ఆదిలాబాద్‌లో అరుదైన పోటీ...అభ్యర్థులంతా టీచర్లే

అడవుల ఖిల్లా ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ముగ్గురు మాజీ ఉపాధ్యాయుల మధ్య త్రిముఖ పోరు నెలకొంది.ముగ్గురు టీచర్లలో ఎవరు గెలుస్తారో ఆసక్తికరంగా మారింది...

By :  Admin
Update: 2024-04-11 04:08 GMT

పచ్చని చెట్లతో కూడిన అడవులు...జాలువారుతున్న కుంటాల, పొచ్చెర జలపాతాలు...గోదావరి, పెనుగంగా నదుల ప్రవాహాలతో విలసిల్లిన ఆదిలాబాద్ అక్షరక్రమంలో అగ్రస్థానంలో ఉన్న అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎస్టీ ఓటర్లు అధికంగా ఉండటంతో దీన్ని ఎస్టీ అభ్యర్థికి రిజర్వ్ చేశారు.



ముగ్గురు ఆదివాసీ అభ్యర్థుల మధ్య ఆసక్తికర పోరు

ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు కూడా ముగ్గురు మాజీ ఉపాధ్యాయులను ఎన్నికల బరిలోకి దించాయి. ముగ్గురు అభ్యర్థులు అధ్యాపక వృత్తిలో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే కావడం విశేషం. ఎంపీ ఎన్నికల్లో ఆదివాసీల ఓట్లే కీలకం కావడంతో మూడు పార్టీలు కూడా ఆదివాసీ గోండులో సామాజిక వర్గానికి చెందినవారినే రంగంలోకి దించాయి. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు (బీఆర్‌ఎస్‌), మాజీ ఎంపీ, మాజీ మంత్రి గోడం నగేశ్‌ (బీజేపీ), ఆత్రం సుగుణ (కాంగ్రెస్‌) బరిలోకి దిగారు. ఈ స్థానంలో పోటీ చేసిన తొలి ఆదివాసీ మహిళ సుగుణ. నగేష్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. నగేష్ తండ్రి గోడం రామారావు కూడా గిరిజనసంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. గతంలో టీడీపీలో ఉండి బీఆర్ఎస్ లోకి మారిన నగేష్ మళ్లీ తాజాగా కమలదళంలో అలా చేరి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు కాకుండా నగేష్ బీజేపీ టికెట్టు సాధించారు.


కుంటాల జలపాతం



 బీజేపీకి సిట్టింగ్ స్థానంతోపాటు నలుగురు ఎమ్మెల్యేల బలం


ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వుడ్ పార్లమెంట్ పరిధిలో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్,ఆసిఫాబాద్, సిర్పూర్ అసెంబ్లీ నియోకవర్గాలున్నాయి. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు స్థానాల్లో బీజేపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేల బలముంది. సిర్పూర్, నిర్మల్, ముథోల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలుగా బీజేపీకి చెందిన డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, ఆలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు, పాయల శంకర్ ఉన్నారు. బీజేపీకి సిట్టింగ్ ఎంపీస్థానం కావడంతో పాటు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 34.3 శాతం ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కంటే బీఆర్ఎస్ పార్టీకి స్వల్పంగా ఓట్ల శాతం పెరిగినా, సీట్లు మాత్రం రెండే దక్కాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా కోవా లక్ష్మి, బోథ్ లో అనిల్ జాదవ్ గెలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 19.3 శాతం ఓట్లు రాగా కేవలం ఖానాపూర్ ఒక్క స్థానంలోనే వెడ్మ బుజ్జి ఎమ్మెల్యేగా గెలిచారు.


ఆదిలాబాద్‌లో ఎస్టీ, ఎస్సీ, ముస్లిం ఓటర్లే కీలకం

ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఎస్టీ, ఎస్సీ,ముస్లిం ఓటర్లే కీలకంగా మారారు. ఈ మూడు వర్గాల ఓటర్లు కలిపి మొత్తం 47.8 శాతం మంది ఉన్నారు. దీంతో ఆదిలాబాద్ లో ఎంపీ ఎవరనేది ఈ మూడు వర్గాలే నిర్ణయించనున్నాయి. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 35.9 శాతం ఓట్లతో విజయకేతనం ఎగురవేసింది. బీఆర్ఎస్ 30.4 శాతం ఓట్లతో రెండోస్థానానికే పరిమితమైంది.


టీడీపీ కంచుకోటలో వికసించిన కమలం

గతంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశంపార్టీ ఐదుసార్లు విజయం సాధించడంతో ఆ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఆపై 2014 వ సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన గొడం నగేష్ ఎంపీగా గెలిచారు. 2019వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు విజయం సాధించడంతో మొదటిసారి ఇక్కడి నుంచి కమలం వికసించింది. అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ నాలుగు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు.


కమలానికి రెండోసారి విజయం వరించేనా

2009వసంవత్సరం నుంచి ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఏ పార్టీ కూడా వరుసగా రెండుసార్లు గెలుపొందలేదు. దీంతో 2019వ సంవత్సరంలో గెలిచిన బీజేపీ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎమ్మెల్యేల బలంతో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని వ్యూహం పన్నుతోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నుంచి మాజీమంత్రి గొడం నగేష్ ను పార్టీలో చేర్చుకొని బీజేపీ టికెట్ ప్రకటించారు. ఆదిలాబాద్ లో మోదీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. అధికార కాంగ్రెస్ పార్టీ తమ గ్యారంటీల అమలు ప్రచారాస్త్రాలుగా ఎంపీ సీటును గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో బహిరంగ సభ నిర్వహించి గిరిజన ఓటర్లపై గాలం వేశారు. మరో వైపు బీఆర్ఎస్ కూడా తన ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి ఓట్ల వేట సాగిస్తోంది.


అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తారుమారు

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అవుతుండటం ఆదిలాబాద్ ప్రత్యేకత. 2018వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించింది. అయినా లోక్‌సభ సీటు మాత్రం బీజేపీకి దక్కింది. కాంగ్రెస్ పార్టీ ఈ సారి కొత్త అభ్యర్థి అయిన రిటైర్డ్ టీచర్ అత్రం సుగుణ ను రంగంలోకి దించింది. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును ఎన్నికలబరిలోకి దింపింది. బీజేపీ టికెట్లు దక్కని మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావులు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వారు నగేష్ విజయం కోసం ఏమేర పనిచేస్తారనేది సందేహాస్పదంగా మారింది. మొత్తంమీద ముగ్గురు మాజీ ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న త్రిముఖ పోరు రసవత్తరంగా మారింది.

Tags:    

Similar News