మాంచెస్టర్ టెస్ట్: రాణించిన టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్

తొలి రోజు ఆట టీమిండియాదే, తుది జట్టులో మూడు మార్పులు చేసిన భారత్;

Update: 2025-07-24 05:10 GMT
సాయి సుదర్శన్

సిరీస్ లో నిలవాలంటే కచ్చితంగా గెలవాలి లేదా కనీసం డ్రా చేసుకోవాల్సిన మ్యాచ్ లో టీమిండియా తొలి రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. ఎడమ చేతి వాటం ఆటగాళ్లు జైస్వాల్, సుదర్శన్, పంత్ రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమాయానికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది.

అయితే పంత్ తొలిరోజే గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. ఆట ముగిసే సమయానికి రవీంద్ర జడేజా (19), శార్థూల్ ఠాకూర్(19) పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్ కు 94 పరుగులు
ఆకాశం మబ్బులు పట్టి ఉండటంతో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అయితే కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ మాత్రం ఆచితూచి ఆడుతూ వికెట్ కాపాడుకున్నారు.
ముఖ్యంగా కేఎల్ రాహుల్(46) బాడీకి దగ్గరగా, లేట్ గా ఆడుతూ సహనంగా బ్యాటింగ్ చేశారు. మరో ఒపెనర్ జైస్వాల్(58) కూడా తన శైలికి భిన్నంగా ఢిపెన్స్ గా ఆడాడు. వీరు ఇద్దరు తొలి వికెట్ కు 94 పరుగులు జోడించారు.
లంచ్ తరువాత రాహుల్ అవుట్ కావడంతో వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన సాయి సుదర్శన్ కూడా నింపాదిగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో తన తొలి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కరుణ్ నాయర్ స్థానంలో తన ఎంపిక సరైనదే అని నిరూపించకున్నాడు. అతని కాస్త అదృష్టం కూడా కలిసివచ్చింది. 20 పరుగుల వద్ద కీపర్ స్మిత్ అతని క్యాచ్ విడిచిపెట్టాడు.
సుదర్శన్ తో కలిసి బ్యాటింగ్ చేసిన పంత్(37) క్రిస్ వోక్స్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ చేయడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు. అయితే ఈ క్రమంలో బంతి వేగంగా తన పాదానికి తగలడంతో నొప్పితో విలవిలలాడాడు.
పాదం మీద రక్తపు మరకలు సైతం కనిపించాయి. మూడో టెస్ట్ లో వేలిగాయం కారణంగా చాలాసేపు మైదానం వెలుపల కనిపించిన పంత్, మరోసారి గాయపడటం ఆందోళన కలిగిస్తోంది.
ఆకాశం మబ్బులు పట్టి ఉన్నప్పటి పిచ్ నెమ్మదిగా ఉండటంతో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ ను మన బ్యాట్స్ మెన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.
భారత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఈ మ్యాచ్ లోనూ నిరాశపరిచాడు. టీ కంటే ముందే తన వికెట్ ను సమర్పించుకున్నాడు. ఉదయం సెషన్ లో వికెట్లు పడగొట్టడానికి ఇబ్బంది పడిన ఇంగ్లీష్ బౌలర్లు లంచ్ తరువాత చకాచకా మూడు వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశారు.
రాహుల్ దూరంగా లేట్ కట్ ఆడబోయి స్లిప్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అవగా, డాసన్ బౌలింగ్ లో జైస్వాల్ మొదటి స్లిప్ లో బ్రూక్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తరువాత క్రీజులోకి వచ్చిన గిల్ స్టోక్స్ బంతిని సరిగా అంచనా వేయలేక బంతిని విడిచిపెట్టడానికి ప్రయత్నించగా అది నేరుగా ప్యాడ్లను తాకింది. దీనితో ఇంగ్లాండ్ అప్పీల్ చేయడం, అంపైర్ అవుట్ ఇవ్వడం చకాచకా జరిగిపోయింది.
భారత్ ఈ మ్యాచ్ లో మూడు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన నితిష్ స్థానంలో శార్థూల్ ఠాకూర్, కరుణ్ స్థానంలో సాయి సుదర్శన్, ఆకాశ్ దీప్ స్థానంలో అన్షుల్ కాంబోజ్ తుది జట్టులోకి చేరారు. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1 తో ముందంజలో ఉంది.


Tags:    

Similar News