తిరుమల:దోషాల నివారణ కోసం పవిత్రోత్సవాలు ప్రారంభం..
శ్రీవారి ఆలయంలో మొదటిరోజు మంగళ వారం పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు.;
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళ వారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంమయ్యాయి. ఏడాదికి ఒకసారి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా మొదటిరోజు పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు.
ఈ ఉత్సవాలు ఎందుకంటే..
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించడానికి ముఖ్య కారణం కూడా ఉంది. తిరుమల శ్రీవేంకటేశ్వరాలయంలో ఇది వార్షిక వేడుకగా నిర్వహిస్తారు. ఏడాది పొడవునా శ్రీవారికి నిత్యపూజలు చేస్తుంటారు. వారాంతపు, వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికులు, సిబ్బంది వల్ల తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
తిరుమల ఆలయంలో మొదటి రోజు
శ్రీవారి ఆలయంలోని సంపగి ప్రాకారంలో ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచసూక్తాలను పఠించారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ట జరిగింది. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు.