శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ ఎలా చేశారంటే...

క్రీ.శ 1463 నుంచి మూడు రోజులు నిర్వహించే ఈ వార్షిక ఉత్సవం వెనుక కథేమిటి?;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-08-04 16:25 GMT

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల ఐదో తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణం చేశారు. ఈ మూడు రోజులు ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సంవత్సరానికి ఒకసారి నిర్వహించే ఈ పవిత్రోత్సవాలకు చారిత్రక నేపథ్యం ఉంది. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు..


తిరుమలలో సోమవారం సాయంత్రం సేనాధిపతివారి విగ్రహాన్ని ఆలయ మాడవీధుల్లో గుండా ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేశారు. సాయంత్రం నిర్వహించాల్సిన సహస్రదీపాలంకార సేవను కూడా టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమాలను టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి పర్యవేక్షించారు.

పవిత్రోత్సవాలు ఎందుకంటే...
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించడానికి ముఖ్య కారణం కూడా ఉంది. తిరుమల శ్రీవేంకటేశ్వరాలయంలో ఇది వార్షిక వేడుకగా నిర్వహిస్తారు. ఏడాది పొడవునా శ్రీవారికి నిత్యపూజలు చేస్తుంటారు. వారాంతపు, వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికులు, సిబ్బంది వల్ల తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
దోష నివారణ: ఏడాది పొడవునా ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలలో, ఉత్సవాలలో ఏదైనా మంత్రదోషాలు, క్రియాదోషాలు, కర్తవ్య లోపాలు వంటివి జరిగి ఉండవచ్చు. వాటిని నివారించి ఆలయాన్ని తిరిగి శుద్ధి చేయడానికి ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఆలయ పవిత్రత: భక్తులు, సిబ్బంది వల్ల తెలియకుండా జరిగిన పొరపాట్ల కారణంగా ఆలయ పవిత్రతకు లోపం కలగకుండా ఈ ఉత్సవాల ద్వారా నివారణ చర్యలు చేపడతారు.
పూర్ణాహుతి: యజ్ఞ యాగాదులు చేసినప్పుడు ఏదైనా పొరపాట్లు జరిగితే పూర్ణాహుతితో ఆ దోషాలు తొలగిపోతాయి. అలాగే శ్రీవారికి జరిగే ఉపచారాలలో జరిగే దోషాలను తొలగించడానికి పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ముగుస్తాయి.

ముహూర్తం ఇదే..
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణమాసంలో మాత్రమే ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజుల్లో మాత్రమే ఈ పవిత్రోత్సవాల నిర్వహణకు ఆగమశాస్ర్తం ప్రకారం ముహూర్తం నిర్ణయించారు.
ఈ ఉత్సవాల మొదటి రోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. ఇది ఒక ప్రాయశ్చిత్తంలాగా భావించి ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఉత్సవాలు నిర్వహించకపోతే, ఆ సంవత్సరం చేసిన ఆరాధనలన్నీ నిష్ఫలం అవుతాయని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి.
పండితుల పాత్రే కీలకం

ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు, ఆగమశాస్త్ర నిపుణులు నిర్వహిస్తారు.
ప్రధాన అర్చకులు: పవిత్రోత్సవాల్లో కీలక పూజలు నిర్వహిస్తారు.
వేద పండితులు: యాగశాలలో నిర్వహించే హోమంలో వేద మంత్రాలు పఠిస్తారు. పవిత్ర పెంచడానికి అనువైన దోష నివారణ మంత్రాలు జపిస్తారు.
ఆగమశాస్త్ర పండితులు: ఉత్సవాలు, యాగం ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించడానికి మార్గ నిర్దేశం చేస్తారు.
ఆలయంలో ఏకాంతంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు ఆలయ ప్రధాన అర్చకుడు సారధ్యంలో పరిమిత సంఖ్యలో పండితులను అనుమతిస్తారు.
అంకురార్పణతో ప్రారంభం
పవిత్రోత్సవాలు ప్రారంభానికి సూచికగా సోమవారం సాయంత్రం సంపంగి ప్రాకారం (ఆలయ ఆవరణ)లో అంకురార్పణ చేశారు. అంటే, తొమ్మిది రకాల విత్తనాలను మట్టిపాత్రలో వేశారు. ఇది ఆలయంలో పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఆ తరువాత మృత్సంగ్రహణ కోసం వేద పారాయణం చేశారు. అంకురార్పణ, మృత్సంగ్రహణ ఆచారాలు బ్రహ్మోత్సవాలలో నిర్వహించే వాటికి సమానంగా ఉంటాయి. ఈ వేద పారాయణం మూడో రోజు ముగుస్తుంది. వేదాలు జపించడం ద్వారా ప్రధాన కుంభంలో (పవిత్ర పాత్రలో మొదటిది) విష్ణువు కోసం ఆవాహనం (ప్రార్థన) జరుగుతుంది. ఈ ప్రధాన కుంభాన్ని చుట్టూ 16 ఇతర కుంభాలు ఉన్నాయి. వేదమంత్రాలు స్వర ప్రకంపనలను ప్రేరేపిస్తాయని నమ్ముతారు. ప్రధాన కుంభాన్ని ముగింపు రోజు ప్రధాన దేవత వద్దకు తీసుకుని వెళతారు. మూల విగ్రహానికి (కుంభ ఆవాహనం) ప్రసారం అవుతుందని నమ్ముతారు. డు రోజులలో జరిగే ఆచారాలలో ప్రధాన దేవతకు తిరుమంజనం,హోమం (బలి అర్పణ), వెంకటేశ్వరుడి ప్రధాన విగ్రహాలు ఉంటాయి.
ఎప్పటి నుంచి ఇలా..
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాల నిర్వహణ వెనుక కూడా చారిత్రక కథనం ఉంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
శ్రీవారి ఆలయంలో మొదటిసారి క్రీస్తుశకం 1463లో సాలువ మల్లయ్య దేవరాజా ఆధ్వర్యంలో తిరుమలలో పవిత్రోత్సవాలు నిర్వహించినట్లు ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. విజయనగర సామ్రాజ్యానికి చెందిన సాలువ నరసింహ రాయల కాలంలో ఈ ఉత్సవాలు జరిగాయి. దీనికి సంబంధించి ఆలయంలో శాసనం కూడా ఉంది.
శ్రీవారిని దర్శించుకుని వెలుపలికి రాగానే వెండి వాకిలి దాటిన తరువాత ప్రసాదాల పంపిణీ చేస్తుంటారు. అక్కడి నుంచి కాస్త ముందుకు వస్తే, వగపడి (ప్రసాదాల కేంద్రం) వద్ద ఎడమవైపు గోడకు ఆ మేరకు శాసనం కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహించే ఈ పవిత్రోత్సవాలు క్రీస్తుశకం 1562 తర్వాత ఈ ఉత్సవాలు మధ్యలో నిలిచిపోయాయని రికార్డులు చెబుతున్నాయి. దానికి కారణం తెలియదని అంటున్నారు.
సుదీర్ఘవిరామం తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Tirupati Devasthanams TTD) 1962 నుంచి ఈ పవిత్రోత్సవాలను తిరిగి ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ పవిత్రోత్సవాలు శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాల్లో భాగంగా ఏటా శ్రావణ మాసంలో వైభవంగా నిర్వహిస్తున్నారు.
కాబట్టి, చారిత్రకంగా 15వ శతాబ్దంలోనే ప్రారంభమైనప్పటికీ, ఆధునిక కాలంలో మాత్రం టీటీడీ ఈ ఉత్సవాలను 1962 నుంచి నిర్విరామంగా కొనసాగిస్తోంది.
ఎలా నిర్వహిస్తారు..

పవిత్రోత్సవాల ప్రారంభ సూచికగా ఏకాదశి రోజు అంటే మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయ సంపంగి ప్రాకారంలోకి తీసుకుని వస్తారు.
రెండు రోజు ద్వాదశినాడు ప్రత్యేక దారం, పూలమాలలను ఊరేగింపుగా తీసుకుని వచ్చి, విగ్రహాలకు అలంకరిస్తారు.
మూడు రోజు త్రయోదశి రోజు అంటే బుధవారం హూర్ణాహుతితో ఉత్సవాలకు ముగింపు పలుకుతారు.
మలయప్పస్వామివారి, ఉభయ నాంచారులకు పవిత్రమాలలు వేసి, ఆలయ మాడవీధుల్లో ఊరేగించడం ద్వారా దోష పరిహార పూజలు పూర్తి చేస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
శ్రీవారి ఆలయంలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న పవిత్రోత్సవాల నేపథ్యంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. అందులో భాగంగా ఉదయం పూజల సందర్భంగా నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం, సహసర దీపాలంకరణ సేవ, డోలోత్సవం వంటి ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.


Tags:    

Similar News