భారత్ వచ్చిన మెస్సీకి దక్కిన పారితోషికం ఎంతో తెలుసా?
ఈవెంట్ నిర్వాహకుడు దత్తా S.I.T దర్యాప్తులో ఇంకా ఏం చెప్పాడు?
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ(Lionel Messi) ఇటీవల భారత్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. 'G.O.A.T India Tour’ లో భాగంగా డిసెంబర్ 13న కోల్‌కతాకు వచ్చిన మెస్సీ అందుకున్న పారితోషికం అక్షరాల రూ. 89 కోట్లు. ఈ విషయాన్ని స్వయంగా ఈవెంట్ నిర్వాహకుడు సతాద్రు దత్తా S.I.T విచారణలో చెప్పారు.
దత్తాను ఎందుకు అరెస్టు చేశారు?
డిసెంబర్ 13వ తేదీ ఉదయం 11.30 గంటలకు మెస్సీతో పాటు సహచర ఆటగాళ్లు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం చేరుకున్నారు. వారి చుట్టూ నిర్వాహక కమిటీ బృందం గుమిగూడడంతో మెస్సీ దాదాపు 20 నిమిషాల పాటు కనిపించకుండా పోయారు. దీంతో స్టేడియంలో ప్రేక్షకులు "We want Messi" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో క్రీడాకారుల చుట్టూ భద్రతా సిబ్బంది రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రేక్షకులు శాంతంగా ఉండాలని క్రీడామంత్రి అరూప్ బిశ్వాస్, ఈవెంట్ ముఖ్య నిర్వాహకుడు శతద్రు దత్తా మైక్‌లో కోరినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, క్రికెటర్ సౌరవ్ గంగూలీ వచ్చే ముందు ఉదయం 11.52 గంటలకు మెస్సీని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. మెస్సీని ముందుగానే మైదానం నుంచి బయటకు వెళ్లడం ప్రేక్షకులకు ఆగ్రహాన్ని తెప్పించింది. రూ. 12వేలు చెల్లించి టికెట్ కొన్నా.. ఫుట్‌బాల్ దిగ్గజాన్ని చూడలేకపోయామన్న వారి కళ్లల్లో కనిపించింది. కొంతమంది క్రీడాభిమానులు కుర్చీలను విరిగొట్టి స్టేడియంలోకి విసిరారు. ఇంకొంతమంది వాటర్ బాటిళ్లను విసిరారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ S.I.T దర్యాప్తునకు ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు పియూష్ పాండే, జావేద్ షమీమ్, సుప్రతిమ్ సర్కార్, మురళీధర్‌లతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వాహకుడు దత్తాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
విచారణలో ఇంకా ఏం చెప్పాడు?
మెస్సీని కౌగిలించుకోవడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఆయనకు రక్షణగా వచ్చిన విదేశీ భద్రతా సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రారంభంలో 150 గ్రౌండ్ పాస్‌లు మాత్రమే జారీ చేశాం. అంతకంటే మూడు రెట్ల మంది స్టేడియంలోకి ఎలా వచ్చారో నాకు తెలీదు. భారత్‌కు వచ్చిన మెస్సీకి రూ. 89 కోట్లు చెల్లించాను. పన్ను రూపంలో భారత ప్రభుత్వానికి రూ. 11 కోట్ల చెల్లించా. మొత్తం రూ. 100 కోట్లు ఖర్చయ్యింది. ఇందులో 30 శాతం స్పాన్సర్ల నుంచి సేకరించాను. మరో 30 శాతం టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చింది’’ అని వివరించారు దత్తా.
మంత్రి పదవికి రాజీనామా చేసిన క్రీడల మంత్రి..
పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ కార్యక్రమం అంతటా మెస్సీకి దగ్గరగా కనిపించారు. తన పలుకుబడిని ఉపయోగించి బంధువులు, వ్యక్తిగత పరిచయస్తులకు మెస్సీకి పరిచయం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.