అఘాయిత్యానికి గురైన చిన్నారి తల్లిదండ్రులకు 10లక్షలు

తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అలివేలు మంగాపురం ఎస్టీ కాలనీకి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హోం మంత్రి అనిత.

By :  Admin
Update: 2024-11-03 12:58 GMT

తిరుపతి జిల్లా వడమాల పేట మండలం అలివేలు మంగాపురంలో అత్యాచారం హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులకు రూ. 10లక్షలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి వంగలపూడి అనిత ఆ చిన్నారి తల్లిదండ్రులకు అందించారు. బాధిత కుటుంబాన్ని ఆదివారం పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నింతుడికి త్వరలోనే కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆ మేరకు చిన్నారి తల్లిదండ్రులకు హోం మంత్రి హామీ ఇచ్చారు. ఇలాంటి  అత్యాచారాలపై ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో అనేక  అత్యాచారాలు జరిగాయి, అప్పుడు రాని వారు నేడు ముందుకొచ్చి మాట్లాడుతున్నారని, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయ లబ్ధి కోసం పాకులాడడం సరైంది కాదన్నారు. దేవుడు కూడా ఇలాంటి వారిని క్షమించరన్నారు. గత ప్రభుత్వ హయాంలో సీసీ కెమేరాలు నిర్వీర్యం అయ్యాయని, గంజాయి, నకిలీ మద్యం విచ్చల విడిగా సాగిందని, యువతకు అలవాటు అయ్యేలా వ్యవహరించారని విమర్శలు గుప్పించారు. పోలీస్‌ శాఖను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. బాధితుల పక్షాన నిలబడడమే కాకుండా, ఎలాంటి సంఘటనలు జరగకుండా మహిళలకు అండగా ఉండి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

గంజాయి సాగును అరికట్టి, గంజాయి నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నార్కోటిక్స్‌ వింగ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపి కట్టడి చేస్తున్నామన్నారు. చిన్నారిపై అఘాయిత్యం బాధేసిందన్నారు. చాక్లెట్‌ కొనిస్తానని అత్యాచారం చేసి హత్యచేయడం మరింత బాధించిందన్నారు. ఈ ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. చిన్నారి కుటుంబానికి సొంత ఇంటిని కూడా నిర్మించి ఇస్తామన్నారు. ఘటన జరిగిన తరువాత వెంటనే స్పందించిన పోలీసులు జాప్యం లేకుండా నిందితుడిని వెంటనే అరెస్ట్‌ చేశామన్నారు. మద్యం మత్తులో నిందితుడు దారుణానికి ఒడిగట్టాడన్నారు. ఎక్కడ ఘటన జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందన్నారు. చిన్నపిల్లల మరణాల్ని వైఎస్‌ఆర్‌సీపీ రాజకీయం చేయడం బాధాకరమన్నారు. పులివెందులలో మహిళపై అత్యాచారం జరిగితే జగన్‌ ఎందుకు నిందితుడిని శిక్షించలేదని ప్రశ్నించారు. దిశ యాప్‌ అంటూ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని మండి పడ్డారు. సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత జగన్‌కు లేదన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో మద్యం ఏరులై పారిందని, అప్పుడు రోజాకు తెలియలేదా అని ప్రశ్నించారు. మద్యంపై రోజా చేస్తున్న రాద్ధాంతం హాస్యాస్పదమన్నారు.

Tags:    

Similar News