25 ఏళ్లనాటి 'క్రిమినల్'ను పట్టిచ్చిన పెళ్లి పత్రిక!
కట్టుకున్న భార్యపై అనుమానంతో ఆరు నెలల పసికందును పొత్తిళ్లలో చంపి ఎన్నో అవతారాలు చాలించినా పోలీసులు కనిపెట్టారు. కటకటాల వెనక్కి నెట్టారు.
By : The Federal
Update: 2024-11-26 02:50 GMT
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు కనిపెట్టినా పోలీసులు కలుగులోని ఎలుకను పట్టుకోగలిగారు. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఆరు నెలల పసికందును పొత్తిళ్లలో చంపి ఎన్నో అవతారాలు చాలించినా పోలీసులు కనిపెట్టారు. కటకటాల వెనక్కి నెట్టారు. అనంతపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వివరాలేమిటంటే...
ఉమ్మడి అనంతపురం జిల్లా గుడిబండ మండలం దిన్నెహట్టి గ్రామంలో 25 ఏళ్ల కిందట ఈ సంఘటన జరిగింది. ఆ గ్రామానికి చెందిన తిప్పేస్వామికి కరియమ్మ అనే మహిళతో పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు. రెండో పిల్లాడు పుట్టిన తర్వాత తిప్పేస్వామికి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. 1998లో దసరా రోజున పిల్లలతో పూజ చేయించాలని మారెమ్మ ఆలయానికి తీసుకువెళ్లాడు. 6 నెలల తన రెండో కుమారుడు శివలింగమయ్య, భార్యను ఆలయానికి తీసుకెళ్లాడు. అనుమానంతో రగిలిపోతున్న తిప్పేస్వామి తన భార్య ప్రదక్షిణ చేస్తుండగా కొడుకును లాక్కొని సమీపంలోని మామిడి తోటలోకి పరుగెత్తాడు. అక్కడ గొంతు పిసికి చంపేశాడు. ఆ తర్వాత అక్కడే ఓ గొయ్యి తొవ్వి పూడ్చి పారిపోయాడు. ఈ ఘటనపై అదే ఏడాది అక్టోబరు 18న గుడిబండ పోలీస్ స్టేషన్‌లో కరియమ్మ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కొంతకాలం హడావిడి చేశారు. ఆ తర్వాత కేసు మూసేశారు. నిందితుడు కనిపించలేదని చెప్పారు. ఆ కథ అక్కడితో ముగిసిపోయిందనుకున్నారు అందరూ.
ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటుతో అనంతపురం జిల్లా కూడా రెండు అయింది. గుదిమండ ప్రాంతం శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోకి వచ్చింది. కొత్త పోలీసు అధికారి వచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులపై ఎస్పీ దృష్టి సారించారు. ఈక్రమంలో చిన్నారి హత్య కేసు విచారణను డీఎస్పీ వెంకటేశ్వర్లు చేపట్టారు. అసలు ఈ తిప్పేస్వామి ఎవరు అనే దానిపై తీగలాగితే డొంక కదిలింది.
దిన్నేహట్టి గ్రామానికి చెందిన బాంబే నాగరాజును విచారించినపుడు నిందితుడు తిప్పేస్వామిని కర్నాటకలో ఓ చోట ఉంటున్నట్టు సమాచారం అందింది. పోలీసులు నిందితుడు తిప్పేస్వామి ఇంట్లో సోదాలు చేశారు. అక్కడ ఓ పెళ్లి పత్రిక దొరికింది. అందులో ఈ కరియమ్మ పేరు ఉంది. ఇప్పుడున్న భార్య పేరు అందులో లేదు. పైగా తిప్పేస్వామి పేరు కూడా మారిపోయింది. ఇదేంట్రా అనుకుంటూ పోలీసులు తిప్పేస్వామి ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు.
పేరుమార్చి.. పోలీసుల్ని ఏమార్చి..
నిందితుడు తిప్పేస్వామి కర్ణాటకలోని హాసన్ జిల్లా న్యామనహళ్లిలో ఉంటున్నాడు. పేరు కృష్టగౌడుగా మార్చుకున్నాడు. అక్కడే ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన స్వగ్రామంలో మిత్రుడైన బాంబే నాగరాజును ఆహ్వానిస్తూ పత్రిక పంపాడు. నాగరాజు పెళ్లికి వెళ్లొచ్చాడు. విషయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో పెళ్లిపత్రిక ఆధారంగా అక్కడికి వెళ్లి తిప్పేస్వామిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
మొత్తం మీద నిందితుడు తిప్పేస్వామి 25 ఏళ్ల తర్వాత దొరికాడు. నేరస్తుడు ఎక్కడో చోట ఏదో ఒక క్లూ వదిలేస్తాడంటే ఇదేనేమో.. అలా నిందితుడు దొరికిపోయారు. కేసు మిస్టరీని ఛేదించిన పోలీసుల్ని వారి పై అధికారులు మెచ్చుకున్నారు. రివార్డులు ప్రకటించారు.