ఎస్సీలకు క్రిమీలేయర్ భావన సరిపోతుందా?
బీసీ విధానాలు, అనుభవాలు ఏం చెబుతున్నాయి?
By : The Federal
Update: 2025-11-22 07:13 GMT
ఎస్సీ కులాలలో కూడా ‘క్రిమీలేయర్’ భావన తీసుకురావాలనే ఆలోచనలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సమర్థించారు. ముఖ్యంగా రిజర్వేషన్ లలో ఈ విధానం బాగుంటుదందని ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో సీజేఐ అభిప్రాయపడ్డారు. అయితే క్రిమీలేయర్ అన్న భావన పాశ్చాత్య సాహిత్యంలోకానీ, భారత రాజ్యాంగంలో కానీ ఎక్కడా కనిపించదు.
క్రిమిలేయర్ అనే భావనను భారత్ లో మొదట తీసుకొచ్చింది తమిళనాడులో కొలువైన డీఎంకే ప్రభుత్వం. 1969 లో సీఎం కరుణానిధి.. సత్తానాథన్ కమిషన్ ను నియమించారు. ఈ కమిషన్ చేసిన సిఫార్సులలో అతిముఖ్యమైనది క్రిమీలేయర్.
అంటే వెనకబడిన తరగతులలో(బీసీలు) కాస్త ఆర్థికంగా, సామాజికంగా ఉన్నతంగా ఉన్న వర్గాలకు రిజర్వేషన్లు పొందకుండా ఉండేందుకు దీనిని తీసుకొచ్చారు. కమిషన్ దీనిని సిఫార్సు అయితే చేసింది కానీ.. డీఎంకే ప్రభుత్వం మాత్రం దీనిని అమలు చేయలేకపోయింది.
1976 లో మరో దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ లో ఇది న్యాయపరమైన సమస్యను లేవనెత్తింది. కేరళ వర్సెస్ కేఎస్ జయశ్రీ కేసు ఇందుకు వేదికైంది. ఆదాయం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ రిజర్వేషన్ విధానంపై కోర్టులో సవాల్ చేశారు.
అలాగే కేసీ వసంత్ కుమార్ అండ్ అనదర్ వర్సెస్ కర్ణాటక (1986) లో ఇదే తరహా న్యాయ వివాదాలు తలెత్తాయి. బీసీలు ఒకే ప్రయోజనాన్ని తరాల పాటు ఏకపక్షంగా పొందకుండా కొన్ని చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం అభిప్రాయపడింది.
బీసీలకు రిజర్వేషన్లు విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘‘మీన్స్ టెస్ట్’’ ను ప్రవేశపెట్టాలని కూడా కోర్టు పేర్కొంది. ఈ రిజర్వేషన్ ఉద్దేశం సమాజంలోని అసమానతలు, వెనకబాటుతనాన్ని పరిష్కరించడానికి ఉద్దేశించబడ్డాయి. ఇందులో ఇంకా అర్హులైన వారిని గుర్తించడానికి క్రిమీలేయర్ ఒక ఆర్థిక ప్రమాణంగా ఉండాలి.
1960, 70, 80 లలో దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ క్రిమీలేయర్ అనే భావన ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
1989 లో కేంద్రంలో కొలువుదీరిన విపీ సింగ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టులో ఇంద్రసాహ్నీ కేసు దాఖలైంది.
ఈ కేసును విచారించిన తొమ్మిది మంది న్యాయమూర్తులు దీనిని కొనసాగించమని అలాగే ఓబీసీ కోటాలో ‘మీన్స్ టెస్ట్’ ను తీసుకురావాలని ఆదేశించింది.
ఈ తీర్పు తరువాత క్రీమీలేయర్ సమస్యను పరిశీలించడానికి ప్రభుత్వం జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. బీసీలో రిజర్వేషన్ ను మినహయించడానికి క్రిమిలేయర్ పద్దతికి రెండు ప్రమాణాలను సిఫార్సు చేసింది.
వీరిలో రాష్ట్రపతి, ఉపాధ్యక్షుడు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు వంటి రాజ్యాంగ పదవులు ఆక్రమించిన వ్యక్తుల, గ్రూప్ ఏ సర్వీస్ కేటగిరీ, సాయుధ దళాలలో కర్నల్, అంతకంటే పై స్థాయిలో ఉన్నవారు, సర్వీస్ సెక్టార్, వాణిజ్యం, వ్యాపారాలు, పరిశ్రమలలో నిఫుణులు, ఆస్తి యజమానులు మొదటి కేటగిరిలో నిలిపారు.
రెండో భాగంలో ఆదాయం, సంపద కేంద్రంగా కీలక సూచనలు చేశారు. ఇది వ్యక్తి వార్షిక ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్లను మినహయిస్తుంది. ఈ సిఫార్సు ప్రకారం.. 8 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి క్రిమీలేయర్ వర్తిస్తుంది.
ఎస్సీ వర్గీకరణ సమయంలో ఇచ్చిన తీర్పులోని తన వైఖరిని బీఆర్ గవాయ్ సమర్థించారు. క్రిమీలేయర్ ను ఎస్సీలకు కూడా వర్తింపజేయాలని అభిప్రాయపడ్డారు.
అయితే బీసీలకు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్ లను భర్తీ చేయడానికి చాలాసార్లు క్రిమిలేయర్ అడ్డంకిగా మారిందని గణాంకాలు సూచిస్తున్నాయి. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ డేటా ప్రకారం మూడు దశాబ్ధాలుగా కేవలం 17 శాతం మాత్రమే బీసీల కోటా పూర్తి చేయబడింది. ఈ చరిత్ర ప్రకారం.. క్రిమీలేయర్ మినహయింపు కంటే మొత్తం కోటాను భర్తీ చేయడానికి పాయింట్ల విధానం పరిశీలిస్తే బాగుంటుంది.