3 రాజధానులే వాళ్ల విధానమా? అందుకే మోదీ టూర్ బహిష్కరణా?

అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి జగన్ వెళ్లటం లేదు. పార్టీ వారిని కూడా వద్దన్నారు.;

Update: 2025-05-01 15:55 GMT
Former CM Ys Jagan

మూడు రాజధానులకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందా? అందుకే ప్రధాన మంత్రి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నరా? అవుననే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలిపై అటు సోషల్ మీడియా, ఇటు ప్రజల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తరువాత అమరావతిపై మరో ప్రకటన రాలేదు. అంటే మూడు రాజధానుల మాటకు కట్టుబడి ఉన్నారని చెప్పాల్సిందే. ఆయన అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పార్టీ నేతలను హాజరు కావొద్దని సూచించడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో కూడా జగన్ మూడు రాజధానుల ఆలోచనను వదలలేదని, అమరావతిని రాజధానిగా అంగీకరించడం లేదని విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రధాని కార్యక్రమాన్ని సైతం బహిష్కరించడంపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి.

విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా ఉంటుందని ప్రకటించిన తర్వాత విశాఖపట్నంలో కొన్ని భవనాల నిర్మాణాలు కూడా జరిగాయి. సచివాలయం కూడా అక్కడే నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రుషికొండపై నిర్మించిన నిర్మాణాలు వివాదాస్పదం అయ్యాయి. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని చెప్పినా అమరావతి ప్రాంతంలో గతంలో చేపట్టిన పనులు ఎక్కడ ఉన్నాయో అక్కడి నుంచి రాయి కూడా కదపలేదు. ఇక కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని చెప్పినా న్యాయ పరమైన అంశాలతో ఆయన హామీలకు విలువ లేకుండా పోయింది.

అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలనే నిర్ణయం 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంది. రైతులు తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అమరావతి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మూడు రాజధానుల విధానం కారణంగా అమరావతి ప్రాధాన్యత తగ్గింది. రైతుల భూములు వృథా అయ్యాయని విమర్శలు వచ్చాయి. అమరావతిని పూర్తిగా వ్యతిరేకించడం లేదని, శాసన రాజధానిగా కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పినప్పటికీ, ఆచరణలో పనులు ముందుకు సాగలేదు.

మూడు రాజధానుల ప్రతిపాదన అమలు కాకముందే న్యాయస్థానాల్లో సవాళ్లు ఎదురయ్యాయి. అమరావతి రైతులు, తెలుగుదేశం నేతలు, ఇతర వర్గాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసులు వేశారు. 2022లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, మూడు రాజధానుల బిల్లును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో గత ఐదేళ్లలో మూడు రాజధానుల విధానం అమలుకు న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడ్డాయి.

అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రతిపక్ష నేతగా జగన్‌కు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందింది. అయితే జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఈ కార్యక్రమానికి హాజరు కావద్దని నోటి మాటగా చెప్పారు. ఈ విధానం ఆయన అమరావతి పునర్నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారనే అభిప్రాయాన్ని బలపరిచింది.

Tags:    

Similar News