పేదలకు వైద్యం, విద్యార్థులకు బోధన మరింత సంక్లిష్టంగా మారింది. రాష్ట్రంలో బోధానాస్పత్రులకు ప్రొఫెసర్ల కొరతగా మారింది. రెండేళ్ల కిందట పీహెచ్సీ (Primary Health Center's)లో అమలు చేసిన రేషనలైజేషన్ గ్రామీణ వైద్యం కునారిల్లింది. ఈ పరిస్థితుల్లో 54 మంది వైద్య నిపుణులను లోకాయుక్త తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపింది. అంతకుముందు నుంచే విద్యార్థులకు బోధన, ప్రయోగాల విషయంలో బోధనాస్పత్రుల్లో సూపర్ స్పెషాలటీకి అవసరమైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ల కొరత తీవ్రంగా ఉంది. అనేకసార్లు నోటిఫికేషన్లు జారీ అయినా, పోస్టులు భర్తీకి నోచుకోని పరిస్థితి. సర్వీసులో ఉన్న వారికి పదోన్నతుల మాటేమిటి? ఈ విషయం పక్కన ఉంచితే.. ఉన్నవారితోనే సర్దుబాటు చేయాల్సిన పరిస్థితుల్లో వైద్య విద్యార్థులకు నాణ్యమైన బోధన ఎంతవరకు అందుతుందనే ప్రశ్న తెరమీదకు వచ్చింది.
రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ తీరు, ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ఎలా ఉన్నాయంటే..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని రాష్ట్రంలో డీఎంఈ, డీఎస్హెచ్, డీపిహెచ్, ఆయుష్, ఎన్.హెచ్.ఎం (National Health Mission NHM) పరిధిలోని వివిధ విభాగాల్లో 26,263 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 1,01,125 పోస్టుల్లో దాదాపు 26,263 పోస్టులు ఖాళీగా ఉంటే రోగులకు మెరుగైన సేవలు సాధ్యమా? మొత్తం పోస్టుల్లో 25.97 ఖాళీలు ఉన్నాయి. వాటిలో 3,114 డాక్టర్లు పోస్టులే కావడం గమనార్హం. పారా మెడికల్ పోస్టులు కూడా 23,149 ఖాళీగా ఉన్నాయి. పీహెచ్సీలు అటుంచితే, సీహెచ్సీ (Comunity Health Center's) తో పాటు ప్రాంతీయ వైద్య శాలల్లో కూడా ఇదే పరిస్థితి.
రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో కూడా వైద్యులు, సిబ్బందే కాదు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల కొరత ఏర్పడింది. విజయవాడ జీజీహెచ్ లో 314 పోస్టులకు 46, గుంటూరులో 65 వైద్యుల పోస్టులే ఖాళీగా ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ పోస్టులు 38, సీనియర్ రెసిడెంట్ పోస్టులు 78 ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలోని ఆయుష్ విభాగంలో ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ ఆస్పత్రుల్లో 825 పోస్టులకు 407 ఖాళీలు ఉన్నాయి. కాపౌండర్లు, అటెండర్లతో పాటు ఇతర సేవలు అందించే వారిలో 1,601 పోస్టుల్లో 1,131 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
సీఎం స్పందనతో...
ఈ ఏడాది ఆరంభంలోనే విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం ఎన్. చంద్రబాబు "టీచింగ్ ఆస్పత్రుల్లో నిపుణుల భర్తీకి నివేదిక ఇవ్వండి" అని ఆదేశించారు. దీంతో డీఎంఈ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (DH), సెకండరీ హెల్త్ డైరెక్టర్, ఆయుష్, మరియు నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్ట్ (NHM) డైరెక్టర్లు ఖాళీల వివరాలు అందించారు. దీంతో ఎనిమిది వేల ఖాళీల భర్తీకి సీఎం హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సుమారు 3,114 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేటతెల్లమైంది. బోధనాస్పత్రుల్లో 1,484 అధ్యాపక పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణుల కొరత తీవ్రంగా ఉంది.
ఆ కోవలోనే విజయవాడ జీజీహెచ్ లో 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన మాన్-క్లినికల్ విభాగాల్లో 14, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 17 ప్రొఫెసర్ అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థానాలు ఉన్నాయనే విషయం కూడా సీఎం చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో అందిన నివేదకలు స్పష్టం చేస్తున్నాయి.
అసలే నిపుణుల కొరత
రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కొరత ఏర్పడిందా? ప్రభుత్వ శాఖల్లో చేరడానికి ముందుకు రావడం లేదా? అంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఇదే నిదర్శనం
రాష్ట్రంలోని ఎన్ఐఐటీ పరిధిలో 18 మెడికల్ కాలేజీలో ఉన్నాయి. ప్రభుత్వ ఆధీనంలో దాదాపు 13 బోధనాస్పత్రులు ఉన్నాయి. విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పరిధిలో 16 కాలేజీలకు భాగస్వామ్యం ఉంది. కాగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పదేపదే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 2022/6 నంబర్తో 2022 ఆగష్టు 5వ తేదీ డైరెక్టు రిక్రూట్ మెంట్ ద్వారా 375 మంది నియామకానికి, అంతకుముందు 2020లో కూడా 442 మంది నియామకానికి వరుసు నోటిఫికెషన్లు జారీ కావడం వెనుక అర్థం ఏమిటి? అనేది ప్రశ్నార్థకం. ఈ పరిస్థితుల్లో...
నిర్లక్ష్యంపై లోకాయుక్త కొరడా
రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో విధులకు గైర్హాజరవుతున్న 54 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్లను ఎందుకు తొలగించకూడదనే విషయంపై లోకాయుక్త చర్యలకు నోటీసులు జారీ చేసింది. ఇదే వైద్య రంగంలో ప్రధాన చర్చకు తెరతీసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో 202లో కృష్ణా జిల్లా ఉయ్యూరు మాజీ సర్పంచ్ లోకాయుక్తలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో వాస్తవ పరిస్థితిపై లోకాయుక్త డీఎంఈ (Director of Medical Education) నివేదిక కోరింది. ఆ విభాగం అందించిన నివేదికతో 78 మంది విధులకు రావడం లేదనే విషయం స్పష్టమైంది. దీంతో డీఎంఈ జారీ చేసిన నోటీసులకు 23 మంది సమాధానం ఇవ్వగా, మిగతా వారు స్పందించలేదని చెబుతున్నారు దీంతో వారిని ఎందుకు తొలగించకూడదనే విషయంలో వివరణ కోరుతూ నోటీసులు జారీ అయ్యాయి. వారిలో ఎక్కువ మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డాక్టర్లు, క్లినికల్ విభాగంలోని కీలక పోస్టుల్లో ఉన్న వారే అని తెలిసింది.
తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీ (Tirupati SV Medical College) లో కూడా 9 మంది ఉన్నారు. వారిలో
ఆర్థోపెడిక్ విభాగం నుంచి
1.ఎం. వెంకట రావు. అసిస్టెంట్ ప్రొఫెసర్
2. వి.సరస్వతి. అసిస్టెంట్ ప్రొఫెసర్
3. బి.కిరణ్ కుమార్. అసిస్టెంట్ ప్రొఫెసర్
4. కె. మధురిమ నాయుడు. అసిస్టెంట్ ప్రొఫెసర్
5. పి .నలిని. పీడియాట్రిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్
6. బి. చంద్రశేఖర్. న్యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్
7. కె .లావణ్య. జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్
8. ఏ. కార్తీక్. రేడియో డయాగ్నసిస్, అసిస్టెంట్ ప్రొఫెసర్
9 . ఈ. శ్రీకాంత్. అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్డియాలజీ విభాగాలకు వారు ఉన్నారు.
రాష్ట్రంలోని కర్నూలు మెడికల్ కాలేజీలో 12 మది, తిరుపతిలో తొమ్మిది మంది, కాకినాడలో 12 మందితో పాటు శ్రీకాకుళం, కడప, విశాఖ ఆస్పత్రులు, కాలేజీల్లోని వైద్య నిపుణులకు తోడుగా కీలక ల్యాబ్ లకు సంబంధించిన నిపుణులు కూడా ఉన్నారు.
తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడుతూ, "డీఎంఈ నుంచి తమకు ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఇది చాలా పాతకేసు" చాలా తేలిగ్గా చెప్పారు. Tirupati SV Medical Collegeలో జనలర్ మెడిసిన్ మినహా మిగతా విభాగాల్లో ప్రొఫెసర్ల కొరత లేదని చెప్పారు. బదిలీలు, డిప్యూటేషన్ పై వెళ్లిన వారు వెనక్కు వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పారు. కాగా , తిరుపతి ఎస్వీ మెడికల్ కలేజీలోని 19 విబాగాల్లో 66 పోస్టుల భర్తీ ప్రక్రియ సాగుతోంది" అని చెప్పారు. నేషనల్ ప్రోగ్రామ్ (NCDC)లో భాగంగా, సర్వైలెన్స్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా మేనేజర్, ఇతర పోస్టులే అని చెప్పారు.
తాజాగా లోకాయుక్త స్పందించిన నేపథ్యంలో మళ్లీ ఎన్ని పోస్టులు ఖాళీ అవుతాయనేది స్పష్టం అవుతుంది. బోధనాస్పత్రుల్లో ఈ ఖాళీల భర్తీ ప్రక్రియను ఎప్పుడు పూర్తి చేస్తుందనేది వేచి చూడాలి.