చేను మేశాక కంచె విచారిస్తున్నట్లు... రైతుల ఆత్మహత్యల పై బిఆర్ఎస్ కమిటీ
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు;
-జూకంటి జగన్నాథం
దీర్ఘకాలికంగా కొనసాగుతున్న రైతు సమస్యలపై ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా కనిపిస్తున్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారం తారుమారు కాగానే భారతీయ రాష్ట్ర సమితి (BRS) దాని నాయకులు డిసెంబర్ ఏడు నుండి ఇప్పటివరకు జరిగిన రైతుల ఆత్మహత్య (Farmers’ Suicide) లపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సభ్యులుగా అధ్యయన కమిటీని వేయడం అభినందనీయం.
అయితే ప్రస్తుత రైతుల సమస్యలకు మూల కారణం కేవలం ఈ ప్రభుత్వమే కారణంగా ఎత్తిచూపడం సరైనది కాదు. ఎందుకంటే గత పాలకుల తాత్కాలిక నిర్ణయాలే కారణమనే విషయాన్ని ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ గుర్తించకపోవడమే కాక గుర్తించ నిరాకరించడం మిక్కిలి శోచనీయమైనది. వారు వీరైనంత మాత్రాన, వీరువారైనంత మాత్రాన ప్రజలు తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేయడం సాధ్యం కాదు. సమర్థవంతంగా నిర్వహించడం అంత సులభమేమీ కానేరదు. ఏదో తాము ప్రతిపక్షపాత్రను పోషిస్తున్నామని భుజాలు చరుచుకోవడం చూస్తుంటే నాయకులు ప్రజా సమస్యల పట్ల ఎంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది.
తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల కాలం ప్రభుత్వంలో ఉన్నంతసేపు ప్రతి సమస్యకు ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలే ప్రధాన కారణమనే బూచిగా చూపారు. కారణమని ఆరోపించారు తక్షణ సమస్య నుంచి పారిపోయేందుకు విఫల ప్రయత్నం చేశారని నిస్సందేహంగా చెప్పవచ్చును.
2014 నుండి 2022 వరకు జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (National Crime Records Bureau)
లెక్కల ప్రకారం సుమారు 7,000 పైగా రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో జరిగాయని నమోదు అయ్యాయి. ఇందులో ముఖ్యంగా కౌలు రైతుల ఆత్మహత్యలే అధికంగా ఉన్నాయి. ఈ విషయాన్ని వ్యవసాయ రంగంపై పనిచేస్తున్న నిపుణులు వ్యాసాలు రాస్తే అప్పటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా మంత్రివర్యులు ఒకానొక పత్రికలో రైతుల ఆత్మహత్యలు సున్నా అని జరగలేదని వ్యాసం రాయడం సంబంధిత రంగంలో పనిచేసే నిపుణులను ఆలోచన పరులను ఆశ్చర్యానికి గురి చేసింది . ఇక ఇప్పుడు బారాస (BRS) పార్టీ వేసిన ఆత్మహత్యల కమిటీ అట్టి మాజీ మంత్రి ఆధ్వర్యంలో వేయడం గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టుగా ఉంది.
పైగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వాస్తవంగా 230 రైతు ఆత్మహత్యలు జరిగితే 400 రైతు ఆత్మహత్యలు గత ఏడాది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో జరిగినట్టు చెప్పడం చూస్తుంటే ప్రజలను తక్కువ అంచనా వేస్తున్నారనిపిస్తుంది. తెలంగాణ (Telangana) ప్రజలు తమ పదేళ్ల అప్రజాస్వామిక పాలనను అంత తొందరగా మరిచి పోతారనుకుంటే పొరపాటు అని వీరు గ్రహించినట్టు కనపడటం లేదు. అన్ని మర్చిపోయి తమ పదేళ్ల పాలన ‘బంగారు తునుక’ దశాబ్దమని, ఎన్నికలలో ప్రజలే తప్పు చేశారని ఇప్పటికీ భావిస్తే వారి ఖర్మ అనుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. ఈ నాయకుల బుకాయింపులు చూస్తుంటే కుక్కతోక వంకర అనే సామెత గుర్తుకు వస్తున్నది.
ఈ మధ్యకాలంలో రైతులు ఎండుమిర్చిని కాలబెట్టడం, పంట పొలాన్ని తగలబెట్టడం, టమాటలను రోడ్లమీద పారపోయడం చూస్తుంటే మనసు వికలమవుతున్నది. ఎందుకంటే భూమి దున్ని కలుపు తీసి ఎరువు మందులు వేసి క్రిమిసంహారక రసాయనాలు పిచికారి కొట్టి చేనును కంటిపాపలా చూసి తీరా పండిన పంటను మార్కెట్కు తీసుకువస్తే భూమిలేని పంట పండించని దళారీ వ్యవస్థ రింగుగా ఏర్పడి రేటును తక్కువగా నిర్ణయించి రైతులను నిలువునా ముంచుతారు.
ఈ రైతు సమస్యల మూలాలను వెతుకుతుంటే కొన్ని ఆలోచించవలసిన ఆశ్చర్యకరమైన విషయాలు ఎదురవుతున్నాయి. దేశం ఎదుర్కొంటున్న ఆహార కొరతను ఎదుర్కోవడానికి అమెరికాలో వ్యవసాయ విద్యనభ్యసించి దేశానికి వచ్చిన శాస్త్రజ్ఞుడు నాటి మద్రాస్ కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ ఆధ్వర్యంలో 1965 సంవత్సరంలో దేశంలో హరిత విప్లవం (Green Revolution) ప్రారంభమైనది. ఆయన సూచనల మేరకు వ్యవసాయ రంగంలో సాంప్రదాయ పద్ధతుల స్థానంలో ఆధునిక పద్ధతులను అంటే కొత్త రకం వంగడాలు రసాయన ఎరువులు పురుగు మందులు ఆధునిక పద్ధతులు అవలంబించాలని సూచించి అమలుపరిచారు. దేశం ఆహార ఉత్పాదకతలు స్వయం సమృద్ధి సాధన కోసం హరిత విప్లవం ముఖ్య పాత్ర వహించినది.
అయితే ఆశ్చర్యంగా దేశం ఆయా ప్రణాళిక కాలంలో అవలంబించిన లక్ష్యాల సాధనలో ప్రధానంగా వ్యవసాయ దేశమైన మన దేశం క్రమంగా పారిశ్రామీకరణ కొరకు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నిర్ణయాల వలన క్రమంగా వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడినది. దేశంలో 1970 నుండి రైతు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలైనది . దీనికి ప్రధాన కారణం అధిక వడ్డీకి ప్రైవేటు అప్పులు చెల్లింపుల ఒత్తిడి వ్యవసాయంలో పెరిగిపోయిన వ్యయం వెరసి తడిసి మోపిడై రైత పైన పెను భారం (Debt Burden) ఎక్కువైనది. క్రమంగా ఈ అల్పపీడనం తుఫానుగా మారి 1980 నుంచి వ్యవసాయ రంగంలో సంక్షోభం తీవ్ర రూపం దాల్చి దేశం మొత్తంలో రైతుల ఆత్మహత్యలు లక్షలు దాటిపోయినది . తిరిగి సంక్షోభ నివారణ కోసం తిరిగి స్వామినాథన్ కమిటీని ప్రభుత్వం నియమించగా అనేక సూచనలు చేసింది. అందులో భాగంగానే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం వచ్చింది.
సమస్యలు ఇలా ఉంటే రైతాంగానికి కంటి తుడుపు చర్యలు గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుబంధు రైతు పెట్టుబడి సహాయం రైతు భరోసా ఎరువులపై సబ్సిడీలు తదితర కార్యక్రమాలను చేపడుతున్నది. కానీ ప్రభుత్వం రైతు ఆత్మహత్యలను నిలువరించలేకపోతున్నాయి.
ఇకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రైతుబంధు ధరణి తెచ్చి రైతు పట్టాదారున్ని భూమి సంపూర్ణ హక్కుదారుని గా గుర్తించి అన్ని రకాల ఆర్థిక సహాయాలు అతనికి అందేలా చేసింది. కౌలుదారున్ని కిరాయి దారునిగా అభివర్ణించి కౌలు రైతులకు ఏ మాత్రం ప్రభుత్వ ఆర్థిక సహాయం అందకుండా చేసి రైతులను ఆత్మహత్యల వైపు మరింత పురికొల్పినట్టుఅయింది. ఇవన్నీ మర్చిపోయి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ రైతుల ఆత్మహత్యల పైన అధ్యయన కమిటీ వేయడం చూస్తే కంచె చేను మేసిన చందంగా ఉన్నది. బావకవుల్లాగా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది.
(జూకంటి జగన్నాథం, కవి ,రచయిత)