ఆకాశంలో అద్భుతం.. క్షేమంగా చేరిన సునీత విలియమ్స్

సునీత విలియమ్స్ క్షేమంగా భూమి మీదకు చేరారు. సుమారు 17 గంటల ప్రయాణం అనంతరం ఆమె, మరో ముగ్గురు వ్యోమగాములు ఫ్లోరిడా సమీపంలోని సముద్ర జలాలలో దిగారు.;

Update: 2025-03-19 00:16 GMT
క్యాప్సూల్ నుంచి సునీత విలియమ్స్ ను బయటకు తీసుకువస్తున్న స్పేస్ ఎక్స్ సిబ్బంది. (ఎక్స్ సౌజన్యంతో)
19-03-2025 బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలు..
అంతరిక్ష నౌక స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ పై పారాసూట్లు రెపరెపలాడుతుండగా ఫ్లోరిడా తీరంలోని అట్లాంటిక్ మహాసముద్రంలో క్యాప్సూల్ దిగింది. అల్లంత దూరం నుంచి చూస్తున్న ప్రేక్షకులు, నాసా, స్పేస్ ఎక్స్ సిబ్బంది ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. 9 నెలలకు పైగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. భారతీయ సంతతికి చెందిన సునీతా విలియమ్స్ సహా నలుగురు వ్యోమగాములు అంతరిక్షం నుంచి క్షేమంగా తిరిగివచ్చారు.

మార్చి 18న ఉదయం 10:35గంటలకి క్రూ-9 క్యాప్సూల్ ఐఎస్ఎస్ నుంచి విడిపోయిన (Undocking) అనంతరం భూమి మీదకు తిరిగివచ్చే అద్భుత ప్రయాణం మొదలైంది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి బయల్దేరిన క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక బుధవారం తెల్లవారుజామున 3: 27 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగింది.
గంటకు 17 వేల మైళ్ల వేగంతో భూమివైపు ప్రయాణించిన డ్రాగన్‌ క్యాప్సుల్‌ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. మార్చి 19 తెల్లవారు జామున 3:00 గంటలకు ఈ క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు తెరచుకున్నాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకొని క్యాప్సుల్‌ 3:27 గంటలకు ప్లోరిడా తీరంలో సముద్రంలో ల్యాండింగ్ (Splashdown) అయింది.
క్యాప్సూల్ ను 4 గంటలకు రికవరీ నౌక ద్వారా సిబ్బంది (Recovery Vessel Arrival) నౌక మీదకు చేర్చారు. ఆ తర్వాత క్యాప్సూల్ ను చల్లబరిచారు. ఆ తర్వాత తలుపు తెరిచి స్పెస్ ఎక్స్ సిబ్బంది లోపలికి వెళ్ళారు.

ఆ తర్వాత కొన్ని నిమిషాల పాటు లోపల ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి.. సిబ్బంది అటుఇటూ తిరుగుతున్నారు. నిచ్చెనలు, స్ట్రెచ్చర్లు సర్దుతున్నారు. మెడికల్ టీమ్ ఓ పక్క సిద్ధంగా ఉంది. ఇంతలో వ్యోమాగాములు నలుగురు వరుసగా కూర్చొని చేతులు ఊపుతున్న చిత్రం తెరపైకి కనిపించడంతో మళ్లీ హర్షాతిరేకాలు. అక్కడున్న సిబ్బంది అందర్లో ఓ పెద్ద రిలీఫ్ కనిపించింది. చకచకా పనులు మొదలయ్యాయి.
సరిగ్గా 4.17 గంటలకు ఓవ్యోమగామిని క్యాప్సూల్ లో నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత 4.20 గంటలకు మరో వ్యోమగామిని తీసుకువచ్చారు. తీసుకువచ్చిన వారిని తీసుకువచ్చినట్టు స్ట్రెచర్ లాంటి వీల్ చైర్లో నౌక ముందు భాగానికి తరలించారు.
ఆ తర్వాత మూడు నిమిషాలకు అంటే 4.23 గంటలకు వ్యోమగాములు వేసుకునే తెల్లటి సూటు, హెల్మెట్ తో ఉన్న సునీత విలియమ్స్ ను బయటకు తీసుకువచ్చారు. ఆమె వస్తూనే చిర్నవ్వుతో సిబ్బందిని గ్రీట్ చేశారు. వీల్ చైర్ కదిలి ముందుకు పోయింది. చివరిగా బుచ్ విల్ మోర్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చారు. అప్పుడు సమయం తెల్లవారుజామున 4.24 గంటలు. వైద్య పరీక్షల అనంతం వారందర్నీ 5:00 గంటల ప్రాంతంలో నాసా స్పేస్ స్టేషన్ ఉన్న హ్యూస్టన్ కి విమానంలో (Crew Departure to Houston) తరలించారు.
క్యాప్సూల్ సముద్రంలో దిగిన తర్వాత...
ల్యాండింగ్ అనంతరం ఓ పెద్ద నౌక క్యాప్యూల్ వద్దకు వెళ్లింది. క్యాప్సూల్ ను సిబ్బంది నౌకమీదికి చేర్చారు. ఆ తర్వాత ఓ అరగంటకు రికవరీ బృందం వ్యోమగాములను కాప్సూల్ నుంచి బయటకు తీసింది.
సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌కు భూ వాతావరణానికి అలవాటు పడడానికి మరో 45 రోజులు పడుతుంది. ఈ కాలంలో వాళ్లు మళ్లీ నడకనేర్చుకోవాల్సి ఉంటుంది. పాదాలు స్వాధీనంలోకి రావాల్సి ఉంటుంది. చేతులు, కాళ్లు, శరీరం పట్టుకోల్పోకుండా డాక్టర్ల పర్యవేక్షణలో ఎక్సరసైజలు చేయిస్తారు.
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (Sunita Williams), మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌లు (Butch Wilmore) దాదాపు 9 నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయారు. వీరిద్దరితో పాటు మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్- అమెరికన్ నిక్ హేగ్, రష్యన్ కోస్మోనాట్ అలెగ్జాండర్ గోర్భునోవ్ కూడా సురక్షితంగా భూమిని చేరుకున్నారు. నాసా సిబ్బంది అక్కడికి చేరుకొని చిన్న చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చి.. ఒడ్డుకు చేర్చారు. అనంతరం వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు తరలించనున్నారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ మంగళవారం ఉదయం 10:35 IST సమయంలో ISS నుంచి వేరుపడి, 17 గంటల ప్రయాణం అనంతరం భూమికి తిరిగి వచ్చారు.
ఈ ఇద్దరు అంతరిక్షయాత్రికులు గతేడాది జూన్‌లో బోయింగ్‌ స్టార్లైనర్ లో అంతరిక్షానికి వెళ్లి చిక్కుకుపోయారు. అంతరిక్ష నౌకలో సమస్యలు (propulsion problems) తలెత్తడంతో వీళ్లు అక్కడే ఉండిపోవాల్సివచ్చింది.
క్రూ-9 క్యాప్సూల్ ల్యాండింగ్ టైమ్ షెడ్యూల్
ల్యాండింగ్ తేదీ: మార్చి 19, 2025
ల్యాండింగ్ ప్రదేశం: ఫ్లోరిడా తీరంలోని అట్లాంటిక్ మహాసముద్రం
అంతరిక్ష నౌక: స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్
మార్చి 18, 2025 - 10:35 AM ISS నుండి క్రూ-9 క్యాప్సూల్ విడిపోవడం (Undocking)
మార్చి 19, 2025 - 03:00 AM భూమి వాయుమండలంలో ప్రవేశం (Re-entry)
మార్చి 19, 2025 - 03:27 AM ఫ్లోరిడా తీరంలో సముద్రంలో ల్యాండింగ్ (Splashdown)
మార్చి 19, 2025 - 04:00 AM రికవరీ నౌక ద్వారా సిబ్బంది రక్షణ (Recovery Vessel Arrival)
మార్చి 19, 2025 - 04:22 AM సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ క్యాప్సూల్ నుండి బయటకు రావడం
మార్చి 19, 2025 - 05:00 AM హ్యూస్టన్‌కి విమాన ప్రయాణం (Crew Departure to Houston)
Tags:    

Similar News