పాక్ ప్లేయర్లకు టీమ్ ఇండియా ఝలక్: షేక్ హ్యాండ్ ఎందుకివ్వలేదంటే..
‘మేం కేవలం క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చాం’ అని సూర్యకుమార్ ఎందుకన్నారు..;
By : The Federal
Update: 2025-09-15 09:49 GMT
ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ పై గెలిచిన టీమ్ ఇండియా ప్లేయర్లు పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. భారత క్రికెటర్లు తమకు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎదుట పాకిస్థాన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
దీనిపై నిరసన తెలియజేసినట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్ ఆడొద్దని భారత అభిమానులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో భారతీయుల మనోభావాలను గౌరవించి భారత్ ఆటగాళ్లు కరచాలనం చేయలేదు. అయితే ఐసీసీ, ఏసీసీ నిబంధనలను గౌరవిస్తూ భారత్ ఆసియా కప్‌లో మ్యాచ్ ఆడింది. ఇదే విషయాన్ని సూర్యకుమార్ కూడా ‘మేం కేవలం క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చాం’ అంటూ స్పష్టం చేశాడు.
కరచాలనం చేయకపోవడంపై చిటపటలు పక్కనబెడితే పాకిస్తాన్ సీనియర్ ఆటగాళ్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా మంచి వేదికపై పాక్‌కు బుద్ధి చెప్పినట్లు అయిందని టీమ్ఇండియా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ టీమ్ ఇండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే.. రాజకీయాలతో క్రీడలకు ముడిపెట్టొద్దని కోరాడు. అద్భుత విజయం సాధించిన భారత్‌ను అభినందించాడు
కరచాలనం వివాదంపై షోయబ్ ఏమన్నారంటే..
‘‘నాకు మాటలు రావడంలేదు. ఇలాంటి పరిస్థితి చూడాల్సి వస్తుందని అనుకోలేదు. తీవ్రంగా బాధించింది. ఏం చెప్పాలో కూడా తెలియడంలేదు. విజయం సాధించిన టీమ్ ఇండియాకు హ్యాట్సాఫ్. అయితే, ఇలాంటి వాటిని రాజకీయం చేయొద్దు. క్రికెట్‌ను దాంతో ముడిపెట్టొద్దు. ఇంతకుముందు వరకూ చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. కరచాలనం పైనా ఏదొకటి చెప్పొచ్చు. ప్రతి ఇంట్లోనూ గొడవలు జరుగుతుంటాయి. వాటిని మరిచిపోయి ముందుకు సాగాలి. ఇది క్రికెట్. కరచాలనం చేసుకుంటే బాగుండేది’’ అని షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు. ఏసీసీ ఎదుట పాక్ నిరసన వ్యక్తం చేసింది.
పాక్ బ్యాటింగ్‌పై అసహనం
కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో తడబాటుకు గురైన పాకిస్థాన్ బ్యాటర్లపై ఆ జట్టు మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ అసహనం వ్యక్తం చేశాడు. సరిగ్గా చూడకుండానే ఆడేశారంటూ విమర్శించాడు.
‘‘కుల్‌దీప్ బంతి విసిరే విధానాన్ని పాక్ బ్యాటర్లు అస్సలు రీడ్ చేయలేదు. మ్యాచ్‌కు ముందు సునీల్ గావస్కర్‌తో ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడా. ఆయన ఒకటే చెప్పాడు ‘బంతి కుల్‌దీప్ చేతి నుంచి పిచ్‌పై పడే వరకూ నిశితంగా పరిశీలించాలి. అప్పుడే ఎలా ఆడాలో తెలుస్తుంది. అది సాధ్యపడకపోతే అతడిని ఎదుర్కోవడం కష్టం’ అని అన్నాడు. పాక్ బ్యాటర్లు మాత్రం ప్రతి రెండో బంతిని స్వీప్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించారు. దానర్థం సరిగ్గా అంచనా వేయలేకపోయారని తెలుస్తుంది’’ అని అక్రమ్ అన్నారు.
ఇదంతా ఒక ఎత్తయితే కరచాలనం చేయకపోవడం మరో ఎత్తు. భారత్ ఆటగాళ్లు భారతీయ స్ఫూర్తిని చూపించారని టీమ్ ఇండియా అభిమానులు ప్రశంసిస్తున్నారు.