ఆంధ్రాలో విద్యారోదన, టీచర్ల ఆక్రందన

గత ఏడాది ఉపాధ్యాయుల గుండె జబ్బులతో మరణాలను, మరణ కారణాలపై ఒక కమిటీ వేసి సమగ్ర పరిశోధన చేయాలి;

Update: 2025-07-23 11:47 GMT
మెగా టీచర్-పేరెంట్ మీట్ పుట్టపర్తి సమీపాన కొత్తచెరువు జిల్లా పరిషత్ హైస్కూలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్

ఒక విద్యా సంవత్సరంలో 220 పని దినాలు ఉంటాయి. ఈసారి 230 ఉన్నట్టుగా అకాడమిక్ క్యాలెండర్ పేర్కొన్నది. కాస్త అటు ఇటుగా 10 శాతం పని దినాలు పూర్తయ్యాయి, విద్యా ప్రాధాన్యతాంశంగా, ప్రక్షాశన పరువు సాగుతున్నట్టుగా, శిక్షణలతో మంచి రోజులు రానున్నట్లుగా, నమోదు శాతం పెరిగినట్లుగా ప్రచారంలో ఉన్న కథనాలకు, వాస్తవిక అంశాలకు మధ్య తీవ్ర అంతరం ఉన్నట్లుగా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే బయటపడతాయి.

విద్యాశాఖ అధికారులు అత్యుత్సాహం, ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం కలెక్టర్లతో సహా అధికారులు చేస్తున్న అర్థరహిత చర్యల పట్ల సగటు ఉపాధ్యాయుడు విసుగెత్తి ఉన్నారు. ఎవరికీ చెప్పుకోలేని బాధలతో సతమతమవుతున్నారు. గత ఏడాది కాలంలో గుండె జబ్బులతో మరణించిన ఉపాధ్యాయుల సంఖ్యను, వారి మరణ కారణాలపై ఒక కమిటీ వేసి సమగ్ర పరిశోధన చేయవలసిన అవసరం ఉంది. విద్యాశాఖ పెద్దలు ఎవరికి వారుగా ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూ విద్యా రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వాస్తవ విషయాలు సీఎం గారి దృష్టికి ఏనాటికి చేరి తన బంట్రోతు పనికి ఎన్నడు మోక్షం లభించి విజమైన ఉపాధ్యాయులుగా ఎప్పుడూ అవతారం ఎత్తుతామోనని టీచర్లు ఎదురు చూస్తున్నారు.
జూన్ 12 నుండి ఏం జరిగింది?
జూన్ 12 నుండి విద్యా సంవత్సరం ప్రారంభమైంది. గడిచిన 20 రోజుల్లో అధికారిక వాట్సాప్ గ్రూపులో 18 సార్లు గూగుల్ ఫారం నింపాలని లింకు ద్వారా ఆదేశాలు ఇచ్చారు, నాలుగుసార్లు పాఠశాల పనివేళల్లో జూన్ మీటింగ్స్ నిర్వహించారని సాక్షాదారాలతో సహా ఒక టీచర్ చూపించారు. తల్లిదండ్రుల సమావేశం నిర్వహణపై 9.30 నిమిషాలకు ఉదయం బోధన సమయంలో జిల్లా విద్యాధికారి జూమ్ సమావేశం నిర్వహించడం పై ఉపాధ్యాయ వర్గాలు అసహనం చూపారు. పంట నాటు వేసే సమయంలో ఎవరు వస్తారని, ప్రతి నెల తల్లిదండ్రులను పిలవడం, డాక్యుమెంట్లు, సమావేశం తాలూకు ఫోటోలు, సాక్షాధారాలు వెబ్సైట్లో నమోదు పరచడాన్ని ఉపాధ్యాయులు చాలా ఇబ్బందికరంగా భావిస్తున్నారు. ఇవన్నీ పాఠాలు చెప్పాల్సిన టీచర్ చేసే పనులేనా?
పనిగంటలు ఇలా నాశనం
పన్నెండు రోజులపాటు సాగిన ‘బడిబాట’లో రోజువారి సమోదు వివరాలు ఇటు  మండల కేంద్రానికి అందించడం, అటు రాష్ట్ర వెబ్సైట్లో పొందుపరడం జరిగింది.  దానికి తోడు సీఆర్ఫీ నుండి రోజు ఫోన్ కాల్స్ వస్తాయి. సీఆర్పీ లనుంచి నేటి వరకు 30 కాల్స్ పైగా వచ్చాయని, ప్రోగ్రెషన్ ఆక్టివిటీ, యూడైస్ అప్డేషన్, టెక్స్ట్ బుక్ ఎంట్రీ, నోట్ బుక్స్ ఎంట్రీ , యూనిఫారాలు, ఇప్పుడు ఇంకా ఈపిలు,జిపిలు ఎంట్రీ పేరు మీదుగా ట్యాబ్, మొబైల్ ఫోన్లకు అనేక గంటలు అంకితమయ్యాయి.
అటెండెన్స్ కాప్చర్ తో పాటు మధ్యాహ్నాభోజనం యాప్ లో నింపడం, కాంప్లెక్స్ గ్రూపులో వివరాలు షేర్ చెయ్యడం వంటి పసులకు గంట పైగా సర్వనాశనం అవుతున్నది. ఇద్దరు ఉపాధ్యాయులు గల బడిలో ఒకరు ఒకరు రెండున్నర రోజులు, ఒకరు మూడు రోజులు సెలవులో ఉన్నారు, ఆ ఆరు దినాలలో సకాలమున బోధన జరగలేదు, ఈ 20 రోజుల్లో 30శాతం కాపలా కోసం పోతే మిగతా 7శాతం పనికిరాని సమాచార విప్లవానికి బలైంది.
ప్రారంభ పరీక్ష పేరిట రెండు రోజులు, యోగ పేరిట అర పూట చెట్లు నాటే కార్యక్రమానికి ఒక పూట. ఇలా మరో మూడు రోజులు వెరసి పది రోజులు పోయాయి.  మిగిలిన 10,12 రోజుల్లో బహుళ తరగతి బోధనలో ఒక తరగతికి ఒక పాఠం చెబితే మరో తరగతి చూస్తూ ఉండిపోయింది. 
తీరా రోజు ఇంత సమాచారం పుంఖాను పుంఖాలుగా పాఠశాల నుండి రాష్ట్రం, కేంద్రం వరకు ప్రసారం జరుగుతూ ఉంటే సైకిళ్ళ పంపిణీ డేటా కోసం మళ్లీ బడిలోనే విద్యార్థుల వివరాలు అడగాల్సిన దీనావస్థ ఏమిటి. ఈరోజు ఏ విద్యార్థి హాజరయ్యారో వారి చిరునామాతో సహా, ఆధార్ సంఖ్య, ఫోటోతో సహా తెలుసుకునే వెసులుబాటు ఉండగా, పదవ తరగతి అమ్మాయిల సంఖ్య అధికారుల వద్ద లేక మళ్ళీ గూగుల్ ఫారం ద్వారా జడగడం హాస్యాస్పదం గా లేదూ. నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వం, అధికారులు చూపిస్తున్న చిత్తశుద్ధి ఈ విధంగా బహిర్గతమవుతుంది.
సీఆర్పీలు ఎందుకు?
సమాచార సేకరణకు, మానిటరింగ్ కు, పాఠశాలకు విద్యాశాఖకు సమన్వయంగా పనిచేయాల్సిన సీఆర్పీ లు ఎక్కడా భౌతికంగా కనిపించడం లేదు, చాలా చోట్ల ఎం.ఆర్.సి లేదా కాంప్లెక్స్ పాఠశాలల్లో క్లర్కులుగా ఉంటున్నారు. ఫోన్లో, వాట్పాప్ లో మినహా ఉపాధ్యాయులతో నేరుగా కలిసే అవకాశం వారికి లేదు. ఉపాధ్యాయులు ఎవరైనా సెలవు పెడితే వారిని పాఠశాలకు పంపడం లేదు.
కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు క్లరికల్ స్టాప్ ఉన్నప్పటికీ ఒక టీచర్ అనధికారికంగా అసిస్టెంట్ గా నియమించుకొని బిల్లులు వేయడానికి వాడుకుంటున్నప్పటికీ సి ఆర్ పి లను వారి సొంత పసులకు వినియోగించుకోవడం విచారకరం.
ఏదైనా రిపోర్టులు ఇవ్వాల్సి వస్తే టీచర్లు ఒక పూట అన్ డ్యూటీ పేరుతో మండల విద్యా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది .
ఈ విద్యా సంవత్సరం యూనిఫారాల కోసం మూడు పూటలు, పాఠ్యపుస్తకాల కోసం ఒకసారి, నోటు పుస్తకాల కోసం మరొకసారి పాఠశాల నుంచి ఎవరో ఒక ఉపాధ్యాయుడు మండల కేంద్రానికి వెళ్లవలసిన పరిస్థితి విద్యాశాఖ అధికారులు కల్పించారు. ఈ ఉద్దేశ్యంతో సిఆర్పి వ్యవస్థ ఏర్పడిందో, అది పక్కదారి పట్టడం వలన ఒకరు మండల కేంద్రాలకు వెళ్ళవలసిన పరిస్థితి ప్రభుత్వం కల్పించింది.
ఏ ఉద్దేశం కోసం అయితే సీఆర్పీ వ్యవస్థ ఏర్పడిందో అది పక్కదారి పెట్టడం వల్ల నేడు బోధన సమయానికి గండి పడుతున్నది. ఒక సీఆర్పీ తన వరిధిలో మహా అయితే  10 పాఠశాలలు ఉంటాయి. నాలుగు రోజుల్లో మొత్తం సమాచారాన్ని సేకరించడమే కాక, యూడైస్, ఆన్లైన్ వర్క్ వంటి వాటిల్లో ప్రతి పాఠశాలకు సహకరించే అవకాశం ఉండగా, వారిని మొత్తానికి అజ్ఞాతం చేసి కంప్యూటరీకరణ క్లర్క్ గా మార్చేశారు..
కలెక్టర్ల విపరీత జోక్యం
పాఠశాలలు సజావుగా నడవడానికి, సౌకర్యాలు కల్పన కోసం, పర్యవేక్షణకు, ఇతర సలహాలు సూచనలకు, సమీక్షలకు కలెక్టర్ల జోక్యం అవసరమే. తానీ పేరు కోసం, అధికారులు దృష్టిలో పడి మంచి పోస్టింగులు పొందడం కోసం కొందరు కలెక్టర్లు శృతి మించిన పనులు చేస్తున్నారు.
ఒక జిల్లా కలెక్టర్ ఎఫ్ ఎల్ ఎన్ ప్రగతి కోసం స్నేహపూరితంగా కావలసిన అన్నింటినీ మంజూరు చేసి "కాఫీ విత్ కలెక్టర్" కార్యక్రమం నిర్వహించి ఉపాధ్యాయుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి అటు ఎఫ్ ఎల్.ఎన్ ప్రగతికి, ఉపాధ్యాయుల ప్రేమకు పాత్రులయ్యారు.
కానీ కొన్ని జిల్లాల్లో ఇచ్చిన బూట్లు, సాక్సులు రోజు వేసుకో వస్తున్నారా? లేదా గూగుల్ ఫారంలో నింపమనడం, వారు వెళ్ళిన రోజు ఎవరైనా విద్యార్థులు షూ, సాక్సలు లేకుండా ఉంటే టీచర్లను మందలించడం, మెమోలివ్వడం, వారు నిర్వహించే యూట్యూబ్ ఛానల్ కోసం బలవంతంగా పేరెంట్స్ ను సబ్ స్క్రైబ్ చేసుకోమని పదే పదే అధికారుల ద్వారా అడిగించడం, ఎంతమంది పేరెంట్లు సబ్స్క్రైబ్ చేసుకున్నారు వంటి మీద దృష్టిపెట్టడం, తరగతి ద్వారా వివరాలను అడగడం చేస్తున్నారు. ఇదంతా అవసరమా.
ఇదే సమయాన్ని ఇదే అధికార యంత్రాంగాన్ని మరిన్ని పనులకు వినియోగిస్తే బాగుంటుందని పలు అభిప్రాయపడుతున్నారు.
బోధనకు స్వేచ్ఛ ఇవ్వండి
పలానా పాఠం ఇలాగే బోధించాలని, పాఠానికి వర్క్ బుక్ కు సమన్వయం ఉంచాలని, అన్నిటికీ ఇన్ని రోజులే కావాలని అడగడం కన్నా మా మానాన మమ్మల్ని వదిలేస్తే రికార్డు రిపోర్టులు పని నుండి తప్పిస్తే అనుభవం ఉపయోగించి బోధన చేసుకుంటామని సగటు ఉపాధ్యాయులు అంటున్నారు. రోజువారి లెక్కలు, కొలతలు, సమాచారం ఆన్లైన్ లో రోజంతా అందిస్తూ అలసిపోతున్నామనీ, స్వేచ్ఛ ఇవ్వకుండా సమయాన్ని అధికారులు ధరించి వేస్తున్నారని, రిపోర్టులు , రికార్డులు సరిగా లేకుంటే ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని భయభ్రాంతులకు గురవుతున్నామని, తద్వారా బోధన కన్నా వాటిపైనే ఎక్కువ దృష్టి కేటాయిస్తున్నామని, ఇది విద్యా బోధన వెనుకబడి పతనానికి కారణంగా మారిపోయిందని తెలియజేస్తున్నారు.

కాంప్లెక్స్ సమావేశాలు పేరిట ఒక విద్యా సంవత్సరంలో ఆరు సార్లు లు రెండు. రోజులు అనగా 12 రోజులు బడి బోధనకు దూరం అవుతుందని, ప్రత్యేక కార్యక్రమాలు పేరిట మా రెండు రోజులు వృధా అవుతున్నాయని, ఈ విధానం మారాలని అంటున్నారు. పాఠశాల ప్రగతికి నాణ్యమైన విద్య కోసం చేయాల్సిన పనులు, సంబంధించిన నిధులు, తరగతికి ఒక ఉపాధ్యాయుడికి ఇవ్వకుండా, పర్యవేక్షణ పేరిట సంబంధంలేని విధి విధానాలను. అధికారుల సంఖ్యను పెంచినంత మాత్రాన విద్యా వ్యవస్థ గాడిన పడుతుందని భావించడం అత్యాశ అవుతుంది.

మిగిలిన 90 శాతం పని దినాల్లో ఇలాగే 90 శాతం వృథా కానివ్వకుండా ఉండే విధానాలను అధికారులు రూపొందించాలి. కాగితాలు, సమాచారం కేవలం ప్రచార అర్బాటానికే తప్ప ప్రగతికి సూచికలు కాజాలవు అన్న సత్యాన్ని గ్రహించాలి. క్షేత్రస్థాయిలో బోధన మాత్రమే లక్ష్యంగా సాగే ఒక సాధారణ ఉపాధ్యాయుడు ఇచ్చిన వాస్తవ సమాచారం లో నిజాయితీ, బాధ, ఆరాటం ఉన్నాయి. ఇగో వదిలి చిన్న నుండి పెద్ద అధికారి వరకు ప్రస్తుత విధానాలను పునసమీక్షించుకోవాలి. బడులు బతికే రోజులు రావాలి, ఇదే సగటు విద్యాభిమానులు, సగటు ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు....

- ఓ సగటు సర్కారు ఉపాధ్యాయుడు...


Tags:    

Similar News