REVENUE FRAUD|సాగుదార్ల సమగ్ర సర్వేతోనే రికార్డుల్లో మోసాలకి చెక్!
సాగుదార్ల సమగ్ర సర్వేతోనే రెవెన్యూ మోసాలను అరికట్టడం సాధ్యమవుతుందన్నారు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఇఏఎస్ శర్మ. ఈమేరకు రెవెన్యూ మంత్రి అనగాని కిలేఖ రాశారు.
By : Amaraiah Akula
Update: 2024-11-19 09:09 GMT
వాస్తవ సాగుదార్ల సమగ్ర సర్వేతోనే రెవెన్యూ రికార్డుల్లో మోసాలను అరికట్టడం సాధ్యమవుతుందన్నారు ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఇఏఎస్ శర్మ. రెవెన్యూ రికార్డులను గతంలో మాదిరి ప్రత్యక్షంగా చూసే సౌలభ్యం లేకపోవడం వల్ల చిన్న, సన్నాకారు రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు ఆయన. ఈమేరకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ కి నవంబర్ 19న లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం ఇలా..
"గౌరవనీయులైన అనగాని సత్యప్రసాద్ గారికి,
ప్రభుత్వం కంప్యూటరైజెషన్ చేపట్టక ముందు గ్రామాల్లో భూమి రికార్డులు ప్రజలకు అందుబాటులో ఉండేవి. ఏదైనా అనుమానం వచ్చినపుడు వాటిని నేరుగా చూసుకునే అవకాశం ఉండేది. కాగితం మీద చూడగలిగే వారు. కొత్తవి, పాతవి కూడా చూసుకుని ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే సంబంధిత అధికారులను అడిగే వారు. మార్పులకు కారణాలు కూడా సులభంగా కనిపించేవి. రెవెన్యూ అధికారులు రికార్డులలో తారుమారు చేస్తే ఆ విషయాలు ప్రజలలో చర్చకు దారి తీసి బయట పడేవి. ఆ కారణంగా రెవెన్యూ అధికారులు- లంచాలు తీసుకుని- యథేచ్ఛగా రికార్డులను మార్చే అవకాశం తక్కువగా ఉండేది.
ఏటా కలెక్టర్ స్థాయిలో జమాబందీ జరగడం వలన బాధితులు వారి సమస్యలను ఉన్నత అధికారులకు చెప్పుకునే అవకాశం ఉండేది. గ్రామ రికార్డులలో కేవలం భూమి మీద పట్టా హక్కులు ఉన్నవారే కాకుండా కౌలుదారులు, భూమిని ప్రత్యక్షంగా సాగుచేసుకుంటున్న చిన్న, సన్నకారు రైతుల పేర్లు కూడా రికార్డ్ చేయాలి. నా అనుభవం కూడా అదే. గతంలో ఉన్నతాధికారులు అప్పుడప్పుడు ఆ విషయంలో యాదృచ్ఛికంగా, కొంతమంది అనుభవదారులను కలిసి, గ్రామ రికార్డులలో తప్పులు ఉంటే చర్య తీసుకునే వారు.
దేశవ్యాప్తంగా కంప్యూటర్లే దైవం, డిజిటలైజేషన్ (Digitalisation) సర్వ రోగ నివారిణి అనే పరిస్థితి రావడం కారణంగా ప్రజలు గ్రామ రికార్డులను ప్రత్యక్షంగా కాగితం మీద చూసే అవకాశం తగ్గింది. గ్రామ రికార్డులలో తారుమారు జరిగే అవకాశం పెరిగింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ తగ్గడం వల్ల స్థానిక రెవెన్యూ అధికారుల అవినీతి పెరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ వ్యయంతో సర్వేలు చేస్తున్నా అవేవీ గ్రామ ప్రజల సమక్షంలో జరగడం లేదు. ఫలితంగా అవి సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. అటువంటి తప్పుడు సర్ ల వల్ల నష్టపోయేది చిన్నకారు రైతులు, ప్రజలు మాత్రమే.
ఇటువంటి అయోమయమైన పరిస్థితిలో సరైన మార్పులు తీసుకురావాల్సి ఉంది. అలా తీసుకురావాలంటే ముందు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ విభాగం ఉన్నతాధికారుల వైఖరిలో మార్పులు రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా భూములు సాగు చేస్తున్న చిన్నకారు రైతులను కలిసి, వారి హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది. డిజిటైజేషన్ కన్నా ముఖ్యం సమగ్రమైన అనుభవదారుల సర్వే. ఇది ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరగాలి. అటువంటి సర్వే జరగకపోతే, కేవలం డిజిటైజేషన్ వలన ఫలితం ఉండదు. తప్పుడు సమాచారమే రికార్డులలో నమోదు అవుతుంది.
జాతీయ వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం కార్యదర్శి అజయ్ కుమార్ ఈ సమస్యను క్షుణ్ణంగా చర్చించి, ప్రభుత్వం ప్రవేశ పెట్ట వలసిన మార్పులు అనేకం సూచించారు. వాటిని కూడా మీ దృష్టికి తీసుకువస్తున్నా. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం డివిజన్ లో కోనాం వంటి ఎన్నో గ్రామాల్లో తరతరాలుగా భూములు సాగు చేస్తున్న ఆదివాసీలకు జరిగిన అన్యాయాన్ని, నిర్దిష్టమైన సమాచారం ఆధారంగా వివరించారు. కోనాం ఆదివాసీల సమస్య మీద నేను స్వయంగా రాష్ట్ర రెవెన్యూ అధికారులకు ఎన్నోసార్లు లేఖలు రాసినా ఈరోజు వరకు స్పందన కనిపించలేదు.
విశాఖపట్నంలో 2016 జులై లో అజయ్ కుమార్ సహాయంతో "ఆన్లైన్ భూమి రికార్డులు -ప్రజల హక్కులు" మీద పబ్లిక్ హియరింగ్ జరిగినపుడు కోస్తా ఆంధ్రలో రెవెన్యూ రికార్డుల్లో జరుగుతున్న కుంభకోణాలు ఎన్నో బయటకు వచ్చాయి. ఆ విషయాలను నేను అప్పటి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఇప్పటికైనా రాష్ట్ర రెవిన్యూ విభాగం అధికారులు కళ్ళు తెరిచి, ఉన్నత అధికారుల పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా భూమి అనుభవదారుల సర్వే చేపట్టాలి. అజయ్ కుమార్ సూచించిన కేసుల విషయంలో ఉన్నతాధికారులు స్వయంగా తనిఖీలు చేపట్టి, ఆ గ్రామాలలో సాగుచేస్తున్న ఆదివాసీలను, ఇతర చిన్న కారు రైతులను కలిసి, తగిన మార్పులను రెవిన్యూ రికార్డులలో ప్రవేశపెట్టాలి.
గ్రామ రెవిన్యూ రికార్డుల లో తప్పులను సవరించకపోతే, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలితాలు సరిగ్గా పేద ప్రజలకు అందవు. రెవిన్యూ అధికారులలో అవినీతి పెరుగుతుంది. ఆ కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని హెచ్చరిస్తున్నా"
ఇట్లు
ఇఎఎస్ శర్మ అని ముగించారు.
రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలతో పేదలు పడుతున్న పాట్లపై అనేక ప్రజాసంఘాలు వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నది వాస్తవం. ఇప్పటికైనా విద్యావంతుడైన అనగాని సత్యప్రసాద్ లాంటి వారు పేద ప్రజల సమస్యలను గుర్తించాలని, వారికి అండగా నిలిచే సర్వేలను చేయించాలని కోరారు శర్మ.