ఎనిమిది దేశాల్లో 'శ్రీనివాస కల్యాణాలు'

దాతల సహకారంతో ఎనిమిది దేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతో మరోసారి శ్రీవారి వైభవం ఖండాలు దాటనుంది.

Update: 2024-10-31 03:40 GMT

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు. దీంతో తిరుమల నిత్య కల్యాణం, పచ్చ తోరణంగా విలసిల్లుతోంది. సుదీర్ఘ విరామం తరువాత శ్రీవారి వైభవం మళ్లీ దాటనుంది. తెలుగు వారితో పాటు ఆయా దేశాల్లోని పౌరులకు కూడా వారికి తిరుమల వెంకన్న దర్శనం లభించనున్నది. నవంబర్ నెలలో ఎనిమిది దేశాల్లోని 13 నగరాల్లో శ్రీనివాస కల్యాణాలు ఘనంగా నిర్వహించనున్నారు. దీనికోసం ఆయా దేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రముఖులు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు వచ్చారు. ఈ ఏడాది నవంబర్ తొమ్మిదొ తేదీ నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు యూరప్ లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించడానికి ముహూర్తం ఖరారైంది. ఈ కార్యక్రమాల నిర్వహించడానికి ఆ దేశాల్లో స్థిరపడిన తెలుగు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు.

2014 నుంచి కూడా విదేశాల్లో దాతల సహకారంతో టీటీడీ శ్రీనివాస కల్యాణాలు నిర్వహించింది. హిందూ ధర్మాన్ని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశ్వవ్యాపితం చేసేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సుదీర్ఘ విరామం తరువాత, తాజాగా..
2024 నవంబర్ తొమ్మిదో తేదీ యూకే, ఐర్లాండ్, యూరప్ లోని ఎనిమిది దేశాల్లోని 13 నగరాల్లో శ్రీవానివాసుని కల్యాణాలు నిర్వహించడానికి కార్యక్రమం ఖరారైనట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆ దేశాల్లో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణాలు నిర్వహించడానికి జర్మనీలో ఉన్న ఎన్ఆర్ఐ సూర్య ప్రకాష్ వెలగా ఫ్రాంక్ ఫర్డ్ లో ఉంటున్న కృష్ణ జవాజీ టీటీడీ ఈఓ జె.శ్యామలరావును తిరుపతిలోని పరిపాలన భవనంలో కలిశారు. తాము నివాసం ఉంటున్న నగరాలతో పాటు, దేశాల్లో నిర్వహించే శ్రీనివాసుని కల్యాణాలకు ఆహ్వానించారు. యూకే, ఐర్లాండ్‌, యూరప్‌లోని ఎనిమిది దేశాల్లోని 13 నగరాల్లో టీటీడీ సహకారం, స్థానిక స్వచ్ఛంద, సాంస్కృతిక సంస్థలతో కలిసి ఏపీ ఎన్ఆర్టీఎస్ సంస్థల ద్వారా శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వారు ఈఓకు వివరించారు. ఈ కార్యక్రమాలన్నీ వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం టీటీడీ వేదపండితుల ఆధ్వర్యంలో పూజలు, కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు.
శ్రీనివాస కల్యాణాల షెడ్యూల్
నవంబర్ 9న : బెల్ఫాస్ట్, ఐర్లాండ్
10వ తేదీ : డబ్లిన్, ఐర్లాండ్
16వ తేదీ : బేసింగ్‌స్టోక్, యూకే
17వ తేదీ : ఐండ్‌హోవెన్, నెదర్లాండ్స్
23వ తేదీ : హాంబర్గ్, జర్మనీ
24వ తేదీ : పారిస్, ఫ్రాన్స్
30వ తేదీ : వార్సా - పోలాండ్
డిసెంబర్ 1న - స్టాక్‌హోమ్, స్వీడన్
7వ తేదీ : మిల్టన్ కీన్స్, యూకే
8వ తేదీ : గ్లౌసెస్టర్, యూకే
14వ తేదీ : ఫ్రాంక్‌ఫర్ట్, జర్మనీ
15వ తేదీ : బెర్లిన్, జర్మనీ
21వ తేదీ : జ్యూరిచ్, స్విట్జర్లాండ్ లో శ్రీనివాసుని కల్యాణాలు నిర్వహించడానికి కార్యక్రమాలు ఖరారయ్యాయి.
ఈ కార్యక్రమాలకు శ్రీదేవి, భూదేవి, సమేత శ్రీనివాసుని విగ్రహాలతో అర్చక స్వాములు వెళ్లనున్నారు. నిత్యకార్యక్రమాల్లో తిరుమల మాడవీధుల్లో ఊరేగే ఉత్సవమూర్తులను మినహా మిగతా విగ్రహాలను పొరుగు ప్రాంతాలకు తీసుకుని వెళతారు. ఇదిలా ఉండగా...
విదేశాల్లో నిర్వహించే శ్రీనివాస కల్యాణాలకు టీటీడీ వేదపండితులు స్వామివార్లతో విగ్రహాలు తీసుకుని బయలుదేరుతారు. అలాగే టీటీడీ చీఫ్ పీఆర్ఓ, అధికారులు, సమన్వయం చేయడానికి వీలుగా కొందరు సిబ్బంది కూడా వెళ్లడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. స్వామివారి కల్యాణాలు నిర్వహించడానికి ముందుకు వచ్చే దాతలే ఈ ఖర్చులు అన్నీ భరిస్తారని టీటీడీ అధికారి ఒకరు తెలిపారు. 13 నగరాల్లో స్వామివారి కల్యాణాలు నిర్వహించనున్న కారణంగా లడ్డూల తరలింపు భారీగానే ఉంటుందని భావిస్తున్నారు. ఈ తరహా కల్యాణోత్సవాలు చివరగా, వైసీపీ ప్రభుత్వ కాలంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి ఉన్నప్పుడు తెలుగువారి కోసం 2022 జూన్ 18వ తేదీ నుంచి జూలై తొమ్మిదవ తేదీ వరకు అమెరికాలో స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహించారు.
ప్రత్యేక లడ్డూలు
విదేశాల్లో శ్రీనివాసుడి కల్యాణాల సందర్భంగా టీటీడీ విదేశాలకు తరలించడానికి ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదాలు కూడా సిద్ధం చేస్తుంది. తిరుమలలో ప్రస్తుతం మూడ రకాల లడ్డూల తయారీ జరుగుంది. అందులో వీఐపీలు, కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు, సాధారణ భక్తులకు అందుబాటులోని లడ్డూల్లో వ్యత్యాసాలు ఉంటాయి. కాగా, విదేశాలకు తీసుకుని వెళ్ల లడ్డూ ప్రసాదాలు ఎక్కువ రోజులు నిలువ ఉండాలి. దీనికి తోడు దాతల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీంతో లడ్డూ ప్రసాదం తాయారీకి వినియోగించే దిట్టంలో ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు.
Tags:    

Similar News