చేనేత వస్త్రాల విక్రయాలు పెంచడం ద్వారా నేతన్నలకు 365 రోజులు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత,జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. చేనేత వస్త్రాల మార్కెటింగ్ కల్పించడానికి ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం చేనేత పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై పలువురు సభ్యుల అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత సమాధానమిచ్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించకపోవడంతో పాటు నేతన్న సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు. దీంతో ఎందరో చేనేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు. పెట్టుబడుల వ్యయం, అమ్మకాల్లేక చేనేత వస్ట్రాలు గుట్టగుట్టలుగా పేరుకుపోవడంతో పాటు, అప్పలుతీర్చలేక నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు.
నేతన్నలకు స్వర్ణయుగం
2014లో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నా నాటి సీఎం చంద్రబాబు చేనేత పరిశమ్రకు ఎంతో ప్రాధాన్యమిచ్చారని మంత్రి సవిత వెల్లడించారు. చేనేత రంగ అభివృద్ధికి పావలా వడ్డీతో వడ్డీపై రాయితీ ఇచ్చామన్నారు. చేనేత వస్త్రాల అమ్మకాలకు ఆప్కో ద్వారా 20 నుంచి 30 శాతం ప్రత్యేక రిబేట్ ఇచ్చామన్నారు. త్రిఫ్ట్ పథకంతో నూలు, రంగుల, రసాయినా కొనుగోలుపై 40 శాతం అందించామన్నారు. చేనేత సహకార రంగాలకు మార్కెటింగ్ ప్రోత్సాహం కూడా అందించామన్నారు. పవర్ లూమ్ యూనిట్లకు 50 శాతం టారిఫ్ రాయితీ అందించామన్నారు.
నేతన్నలకు జగన్ అన్యాయం
2019 తరవాత వచ్చిన జగన్...నేతన్నలకు తీవ్ర మోసం చేశారన్నారు. నా నేతన్నలు... నా బడుగు బలహీన వర్గాలు.. అని చెప్పి వారిచేత ఓట్లేసుకుని రోడ్డునపడేసి...ప్యాలెస్ లు, బంగ్లాలు కట్టుకున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. 2014-19లో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ జగన్ నిలిపేశారన్నారు. నేతన్న నేస్తం పథకం కింద కేవలం వైసీపీ కార్యకర్తలకు మాత్రమే బటన్ నొక్కి సాయం చేశాడన్నారు.
యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేశ్ నేతన్న కష్టాలు చూసి చలించారు. కష్టాల్లో ఉన్న నేతన్నలను ఆదుకోవడానికే మంగళగిరిలో వీవర్ శాల ఏర్పాటు చేసి, 365 రోజులూ పని కల్పిస్తున్నారన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీలు అమలు చేస్తున్నామన్నారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే రూ.4 వేల చొప్పున వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నామన్నారు. త్రిఫ్ట్ ఫండ్, వీవర్స్ ముద్ర పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పవర్ లూమ్ యూనిట్లకు 50 శాతం రాయితీ అందిస్తున్నామన్నారు. నేతన్నల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయబోతున్నామని తెలిపారు.
ఆప్కోలో పెరిగిన విక్రయాలు
నేతన్నలకు మేలు కలిగేలా 200 యూనిట్లు, మర మగ్గాల కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి సవితమ్మ తెలిపారు. నేతన్నలకు ఆరోగ్య బీమా పథకం అమలు చేయబోతున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే చేనేత బజార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడలోని చేనేత వస్త్ర ప్రదర్శనను సీఎం చంద్రబాబు ప్రారంభించారని గుర్తు చేశారు. చేనేత పరిశ్రమకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కార్మికుల్లో నమ్మకం కలిగించామన్నారు. అయిదు నెలల్లో ఆప్కో ద్వారా 9.8 శాతం, రెడీ మేడ్ వస్త్రాల అమ్మకాలు (లివరీ సేల్స్) 70 శాతం పెరిగాయని తెలిపారు.
బయ్యర్స్ సమావేశం
త్వరలో సెల్లర్స్ అండ్ బయర్స్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. ఈ సమావేశం ద్వారా చేనేత వస్త్రాల స్టాకును విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కామర్స్ ద్వారా చేనేత వస్త్రాల విక్రయాలు చేపట్టామని, గడిచిన 6 నెలల్లో రూ.32.50 లక్షల అమ్మకాలు చేశామని మంత్రి వెల్లడించారు. ఆరు నెలల్లో మూడు ఆప్కో షోరూమ్ లు ఏర్పాటు చేశామన్నారు. ఆప్కోలో కస్టమర్లను హ్యాండిచేయడంతో పాటు మార్కెటింగ్ స్కిల్స్ పెరిగడానికి షోరూమ్ మేనేజర్లకు శిక్షణిచ్చామని మంత్రి సవిత వెల్లడించారు.
సీమలో రెండు వీవర్ శాలలు
ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్లు నేతన్నలకు నూతన డిజైన్లపై శిక్షణ ఇచ్చి చేనేత ఉత్పత్తుల విక్రయాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆప్ ఫ్యాషన్ టెక్నాలజీ( ఎన్ఐఎఫ్టీ) ఏర్పాటు చేయబోతున్నామన్నారు. చేనేత వస్త్రాలపై ఐదు శాతం మేర జీఎస్టీ రీయిబెర్స్మెంట్ ఇవ్వబోతున్నామని తెలిపారు. కొత్తగా 10 క్లస్టర్లు ఏర్పాటు డంతో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్ సహకారంతో 4,5 జిల్లాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మంగళగిరి తరహాలో విజయనగరం, కర్నూలులో వీవర్ శాలల ఏర్పాటుకు ఎంపీలు చేరో కోటి రూపాయలు కేటాయించారని తెలిపారు. చేనేత వస్త్రాల విక్రయాలు పెంచడానికి విమానాశ్రయంలో ఆప్కో షోరూమ్ లు ఏర్పాటు చేశామన్నారు. త్వరలో విదేశాల్లోనూ చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి సవిత అసెంబ్లీ వేదికగా కోరారు.