బంగారం దిగుమతులతో భారీగా పెరిగిన వాణిజ్య లోటు

బంగారం దిగుమతులు రెండు వందల శాతం పెరిగినట్లు గణాంకాలు, 500 శాతం పెరిగిన వెండి దిగుమతులు

Update: 2025-11-18 06:36 GMT

అమెరికా, భారత్ పై విధించిన సుంకాల ప్రభావం క్రమంగా కనిపిస్తోంది. గత నెలలో భారతీయ ఎగుమతులు తీవ్రంగా ప్రభావితం అయినట్లు తాజాగా విడుదలైన గణాంకాలతో తెలియజేస్తున్నాయి.

ఎగుమతులు 11.8 శాతం తగ్గి, 34.38 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బంగారం దిగుమతుల వల్ల వాణిజ్యలోటు రికార్డు స్థాయిలో 41.68 బిలియన్ డాలర్లకు పెరిగింది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. బంగారం, వెండి, పత్తి, ఎరువులు, సల్పర్ అధిక మొత్తంలో దిగుమతి కారణంగా దేశ దిగుమతులు 16.63 శాతం పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి అయిన 76.06 బిలియన్లకు చేరుకున్నాయి.

సెప్టెంబర్ లో వాణిజ్య లోటు 31.15 బిలియన్లకు పెరిగింది. ఇది ఒక సంవత్సరంలోనే అత్యధికం. విలువైన లోహాల దిగుమతుల బిల్లు అనూహ్యంగా పెరుగుతున్నాయి.

అక్టోబర్ నెలలో బంగారం దిగుమతులు దాదాపు 200 శాతం పెరిగి 14.72 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో వెండి దిగుమతులు 528.71 శాతం పెరిగి 2.71 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో ముడి చమురు దిగుమతులు 18.9 బిలియన్ డాలర్ల నుంచి 14.8 బిలియన్ డాలర్లకు తగ్గాయి.

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- అక్టోబర్ కాలంలో ఎగుమతులు స్వల్ఫంగా 0.63 శాతం పెరిగి 254.25 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతుల 6.37 శాతం పెరిగి 451.08 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2025 ఏప్రిల్- అక్టోబర్ కాలంలో వర్తక వాణిజ్యలోటు 196.82 బిలియన్లు కాగా, 2024 ఏప్రిల్- అక్టోబర్ కాలంలో ఇదే కాలంలో 171.40 బిలియన్లుగా ఉంది.
మన స్థానానికి ఢోకా లేదు
ఈ డేటాపై మీడియాకు వివరణ ఇస్తూ వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉండగా, భారత్ తన స్థానాన్ని నిలుపుకుందని అన్నారు.
గత నెలలో ఎగుమతులు తగ్గడానికి బేస్ ఎఫెక్ట్ (అక్టోబర్ 2024 లో 38,98 బిలియన్) కూడా కారణమని ఆయన అన్నారు. ఇంజనీరింగ్ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, దుస్తులు, వస్త్రాలు, సేంద్రీయ అకర్భన రసాయనాలు, ఔషధాలు, ప్లాస్టిక్ వస్తువులు వంటి కీలక విభాగాలు కాస్త ఎగుమతి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి.
అక్టోబర్ లో హస్తకళలు, కార్పెట్, తోలు, ఇనుప ఖనిజం, టీ, బియ్యం, పొగాకు, సుగంధ ద్రవ్యాలు, నూనే ఎగుమతుల్లో ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 10.5 శాతం తగ్గాయి.
ఇవి దాదాపు 4 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు 16.71 శాతం తగ్గి, 9.37 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారత వస్తువులపై అమెరికా భారీగా 50 శాతం సుంకాలను విధించింది. ఇది ఎగుమతులపై ప్రభావం చూపుతోంది.
ప్రపంచ ఆర్థిక మందగమనం..
భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, బహుళ ప్రధాన మార్కెట్లలో డిమాండ్ తగ్గడం, వస్తువుల ధరలలో నిరంతరం అస్థిరత కారణంగా ప్రపంచ ఆర్థిక మందగమనం వైపు నడుస్తోందని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్ఐఈఓ) అధ్యక్షుడు ఎస్సీ రాల్హాన్ పీటీఐకి తెలిపారు.
భారత్ కు నిరంతర వాణిజ్య లోటు పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎగుమతిదారులు సవాల్ తో కూడిన ప్రపంచ వాతావరణంలో పోటీతత్వంతో ఉండగలిగేలా మెరుగైనా ఎగుమతి మద్దతు చర్యలు, వివిధ పథకాల కింద ప్రయోజనాలను వేగంగా విడుదల చేయడం, మెరుగైన పథకాల కింద ఎగుమతులు పెంచడంపై దృష్టి సారించాలని సూచించారు. తాత్కాలిక గణాంకాల ప్రకారం అక్టోబర్ నెలలో సేవల ఎగుమతుల అంచనా విలువ 38,52 బిలియన్ డాలర్లు, గత ఏడాది ఇదే నెలలో ఇది 34.41 బిలియన్ డాలర్లుగా ఉంది.


Tags:    

Similar News