ఆంధ్రా నర్సింగ్ కాలేజీల్లో జర్మన్ భాష...
విదేశీ ఉద్యోగాలకు ఫారిన్ లాంగ్వేజీ హైవే...;
జనరల్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ కోర్స్ లు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగావకాశాలు కల్పించే కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ లు శ్రీకారం చుట్టాయి. లక్షల్లో జీతం తీసుకునే అవకాశం వారికి కల్పించాలనే ఆలోచన చేశారు. అందులో భాగంగా వారికి జర్మన్ భాష నేర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం 150 మంది నర్స్ లకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు రాష్ట్రంలోని గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ముందుగా గుంటూరులో శిక్షణ కేంద్రం శనివారం ప్రారంభమైంది. కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్రలు ప్రారంభించారు. కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు గిరిజన సంక్షేమ కార్పొరేషన్ ఎండీ సీఏ మణికుమార్ తీసుకున్నారు.
కార్యక్రమానికి హాజరైన నర్సింగ్ విద్యార్థులు
ప్రస్తుతం జర్మనీలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది. వారికి ఆరోగ్య సేవలు అందించేందుకు నర్సింగ్ విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో జర్మనీలో నర్సింగ్ నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే అక్కడ ఉద్యోగాలు సంపాదించాలంటే జర్మన్ భాష తప్పకుండా వచ్చి ఉండాలి. అందుకే ఏపీలో జర్మన్ భాష నేర్చుకునేందుకు ఆసక్తి చూపించే ఎస్సీ, ఎస్టీ నర్సింగ్ నిరుద్యోగులకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎస్టీ కార్పొరేషన్ ఎండీ మణికుమార్ ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధికి చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ల ద్వారా...
ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ లు కలిసి 150 మంది నర్సింగ్ నిరుద్యోగులకు జర్మన్ భాషలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. శిక్షణ తీసుకోవాలని భావించే వారు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డీడీని కానీ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీని కానీ సంప్రదించవచ్చు. వివరాలు తీసుకుని జర్మన్ భాష నేర్పించేందుకు అవకాశం కల్పిస్తారు. సులభంగా జర్మన్ భాష నేర్పించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. పది నెలల కాలం శిక్షణ ఉంటుంది.
ఉచిత వసతీ సౌకర్యాలు
శిక్షణ కాలంలో ఎస్సీ, ఎస్టీలకు ఆయా కార్పొరేషన్ లు ఖర్చులు భరిస్తాయి. లాంగ్వేజ్ నేర్చుకునే నిరుద్యోగులకు భోజన, వసతీ సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. క్లాసుల నిర్వహణ కూడా ఎక్కడికక్కడ ఉంటుంది. జర్మన్ లాంగ్వేజ్ కు సంబంధించిన పుస్తకాలు కూడా ప్రభుత్వమే ఉచితంగా విద్యార్థులకు అందజేస్తారు.
మూడు కేంద్రాల్లో శిక్షణ
జర్మన్ లాంగ్వేజ్ నేర్పించే కార్యక్రమాలను గుంటూరు, తిరుపతి, విశాఖపట్నంలో చేపడతారు. ప్రస్తుతం గుంటూరులో కేంద్రం ప్రారంభమైంది. ప్రభుత్వ భవనాల్లోనే శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఒక్కో శిక్షణ కేంద్రంలో 50 మందికి సరిపోయే విధంగా వసతీ ఏర్పాట్లు చేశారు. గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు ఈ కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ప్రధానంగా కార్పొరేషన్ల ద్వారా శిక్షణ ఇస్తున్నందున కార్పొరేషన్ ఎండీలు బాధ్యత తీసుకుంటారు.
నర్సింగ్ వారికి జర్మనీలో జీతాలు ఎలా ఉంటాయంటే...
జర్మనీలో ప్రస్తుతం జనరల్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ వారికి మూడు లక్షలు పైన నెలకు జీతం ఇస్తారు. జర్మన్ భాష నేర్చుకున్న నర్సింగ్ నిరుద్యోగులకు ఈ అవకాశం లభిస్తుంది. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్న తరువాత వీరిని జర్మనీ దేశానికి వెళ్లేందుకు కూడా ఆయా కార్పొరేషన్ లు సహకరిస్తాయి. జర్మనీలో ఉద్యోగం వచ్చిన తరువాత నర్సులు ఆరు నెలల తరువాత కుటుంబ సమేతంగా జర్మనీలో నివసించేందుకు అక్కడి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. వారి పిల్లలకు ఉచిత విద్యను అక్కడి ప్రభుత్వం అందిస్తుంది.
ఎస్సీ, ఎస్టీలకు మంచి అవకాశం
ఎస్సీ, ఎస్టీల్లో ఎంతో మంది విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని, కొంత కాలం అక్కడ స్థిరపడాలనే ఆలోచనలో ఉన్న వారు ఉన్నారు. అయితే వారికి అవకాశాలు రావటం లేదు. అందుకే వారికి ఉన్నత అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే జర్మన్ లాంగ్వేజ్ నేర్పించే కార్యక్రమం చేపట్టినట్లు ఎస్టీ కార్పొరేషన్ ఎండీ మణికుమార్ తెలిపారు. నెలకు మూడు లక్షలు పైన జీతం ప్రస్తుతం నర్సులకు మన దేశంలో వచ్చే అవకాశం లేదని, జర్మనీలో ఆ అవకాశం ఉన్నందున లాంగ్వేజ్ నేర్పించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే విదేశీ విద్య పథకం అమలులో ఉందని, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. జర్మనీలో నర్సులకు డిమాండ్ ఉన్నందున తాము చేపట్టిన లాంగ్వేజ్ నేర్చుకునే కార్యక్రమం ద్వారా మంచి అవకాశాలను నర్సింగ్ విద్యార్థులు పొందుతారని తెలిపారు.