డీలిమిటేషన్ చర్చ.. తెరపైకి మణిపూర్ శరణార్థులు
రాష్ట్రంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(NRC) అమలు చేసిన తర్వాతనే డీలిమిటేషన్ చేపట్టాలని మణిపూర్‌లోని అన్ని పార్టీలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.;
కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్(Delimitation) వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చలకు దారితీస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనను దక్షిణాది రాష్ట్రాలతో పాటు పలు ఇతర రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. వాటిలో మణిపూర్ కూడా ఒకటి. అయితే తమ రాష్ట్రంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(NRC) అమలు చేసిన తర్వాతనే డీలిమిటేషన్ చేపట్టాలని మణిపూర్‌లోని అన్ని పార్టీలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మణిపూర్ రాజకీయాల్లో శరణార్థుల చిచ్చు రాజుకుంది. మే 2023 నుంచి రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో మయన్మార్ నుంచి అక్రమంగా వచ్చేసిన శరణార్థుల పాత్ర అధికంగా ఉందని, ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 250కి పైగా ప్రజలు మరణించారని కేంద్రం ఆరోపించింది. తాజాగా ఈ అంశంపై మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్(Biren Singh) చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. అందులో ఆయన మణిపూర్‌లో శరణార్థులు ఉండటం కొత్తేమీ కాదని చెప్పారు. 1960 నుంచి కొన్ని వేల మంది శరణార్థులు మణిపూర్‌లో నివాసం ఉంటున్నారని, వారికి సంబంధించిన వివరాలను అధికారులకు కూడా తెలుసని గుర్తు చేశారు. అంతేకాకుండా శరణార్థులను పునరావాసం కూడా కల్పించిన అంశాలను వివరించారు.
అంతేకాకుండా అప్పుడెప్పుడే మణిపూర్‌కు వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్న వారికి భారత పౌరసత్వం ఇచ్చారా? అసలు ఆ కుటుంబాలు ఏమయ్యాయి? వారికి ఓటు హక్కు కల్పించారా? అన్న సందేహాలను లేవనెత్తారు. అయితే 2001 జనగణన, ఎన్‌ఆర్‌సీ అమలు అంశాలను సమీక్షించిన తర్వాతనే రాష్ట్రంలో డీలిమిటేషన్ చేపట్టాలని మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వారి డిమాండ్ తర్వాత బీరెన్ సింగ్.. తన పోస్ట్ పెట్టారు. అందులో ఆయన పలు విషయాలను పేర్కొన్నారు.
‘‘అధికారిక లెక్కల ప్రకారం.. మణిపూర్ పూర్తిస్థాయి రాష్ట్రంగా అవతరించకముందు కూడా వేల మంది శరణార్థులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ విషయం అధికారులకు కూడా తెలుసు. 1960, 1970 తొలినాళ్లలోని దస్త్రాలు దాదాపు 1500 కుటుంబాలు బోర్డర్ క్రాస్ చేసి ఇక్కడకు వచ్చి నివాసం ఉంటున్నాయని స్పష్టం చేస్తున్నాయి. వారికి పునరావాసం కల్పించడంలో అధికారులు కూడా సహాయం అందించరని డాక్యుమెంట్స్ చూపుతున్నాయి’’ అని సింగ్ పేర్కొన్నారు. మణిపూర్.. 1 నవంబర్ 1956న కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. ఆ తర్వాత 21 జనవరి 1972 నాడు ప్రత్యేకే రాష్ట్రంగా అవతరించింది.
‘‘అలనాడు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన కుటుంబాలు ఏమయ్యాయి? ఇక్కడి జనాభాలో వాళ్లు ఎలా కలిసిపోయారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి సంబంధించి ఎన్ని తరాలు వచ్చాయి? కాలక్రమంలో వారికి పూర్తిస్థాయి హక్కులు కల్పించారా? వారిని కూడా ఓటర్ల జాబితాలో చేర్చారా? ఈ ప్రశ్నలను ప్రజాక్షేత్రంలో ఎప్పుడూ కూడా పూర్తిగా వివరించలేదు. రాష్ట్రంలో ఎన్నో మార్పులు వచ్చినా ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం వినిపించలేదు. చాలా వరకు వీటిని పట్టించుకోలేదు’’ అని ఆయన అన్నారు.
1967లో మణిపూర్ ఎంపీగా ఉన్న పావోకై హవోకిప్(Paokai Haokip).. అప్పటికి మణిపూర్‌లో స్థిరపడి ఉన్న 1500 శరణార్థుల కుటుంబాల గురించి తెలుపుతూ అప్పట్లో హోంశాఖ సహాయక మంత్రి కేసీ పంత్‌కు ఒక లేఖరాశారు. ఆ లేఖను కూడా బీరెన్ సింగ్ తన పోస్ట్‌లో పెట్టారు.మణిపూర్‌లో శరణార్థుల సమస్య ఎంత కాలం నుంచి ఉంది, ఎంత లోతుగా ఉంది అని నిరూపించే అనేక సాక్ష్యాల్లో పావోకై రాసిన ఈ లేఖ ఒకటి మాత్రమేనని బీరెన్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రారంభం నుంచి కూడా మణిపూర్(Manipur) అనేది శరణార్థుల డంపింగ్ గ్రౌండ్‌గానే ఉందా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారాయన. అంతేకాకుండా ఈ కుటుంబాలను శరణార్థులుగానే ఉంచేలా ఏదైనా చట్టపరమైన యంత్రాంగం ఏదైనా ఉందా అని తెలుసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
‘‘స్థానిక సమాచాల కోసం ఉద్దేశించిన ప్రయోజనాలను ఈ శరణార్థులకు కూడా అందించారా? ఇవి చిన్న విషయాలు కాదు. ఇవి మా ఐడెంటిటీ మూలానికి సంబంధించినవి. అంతేకాకుండా ఇవి సమాజంలో మేము ఎటు వెళ్తున్నాం అనేది చూపుతుంది’’ అని అన్నారు.
అంతేకాకుండా మణిపూర్ చరిత్రలోని శరణార్థుల అధ్యాయాన్ని మళ్ళీ పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందని, నిందలు వేయడం మానుకుని ఏమి జరిగిందో అర్థం చేసుకోవాలని కోరారు. అంతేకాకుండా అప్పుడు తీసుకున్న నిర్ణయాల పర్యావసనాలు ఎలా ఉన్నాయి? వంటి వాటిని ఆలోచించుకోవాలన్నారు. వీటిని పరిశీలించిన తర్వాత న్యాయమైన, సమతుల్యమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ముందకు వెళ్లాలి. ఈ మార్గం.. రాష్ట్ర వర్తమాన, భవిష్యత్తును రూపొందిస్తుందని వివరించారు.
“ప్రజా ప్రతినిధిగా ఉండటం ఎంత బరువు బాధ్యతలతో కూడుకున్న పనో క్రియాశీలక రాజకీయాలు, పెద్దపెద్ద పదవుల్లో ఉన్న అనుభవంతో నేను అర్థం చేసుకోగలను. నలుగురితో నారాయణ అనడం చాలా సులభం. కానీ భాద్యత అనేది వాస్తవాలపై స్థిరంగా ఉండటంలోనే ఉంటుంది’’ అని బీరెన్ సింగ్ చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రంలో చెలరేగుతున్న హింసాత్మక చర్యల నడుమ ఫిబ్రవరి 2025లో బీరెన్ సింగ్.. సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన తప్పుకోవడంతో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమలు చేశారు.
settled in