్టేషన్‌లోనే పోలీసులు అడ్డుకున్నారు. నంద్యా జిల్లాలో ఇదే రకంగా అంగన్‌వాడీలను అరెస్టు చేసి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌కు తరలించి నిర్బంధించారు. కడప జిల్లా నుంచి వస్తున్న 41 మంది అంగన్‌వాడీలను మైదుకూరులో అడ్డుకున్నారు. మన్యం జిల్లా నుంచి తరలి వస్తున్న అంగన్‌వాడీలను కొమరాడ మండలం గుమడ రైల్వేస్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇలా వేలాది మందిని పోలీసులు రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్‌లలో అడ్డుకున్నారు.
అయినా వేలాది మంది అంగన్‌వాడీలు పోలీసుల అరెస్టులకు బెదరకుండా విజయవాడ మహా ధర్నాకు వచ్చారు. పోసుల నిర్బంధం అడుగడుగునా కొనసాగినా విజయవాడ మహాధర్నా సోమవారం జరుగుతుందని నేతలు ప్రకటించడంతో ఆ పిలుపును అందుకున్న వేలాది మంది కార్యకర్తలు విజయవాడ ధర్నా చౌక్‌కు చేరుకున్నారు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ ఉత్తర్వులు సవరించాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, 42 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలను అమలు చేయాలని వంటి పలు డిమాండ్‌లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం విజయవాడ ధర్నా చౌక్‌లో మహా ధర్నా చేపట్టనున్నారు.