పులివెందులకు రప్పించిన రెండు కారణాలు ఇవే...

మూడు రోజుల పర్యటనకు వచ్చిన జగన్

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-25 13:56 GMT

మాజీ ముఖ్యమంత్రి, వైసిపి చీఫ్ వైఎస్. జగన్ రెండు కార్యక్రమాల్లో పాల్గొనడానికి మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకున్నారు. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జగన్ ను వైసీపీ శ్రేణులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో కొద్దిసేపటికి ఆయన ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వైద్య విద్యార్థులు, రైతులు జగన్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.


పులివెందులలో జరిగే వివాహానికి హాజరు కావడానికి కార్యక్రమం ఖరారు చేసుకున్నారు. దీనికి ముందే వర్షాలు కురవడం, అరటి తోటలకు నష్టం జరగడంతో పాటు ధరలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రైతులను ఓదార్చడం, వివాహ కార్యక్రమాలకు హాజరై ఆశీర్వదించడం, అనారోగ్యంతో ఉన్నవాన్ని పరామర్శించడం కోసం వైయస్ జగన్ పర్యటన పులివెందులలో సాగడానికి ఏర్పాట్లు చేసినట్లు పులివెందుల పార్టీ వర్గాల సమాచారం.

పులివెందులకు జగన్ రావడంతో జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథరెడ్డి (రాజంపేట), డాక్టర్ సుధ (బద్వేలు, డిప్యూటీ మాజీ సీఎం అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి, పార్టీ నాయకులు క్యాంప్ కార్యాలయంలో కలిశారు.


ప్రజలతో భేటీ

పులివెందులలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన వైఎస్. జగన్ప ట్టణంలోని భాకరాపురంలో ఉన్న తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వైసిపి కార్యకర్తలు, ప్రజలు, నాయకులు, అభిమానులు కూడా జగన్తో మాట్లాడేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారి బాధలు ఆలకించిన వైయస్ జగన్.
"నేనున్న. భయపడకండి. మంచి రోజులు వస్తాయి. తప్పకుండా మేలు జరుగుతుంది" అని జగన్ తనను కలిసిన వారందరికీ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. తన పరిధిలో చేయాల్సిన పనులు, పరిష్కరించాల్సిన సమస్యలను యధావిధిగానే తన పక్కనే ఉన్న కడప ఎంపీ, జగన్ బాబాయ్ కొడుకు వైఎస్. అవినాష్ రెడ్డికి సూచనలు ఇచ్చారు.
రాష్ట్రంలో వైద్య విద్య కళాశాలలో ప్రైవేటీకరణ చేయడం వల్ల జరుగుతున్న నష్టాన్ని కూడా కొంతమంది విద్యార్థులు జగన్ వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకున్నారు.
పులివెందులలో జగన్ పర్యటన ఇలా..
పులివెందుల నియోజకవర్గంలో మంగళవారం నుంచి రెండు రోజులు వైయస్ జగన్ పర్యటించనున్నారు. మంగళవారం రాత్రికి భాకరాపురంలోని నివాసంలోనే జగన్ బస చేస్తారు. ఈనెల 26వ తేదీ అంటే బుధవారం ఉదయం పులివెందుల పట్టణంలోని వాసవి ఫంక్షన్ హాల్ లో జరిగే ఓ వివాహానికి వైఎస్ జగన్ హాజరవుతారు.
అరటి రైతులకు ఓదార్పు..
రాయలసీమలో ప్రధానంగా పులివెందల నియోజకవర్గంలో కూడా అరటి తోటలు వేలాది ఎకరాల్లో సాగు చేస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని తోటలు దెబ్బ తినడంతో పాటు తాజాగా అరటికీ మద్దతు ధర దక్కని స్థితిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పులివెందుల పర్యటనకు వచ్చిన వైయస్ జగన్ బుధవారం మధ్యాహ్నం పట్టణానికి సమీపంలోని బ్రాహ్మణ పల్లెకు వెళతారు.. అక్కడ రైతులతో కొద్దిసేపు మాట్లాడి,. సమస్యలు తెలుసుకునే వైయస్ జగన్ ఏమి చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.

పరామర్శ..

నియోజకవర్గంలో అరటి తోటలు రైతులతో మాట్లాడిన తర్వాత వైఎస్ జగన్ లింగాల మండలానికి వెళతారు.. మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని జగన్ పరామర్శించి, వారి ఇంటిలో కొద్దిసేపు గడుపుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం వేల్పుల లోని లింగాల రామలింగారెడ్డి నివాసానికి వెళ్లి అక్కడ వారితో మాట్లాడేందుకు వైసిపి వర్గాలు ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమాల తర్వాత బుధవారం సాయంత్రానికి పులివెందులలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకునే వైఎస్ జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుంటారు రాత్రికి అక్కడే బస చేస్తారు. 27వ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి వైయస్ జగన్ బెంగళూరుకు వెళతారని వైసీపీ వర్గాల ద్వారా తెలిసింది.
పులివెందుల నియోజకవర్గం లో శుభకార్యంతో పాటు ఇటీవల మరణించిన పార్టీ నాయకుల కుటుంబాలను పరామర్శించడానికి వైయస్ జగన్ కార్యక్రమం ఖరారైనట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Tags:    

Similar News