చేదైపోయిన తిరుపతి లడ్డు...
ఏపీ న్యాయమూర్తి వాయించిన చెంపదెబ్బలు;
ఘుమఘుమలతో నోరూరించే అద్భుతమైన లడ్డు, ఎక్కడి మిఠాయీ దుకాణంలోనూ దొరకని లడ్డు, శ్రీ వేంకటేశ్వరునికి ఎంతో ప్రియమైన లడ్డు, తిరుపతి లడ్డు (Tirupati Laddu) . ఆ రుచికి, నాసికలను మైమరపించే ఆ వాసనకి కారణం ఆ లడ్డులో ఉపయోగించే నెయ్యి. నెయ్యితోనే వెంకన్నే లడ్డు, లడ్డూ అంటే వెంకన్న అనే స్థాయి గుర్తింపు వచ్చింది.
లడ్డూ అంటే లబ్ డబ్ అనే భక్తుడికే తిరుపతి లడ్డు అంటే గుండె గుభిల్లుమనే కల్తీ. సిగ్గు సిగ్గు. డబ్బుకోసం గుండెను ఆగించి ఆగమాగమయ్యే కల్తీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలు మాత్రమే కాదు; ప్రపంచమంతా వ్యాపించిన ఘుమఘుమ నెయ్యితో నిండిన లడ్డూ నైవేద్యానికి పనికిరాకుండా ఏడు కొండల వెంకన్న ఏ విధంగా ఆరగిస్తాడు?
లడ్డూ చేతికిరాగానే దండం పెట్టి, కళ్లకద్దుకుని, ‘ఓం నమో వేంకటేశాయ’ అనుకునే మామూలు మనిషి మొత్తం లడ్డు కాకపోయినా, ఒక చిటికెడు దొరికినా అదే భాగ్యం అనుకునే భక్తుడు ఏమని తింటాడు? లడ్డూ మాత్రమే కాదు. నెయ్యి నిండిన ఇతర ప్రసాదాల దిక్కేమిటి?
అది అక్రమం, అన్యాయం, కోట్లాది మనంతా కలచిచేసే దుర్మార్గం. దొంగకుంభకోణం. రాజకీయ, వ్యాపార దుకాణంగా మారిన పెద్దలెందరో నిండిపోయిన అవినీతి పరాకాష్ట. ఇది తిరుపతిలోనా, తిరుమలలోనా, ఆంధ్రప్రదేశ్ లోనా, మనదేశంలోనా, ఈ మన ప్రపంచంలోనా మరో కల్తీ నెయ్యి ప్రమాద ప్రపంచంలోనా ఈ నెయ్యి ఘోరం.
ముఖ్యమంత్రిగారు స్వయంగా చెప్పిన దారుణం, సుప్రీంకోర్టుదాకా రెండుసార్లు తట్టి లేపిన దారుణం. జులై మొదటి పక్షంలో, దేవదేవుడి దేవతలుండే మన ఆంధ్రప్రదేశ్ అమరావతి లో న్యాయమూర్తులు ఆశ్చర్యపోయేంత కయ్యం పేరనే నెయ్యి దారుణం.
మత విశ్వాసాల కన్నా వ్యాపార అవినీతితో మన అవని రాజకీయ వ్యాఖ్యలతో నిండే ఎక్కువ ప్రభావం చూపిస్తుందా ఏమిటి? శ్రీవేంకటేశుడు మిమ్మల్ని క్షమిస్తాడా? తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చాలా ప్రఖ్యాతి చెందిన ప్రతిష్టాత్మకమైన లడ్డూ ప్రసాదంగా పంచే ప్రసిద్ధ మన సమాజంలో నెయ్యి గురించి చేసిన ఒక రాజకీయ వ్యాఖ్య, అనంతరం జరిగిన సుప్రీం కోర్టు జోక్యం, చివరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు—ఇవి మతస్థలాల, పరిపాలనా స్వతంత్రతల, న్యాయ వ్యవస్థల మధ్య సంబంధాలపై విలక్షణ న్యాయచర్చకు దారి తీశాయి.
జంతుకొవ్వు కావచ్చని అనుమానమట!
2024 సెప్టెంబర్ 18న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుమల లడ్డుల తయారీలో గత ప్రభుత్వ కాలంలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కావచ్చన్న ఆరోపణ చేశారు. ఇది కేవలం ఆరోపణ కాదు—ఆంధ్ర ప్రజల హృదయాల్లో పునీతంగా ఉన్న తిరుమల దేవస్థానంపై, లడ్డూ ప్రసాదంపై కలుషిత భావన కలిగించే నమ్మడానికి లేని అనుమానం అవుతూ అవుతూ నిజం కాబోతున్నదా అనే భయంగా పెరుగుతున్నది. ఈ వ్యాఖ్యలపై చాలా సమర్థులైన, రోజూ లక్షల భక్తులకు దర్శనం, ప్రసాదాలు ఇప్పించే గొప్పని చెప్పుకునే టిటిడి అధికారులు స్పందించి ఆ ఆరోపణను ఖండించారు. కాని అక్కడ ఆగిపోతాయా, రాజకీయ మతపరమైన ఊహాగానాలు విస్తరించాయి.
సుప్రీం కోర్టు స్పష్టంగా స్వతంత్ర దర్యాప్తు అవసరమన్నది తెలుసా?
వివాదం మతసామరస్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉన్నందున, కొన్ని పౌరుల పిటిషన్‌పై స్పందించిన సుప్రీం కోర్టు, 2024 అక్టోబర్ 4న WP(C) No.622/2024లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (అంటే ప్రత్యేక దర్యాప్తు చేసే జట్టు) ను రద్దు చేసి, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అదే లజ్జాకరం, అవమానం, అప్రతిష్ట కాదూ. అప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి కమిటీ సభ్యులుగా:
• సిబిఐ నుండి ఇద్దరు అధికారులు,
• ఏపీ పోలీస్ నుండి ఇద్దరు,
• ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ నుండి ఒక సీనియర్ అధికారి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
“నిర్దోషి అనిపించాలంటే కేవలం న్యాయంగా కాక, న్యాయంగా కనిపించేలా కూడా ఉండాలి,” అని సుప్రీంకోర్టు చెంపదెబ్బ వేసింది. దర్యాప్తు పూర్తి పారదర్శకంగా ఉండాలన్నదే సుప్రీం న్యాయమూర్తుల లక్ష్యం, ఉద్దేశం కూడా.
దర్యాప్తు భ్రాంతి: పిటిషనర్ ఆవేదన
ఇక్కడే రంగంలోకి ప్రవేశిస్తారు కడూరు చినప్పన్న అనే మహానుభావుడు, మాజీ ప్రభుత్వ అధికారి. ఆయన హైకోర్టును ఆశ్రయిస్తూ, సుప్రీం కోర్టు ఆదేశాలను ఖండిస్తూ ప్రతివాది నెంబర్ 10 అనే జె. వెంకట్ రావు అనే అధికారి తనను విచారించిన తీరును ప్రశ్నించారు. ఇక తీవ్రమైన ఆరోపణలేమిటో చూద్దాం. ఈయన్ని సుప్రీంకోర్టు నియమించలేదు. మధ్యలో సిబిఐ మెహర్బానీతో దూరిన మనిషి. సుప్రీంకోర్టు ఒక జాబితా ఇచ్చాక దానికి మరొకవ్యక్తిని జోడించవచ్చా. అయినా ఆనాటి సిబిఐ డైరెక్టర్ ‘నీపని బాగుందోయ్,నువ్వు మాటీమ్ లో ఉండేసేయ్," అనేశాడు.
ఇవీ ఆరోపణలు:
• ప్రతివాది నెంబర్ 10 సుప్రీం కోర్టు నియమించిన సిట్ లో సభ్యుడే కాదు.
• అయినప్పటికీ, విచారణాధికారిగా వ్యవహరించాడు.
• తన స్టేట్మెంట్లు 7–8 సార్లు రికార్డు చేసి పాతవాటి కాపీలు తొలగించారట.
• విచారణ సమయంలో పలువురు ఉన్నారట, వీడియోలు తీశారట—ఇది తీవ్ర మానసిక ఒత్తిడికి దారి తీసిందని పేర్కొన్నారు.
సిబిఐ వాదన:
పరిపాలనా అవసరమే అంటూ ప్రతివాది నెంబర్ 10 గారిని కొన్ని సిబిఐ డైరెక్టర్ పరిపాలనా అవసరాల కోసం నియమించామని, నోటీసులు తయారుచేయడం, హాజరైన వారిని పరిగణలోకి తీసుకోవడం వంటి విషయాల్లో సహాయం చేశారని వాదించారు. ఆ విధంగానే సిబిఐ కొన్ని కేసులను ఉదాహరణగా చూపించింది: అవి:
• హెచ్.ఎన్ .రిశ్బుద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ డిల్లి (1954)
• స్టేట్ ఆఫ్ బిహార్ వర్సెస్ అనిల్ కుమార్ (2017)
• ఈ తీర్పులు, కొంత మేర దర్యాప్తు లోపాలను చట్టపరంగా పరిష్కరించవచ్చన్న చట్ట సిద్ధాంతాన్ని చూపిస్తాయి. కానీ హైకోర్టు ఈ వాదనలను తిరస్కరించింది.
అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు: న్యాయ పరిపాలనను కాపాడిన తీర్పు. వారికి అందరూ ధన్యవాదములు చెప్పవలసిందే. జస్టిస్ హరినాథ్ ఎన్. తన 28 పేజీల తీర్పులో మూడు అంశాలను స్పష్టంగా తెలిపారు:
1. సుప్రీం కోర్టు ఇచ్చిన సిట్ లో సభ్యుల వివరాలు ఖచ్చితంగా పేర్కొన్నాయి. ప్రతివాది నెంబర్ 10 గారికి అక్కడ చోటు లేదు.
2. ఈ నియామకం సాధారణ పరిపాలనా వ్యవహారంగా కాక, హైకోర్టు నమ్మిన నమ్మకపు వ్యవస్థపై మచ్చ వేయడమే.
3. ఈ కేసు మత విశ్వాసాలకి సంబంధించినదే కనుక అత్యధిక జాగ్రత్త అవసరం.
అందువల్ల, సిబిఐ వాదనను తిరస్కరించి, సుప్రీం కోర్టు నియమించిన సిట్ లోని వారి అధికారులకే విచారణ అధికారమని స్పష్టం చేశారు. ప్రతివాది నెంబర్ 10 గారిని దర్యాప్తు చేయకూడదని ఆదేశించారు ఇది మరొక చెంపదెబ్బ.
న్యాయపరమైన ముఖ్యాంశాలు
ఈ తీర్పు కేవలం ఒక కేసులో ఇచ్చిన తీర్పు కాదు; అది పెద్ద వాదోపవాదాలు చేసిన తరువాత ఇది రాజ్యాంగ వ్యవస్థలో మూడు అంతరాలలైన కార్యవర్గ, శాసనిక, న్యాయ వ్యవస్థలో మధ్య హద్దులు ఎలా ఉండాలో సూచించేది:
• సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా న్యాయస్థానాల ఆదేశాలకు లోబడి ఉండాలి.
• రాజకీయ నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రులు, మతస్థలాల గురించి వ్యాఖ్యలు చేసే ముందు తగిన బాధ్యతతో వ్యవహరించాలి.
• న్యాయస్థానాలు, మత విశ్వాసాల నేపథ్యంలో జరిగే విచారణల్లో ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టే కవచాలుగా వ్యవహరిస్తున్నాయి.
ప్రజాభిప్రాయం – న్యాయ విశ్వాసానికి గౌరవం
ఈ తీర్పు ద్వారా హైకోర్టు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చింది: “రూల్ ఆఫ్ లా (చట్టపాలన) ననే కాదు, దానిని నిర్దేశించిన కోర్టు ఆదేశాలనూ గౌరవించాలి.” ముఖ్యంగా మత విశ్వాసాల కలుషితమయ్యే ప్రమాదంలో కోర్టు జోక్యం ద్వారా ప్రజల్లో న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవాన్ని మరింత బలోపేతం చేసింది.
తిరుమల లడ్డూ కేసు మత విశ్వాసానికి సంబంధించినదే అయినా, దాని వెనుక న్యాయపరమైన వ్యవస్థాపిత విలువలు చాలా ఎక్కువ. రాజకీయ నాయకులు ఎంత గొప్పవారైనా, కేంద్ర సంస్థలు ఎంత శక్తివంతమైనవైనా, కోర్టు ఆదేశాల పరిధిలోనే వ్యవహరించాలి అనే పాఠం ఇది.
ఈ తీర్పు నాటి కేసుకే పరిమితం కాదు; భవిష్యత్తులో కోర్టులు నియమించిన దర్యాప్తుల పట్ల ప్రభుత్వాలు, అధికారులు ఎలా వ్యవహరించాలో చెప్పే జ్యుడీషియల్ మార్గదర్శకం ఇది.