KUPPAM - CM Chandra Babu | కుప్పం ప్రయోగశాలలో 'పది సూత్రాల ఫార్ములా'
స్వర్ణకుప్పం విజన్ -2029 ద్వారా రెండు పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించారు. ఈ ఫలితాల ఫలాలు రాష్ట్రానికి ఎలా పంచబోతున్నారు. సీఎం కార్యాచరణ ఏమిటి?;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-01-07 14:02 GMT
కుప్పం నియోజకవర్గాన్ని ఐదేళ్లలో "సంపద సృష్టి. తద్వారా ఆరోగ్యం. సంతోషం" పంచడమే ప్రధాన ఉద్దేశ్యంగా స్వర్ణకుప్పం విజన్ -2029 కార్యాచరణ సిద్ధం చేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో 16 లక్షల మంది పంచుకున్న అభిప్రాయాలను మేళవించి, ఈ డాక్యుమెంట్ సిద్ధం చేసినట్లు సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో వెల్లడించారు.
రాష్ట్రంలో ఏ కార్యక్రమమైనా కుప్పం నుంచే ప్రారంభించడం ఆనవాయితీ. సేంద్రియ వ్యవసాయానికి పునాది వేయడంతో పాటు 'కుప్పం'ను సోలార్ వెలుగులతో నింపాలని లక్ష్యంగా పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. పాడి రైతుల కోసం ఓ భారీ ప్రాజెక్టు, మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసే లక్ష్యంగా చేసుకుని వారి ఆర్థిక ప్రయోజనాల కోసం అలిప్ అనే ఓ ఎన్జీఓను తీసుకు వచ్చారు.
కుప్పం నియోజకవర్గాన్ని ఐదేళ్ల లక్ష్యంతో స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్లో పది ప్రాథమిక లక్ష్యాలను కూడా ఎంచుకున్నారు. దేశంలో కుప్పంను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సేంద్రియ వ్యవసాయం, సోలార్ విద్యుత్ వెలుగులు నింపడం ద్వారా ప్రజల ఆర్థికస్వావలంబనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కుప్పం ఎమ్మెల్యే, సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత సీఎం చంద్రబాబు రెండు రోజుల పర్యటన మంగళవారం ముగిసింది. ఆరు నెలల వ్యవధిలోనే ఆయన కుప్పంలో పర్యటించడం ఇది రెండోసారి.
సీఎం ఇంకా ఏమి చెప్పారంటే..
"కుప్పంలో పేదరిక నిర్మూలన. కాలుష్యరహితం. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. వంద శాతం సోలార్ విద్యుత్ వినియోగం పెంచడమే ప్రధాన కర్తవ్యం" అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక్కడ సాధించే ఫలితాల బీజాలు రాష్ట్రమంతా వెదజల్లి, అభివృద్ధిని పరుగులు తీయిస్తా అని కూడా అన్నారు.
అభివృద్ధి పరుగులు
"2024 ఎన్నికల తర్వాత నేను 2వ సారి కుప్పం వచ్చాను. కుప్పం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (కడా) ఏర్పాటు చేసి, ప్రత్యేకాధికారిగా యువ ఐఏఎస్ కు బాధ్యతలు అప్పగించా" అని సీెం చంద్రబాబు గుర్తు చేశారు. కుప్పంలో దాదాపు 65 వేల కుటుంబాల వరకూ ఉన్నాయి. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నాం. కుప్పం నియోజకవర్గాన్ని మోడ్రన్, టూరిజం హబ్ గా తయారు చేయడం వంటి నిర్ధిష్ట ప్రణాళికతో స్వర్ణ కుప్పం విజన్ – 2029 రూపొందించామని వివరించారు. ఇందులో ప్రధానంగా..
1.ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేస్తాం.
2. కుప్పం నియోజకవర్గంలో పేదరికం లేకుండా ఉండేందుకు ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తాం.
3.పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి 15 వేల ఉద్యోగాల కల్పన
4.100 శాతం సోలరైజేషన్, రహదారుల నిర్మాణం
5.జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు,
6. నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటు
7. కార్గో ఎయిర్ పోర్టు పూర్తిచేయడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం,
7.100 శాతం మరుగుదొడ్లు నిర్మాణం,
8.అర్హులకు పెన్షన్లు, దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ,
9. సూపర్ స్పెషాలిటీ ఏరియా ఆస్పత్రి నిర్మాణం,
10.జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత నీరు, ఎలక్ట్రికల్ సైకిళ్లు పంపిణీ, డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహకాలు అందిస్తాం.
అని స్వర్ణకుప్పం విజన్ 2029 ప్రాథమిక లక్ష్యాలను విశ్లేషించారు.
రుణం తీర్చుకుంటాం
కుప్పం నియెజవర్గ ప్రజలు ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిపించడం అంటే ఆషామాషీ కాదని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఇక్కడి ప్రజలు, నాయకుల్లో ఆ విశ్వాసం సంపాదించుకున్నామని, పార్టీకీ కంచుకోటగా మార్చిన ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. టీడీపీ కార్యకర్తలను కష్టాలకు గురి చేశారని గతాన్ని నెమరు వేసుకున్న సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలే.. తనలో పట్టుదల పెంచడంతో పాటు విజన్ డాక్యెమెంట్ తయారు చేయడానికి ఆలోచన రేకెత్తించిందని చెప్పకనే చెప్పారు.
ఆ రోజు హేళన చేశారు...
ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ రాళ్లు, గుట్టలు, పొదలతో నిండి ఉండేదని సీఎం చంద్రబాబు పాత రోజులు మననం చేసుకున్నారు. 1995లో విజన్ -2020 అని ప్రకటిస్తే, అంతా హేళన చేశారు. ఈ రోజు పరిస్థితి ఏమిటి? ఫలితాలు ఎంతమంది అనుభవిస్తున్నారో గుర్తు చేసుకోవాలని ఆయన హితవు పలికారు. "అందరూ రేపటి గురించి ఆలోచన చేస్తే నేను పదేళ్లకు ఎలా ఉండాలని లక్ష్యం నిర్దేశించుంటా. పరుగులు దీయిస్తా. అందులో రాజీపడే సమస్య లేదు. కాబట్టే ఉమ్మడి రాష్ర్టంలో చేసిన పనులు ఫలితాలు ఇచ్చాయి. ఈ తరహా కార్యాచరణలో రాజీ అనే మాటే లేదు" అని స్పష్టం చేశారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందంటే. ఆ నాడు తాను వేసిన బీజాలే అని సీఎం చంద్రబాబు ఉదహరించారు.
"సమష్టిగా కష్టపడితే ఫలితాలు అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంటాయి. కుప్పంలో ఆ ఫలితాలు సాధిస్తాం" అని ఆయన ధీమాగా చెప్పారు.
నీటి భద్రతకు ప్రాధాన్యం
రాష్ట్రంలో సేద్యపు నీటి రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. జూన్ నెల లోపు హంద్రీ నీవా జలాలు కుప్పంలోని పాలారు వాగుకు తీసుకుని రావడం తథ్యం అని ఆయన హామీ ఇచ్చారు. దీనికరోసం వాగుపై చెక్ డ్యాం నిర్మాణంతో పాటు గోదావరి జలాలను బనకచర్లకు తీసుకుని రావడంలో రాజీ పడే ప్రసక్తి లేదని బాబు పునరుద్ఘాటించారు.