బనకచర్లపై తెలంగాణ అభ్యంతరాలు సబబు కాదు

గోదావరికి దిగువ రాష్ట్రంగా సముద్రంలో కలిసే నీటిని వినియోగించుకోవడంలో ఏపీకి సర్వహక్కులు ఉన్నాయని మంత్రి ఫరూక్‌ తెలిపారు.;

Update: 2025-08-04 15:29 GMT

తెలంగాణలోని కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క సాగర్, గౌరవెల్లి, సంగమేశ్వర– బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులూ లేవని, వీటిపై ఏపీ ఎప్పుడూ అభ్యంతరాలు పెట్టకున్నా ఏపీ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం సబబు కాదని మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ పేర్కొన్నారు. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకునే విషయంలో తెలంగాణాకి ఓ న్యాయం, ఏపీకి ఓ న్యాయమా అని, ద్వంద ప్రమాణాలు ఎంతవరకు సమంజసమన్నది తెలంగాణ ఆలోచించాలని సోమవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి ఫరూక్‌ పేర్కొన్నారు.

గోదావరి నుంచి ఏటా సగటున 3000 టీఎంసీల వరద నీరు సముద్రంలో కలుస్తోందన్నారు. 2025 సీజన్‌ ఆరంభంలోనే ఇప్పటి వరకూ 813 టీఎంసీల నీరు దిగువన సముద్రంలో కలిసిపోయిందని వెల్లడించారు. ప్రపంచంలోనే 50 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించే అవకాశం ఉన్న నదిగా గోదావరి విశిష్టమైన ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు.
గోదావరి నదికి దిగువ రాష్ట్రంగా సముద్రంలో కలిసే నీటిని వినియోగించుకునేందుకు ఏపీ సర్వహక్కులూ కలిగి ఉందని మంత్రి ఫరూక్‌ స్పష్టం చేశారు. పోలవరం– బనకచర్ల లింకు ప్రాజెక్టుతో సముద్రంలోకి వృధాగా కలిసే జలాలను మాత్రమే రాయలసీమకు తరలించాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికకు శ్రీకారం చుట్టిందన్నారు.సాగునీటి అవసరాలకు కూడా ఆ నీటిని వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణా సరిహద్దు తర్వాత భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఉన్న శబరి, సీలేరు, తాలిపేరు నుంచి పెద్ద ఎత్తున నీటి ప్రవాహాలు ప్రధాన నదిలో కలుస్తున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా రుతుపవనాల సీజన్‌ లో నవంబరు వరకూ 100 రోజుల పాటు డిస్టిబ్యూటరీస్‌ నుంచి గోదావరిలోకి వరద ప్రవాహాలు కొనసాగుతాయని అన్నారు. ఒడిశా నుంచి శబరీ నది కూనవరం వద్ద గోదావరిలో కలుస్తోందని, సీలేరు, పొట్టేరుల నుంచి శబరి ఉపనదికి వచ్చే ప్రవాహాలు భారీగానే ఉంటాయన్నారు. శబరి నుంచి ఏటా దాదాపు 270 టీఎంసీల నీటి ప్రవాహం గోదావరిలో కలుస్తోందని తెలిపారు. సీలేరు నుంచి వచ్చే వరద నీటి ప్రవాహాం కూడా భారీగానే ఉంటుందన్న విషయం తెలిసిందేనని పేర్కొన్నారు.
గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకున్న తెలంగాణా పూర్తిగా ప్రాణహిత నుంచి వచ్చే నీటిని మళ్లించుకుంటోందని మంత్రి ఫరూక్‌ అన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా కాళేశ్వరం, సీతారామ సాగర్, ఇతర ఎత్తిపోతల పథకాల ద్వారా 296 టీఎంసీలను తెలంగాణ తన అవసరాల కోసం తరలించుకుంటోందని మంత్రి ఫరూక్‌ విమర్శించారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా కలుస్తున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకే పోలవరం–బనకచర్ల లింకు ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించిందని, ఈ విషయంపై తెలంగాణ విమర్శలు సరికాదన్నారు.
సముద్రంలో కలిసే నీటిని వరద కాలంలో మాత్రమే రోజుకు 2 టీఎంసీల చొప్పు 200 టీఎంసీల వరకూ నీటిని కరవుపీడిత ప్రాంతాలకు తరలిస్తే ఎగువ రాష్ట్రానికి వచ్చే ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. నీటి వనరుల సద్వినియోగం చేసేందుకు, రాయలసీమ లాంటి కరవు ప్రాంతాల దాహార్తిని, సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టుపై అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి ఫరూక్‌ ద్వజమెత్తారు. లోవర్‌ రైపీరియన్‌ రైట్స్‌ అనేది నదీ జలాల చట్టంలో ఓ ముఖ్యమైన అంశమని దిగువ పరివాహక ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు.
సముద్రంలోకి కలిసే 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలను మాత్రమే పోలవరం– బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని మంత్రి ఫరూక్‌ పేర్కొన్నారు. జీడబ్ల్యూడిటి అవార్డు లోని క్లాజ్‌ –4 ప్రకారం రాష్ట్రాలకు, గోదావరి నుండి ఇతర రివర్‌ బేసిన్లకు నీటిని తరలించే హక్కు ఉందని, ఆ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం కాలేశ్వరం, సీతారామ లిప్టు ప్రాజెక్టులు చేపట్టిందని, కొన్ని అనుమతులు ఈ క్లాజు ప్రకారమే వారికి కేంద్ర జలసంఘం ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కూడా ఈ హక్కుతోనే బనకచర్ల ప్రాజెక్టును చేపడుతోందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు సానుకూలమేనని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని, రెండు తెలుగు రాష్ట్రాల రైతులు, ప్రజలు గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నదే చంద్రబాబు లక్ష్యమని అన్నారు.
Tags:    

Similar News