ప్రశ్న: ఆంధ్రాలో గవర్నమెంట్ టీచర్లేమి చేస్తున్నారు?
జవాబు: పాఠం తప్పించి అన్ని పాకీ పనులు చేస్తున్నారు’;
By : The Federal
Update: 2025-07-24 03:29 GMT
బోధనేతర పనిని ఎందుకు బాయ్ కాట్ కూడదు? అదే మార్గమా? ముఖ్యమంత్రుల సరదాలకు, పబ్లిసిలీ కాంక్షకు బలిఅవుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యారంగం
* విద్యాశాఖలో ఏం జరుగుతోంది?
* కంచే ఎందుకు చేను మేస్తుంది..?
* పాలకులే తమ విధానాల ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఎందుకు సర్వనాశనం చేస్తున్నారు?
* మధ్యాహ్న భోజనానికి తొమ్మిది రిజిస్టర్లా?
* ప్రతి పిల్లోడికి ఇచ్చిన యూనిఫామ్ కోసం ప్రతి పిల్లోడి చేత బయోమెట్రిక్ వేసి కన్ఫర్మ్ చేయించాలా?
* ప్రతి పనికి ఆన్లైన్ యాప్ లోనూ.., ఆఫ్లైన్ రిజిస్టర్ లోనూ ... డబుల్ పని ఎందుకు?
* జూన్ ఫస్ట్ వీక్ లో ఇవ్వాల్సిన ట్రైనింగ్లు.. స్కూల్స్ రీ ఓపెనింగ్ తర్వాత ముమ్మరంగా క్లాసులు జరిగే జూలై నెలలో ఎందుకు?
* మీ గిన్నిస్ రికార్డుల కోసం నిర్వహించే... యోగ డే కోసం 5 రోజులు, మెగాపేరెంట్స్ మీటింగ్ కోసం 10 రోజులు ఎంతవరకు అవసరం..?
* 1 నుంచి 10 తరగతులు నిర్వహించడానికి... 9రకాల పాఠశాలలు.. ప్రపంచంలో ఏ దిక్కుమాలిన దేశంలో అయినా ఉన్నాయా..?
* అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలు ఒకరు లేదా ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లతో మాత్రమే ఎలా రన్ చేయగలుగుతారు..?
* ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థుల సంఖ్య 45 దాటితే మోడల్ ప్రైమరీ చేశారు., అదే యూపీ స్కూల్స్లో ఒకటి నుంచి ఐదు తరగతిలో 58 ఉన్నా కూడా మోడల్ ప్రైమరీ కం యూపీ ఎందుకు చేయలేదు? అంటే యూపీ వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసమే కదా..?
* 1 నుంచి 8 తరగతులు విద్య హక్కు చట్టం పరిధిలోకి వస్తాయి. అందువల్ల 6 నుంచి 8 తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్లను విద్యాహక్కు చట్టం నిబంధనల కు అనుగుణంగా ఎందుకు కేటాయించటం లేదు?
* అసలు ఉపాధ్యాయులకు బోధనేతర పనులు కేటాయించే అధికారం మీకు ఉందా..?
* విద్యా హక్కు చట్టం ప్రకారం... ప్రకృతి వైపరీత్యాలు, జనాభా లెక్కలు, ఎన్నికలు... తప్ప మరి ఏ ఇతర బోధనేతర పని అప్పగించకూడదని స్పష్టంగా ఉన్నా... సివిల్ సర్వెంట్లు అయిన మీరు చట్టాలను ఏ ధైర్యంతో ఉల్లంఘిస్తున్నారు..?
* ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే... ఒక లెసన్.. ఏ యాక్టివిటీతో చెప్పాలో మీరే చెప్తారా..? ఆ లెసన్ అయ్యాక వర్క్ బుక్ లో మీరు ఇచ్చిన ఎక్సర్సైజులే చేయాలా? ఉపాధ్యాయుడు అనేవాడు సూపర్వైజర్ లేదా అబ్జర్వర్ లేదా ట్యూటర్ కాదు., స్థానిక పరిసరాలు, పరిస్థితులు, మాండలికాలకు అనుగుణంగా బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతుంది. అది కూడా తెలియని అధికారులు ఉండడం మా దౌర్భాగ్యం.
* ఆఖరిగా... మా మండల, జిల్లా స్థాయి అధికారులకు, స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ లు, రాష్ట్ర స్థాయి అధికారులు చెప్పిన దానికి స్థానిక ఇబ్బందులను.. పైకి తీసుకు వెళితే ఎక్కడ ఏ మాట అనేస్తారో అనే భయంతో ... సంధానకర్తలుగా ఉండే ఈ స్థానిక అధికారులు క్షేత్రస్థాయి ఇబ్బందులను పైకి తీసుకువెళ్ళరు., అలా అని రాష్ట్ర స్థాయి అధికారులు డైరెక్ట్ గా క్షేత్రస్థాయి ఉపాధ్యాయులతో మాట్లాడరు.
ఈ బాధ్యతారహిత్యమైన లేదా ఉద్దేశపూర్వకమైన ఈ ప్రయోగాల వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిస్థాయిలో ధ్వంసం అవుతుంది. దీని ఫలితం... బడుగు, బలహీన, తాడిత, పీడిత వర్గాలకు ప్రభుత్వ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య దూరం అవుతుంది.
నిజానికి ఇది కూడా పాలకులు ఎత్తుగడే కావచ్చు... ఎందుకంటే... వారి భవిష్యత్తు ఓటరులు తమ కాళ్లు పై తాము నిలబడితే... వీరి దిక్కుమాలిన సంక్షేమ పథకాల కోసం ఆధారపడే... అన్నమో రామచంద్రా... అనే వర్గం తయారు కాదు కదా..! చివరగా....టీచర్స్ అనుకుంటున్నాదేమిటంటే.... వేరే డిపార్ట్మెంట్ కి వెళ్లే అవకాశం ఉంటే వెళ్ళిపోవాలనిపిస్తుంది టీచర్ ఉద్యోగం చేయలేక ఇప్పుడున్న విద్యార్థులతో తల్లిదండ్రులతో పై అధికారులతో పడలేక నానా బాధలు పడవలసి వస్తోంది అందరూ కలిసి టీచర్ ఉద్యోగాన్ని ఇంత కఠిన తరం చేసేస్తున్నారు పెన్షన్ ఇస్తామంటే రెక్కలు వచ్చి న పక్షుల ఎగిరిపోవడానికి చాలామంది టీచర్లు సిద్ధంగా ఉన్నారు ఇన్ని రకాల ఒత్తిడిలు తట్టుకునే అంత శక్తి లేక చాలామంది ఉపాధ్యాయులు హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు వదిలేస్తున్నారు
-ఒక ఉపాధ్యాయురాలు