TRUMP STROKE | అమెరికా పౌరసత్వ చట్టం రద్దుతో ఎవరెవరు నష్టపోతారంటే..
ఒక్క కలం పోటుతో వందేళ్ల చట్టం రద్దయింది. దీంతో వివిధ రకాల వీసాలపై అమెరికాలో ఉంటూ పిల్లల్ని కంటే వారికి ఆటోమాటిక్ గా వచ్చే పౌరసత్వం ఇకపై రద్దు కానుంది.;
By : Amaraiah Akula
Update: 2025-01-21 08:50 GMT
వందేళ్ల నాటి పౌరసత్వ హక్కు విధానాన్ని అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక్క కలంపోటుతో రద్దు చేశారు. దీంతో వివిధ రకాల వీసాలపై అమెరికాలో ఉంటూ పిల్లల్ని కంటే వారికి ఆటోమాటిక్ గా వచ్చే పౌరసత్వం ఇకపై రద్దు కానుంది. ట్రంప్ అధికారం చేపడుతూనే జనవరి 20వ తేదీ సాయంత్రం జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలుకు అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇది ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఉత్తర్వు జారీ సమయంలో డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ తరహా పౌరసత్వం ఇస్తున్న దేశం అమెరికా ఒక్కటేనని ట్రంప్ చేప్పిన మాట తప్పని, సుమారు 30 దేశాలు ఇలా పౌరసత్వాన్ని ఇస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంతకీ ఏమిటీ పౌరసత్వం, ఎందుకు రద్దు?
సుమారు వందేళ్ల కిందట అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ద్వారా ఈ పౌరసత్వ హక్కు విధానం అమల్లోకి వచ్చింది. అమెరికా గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికీ పౌరసత్వం దానంతటదే వచ్చేలా ఈ సవరణ తెచ్చారు. అక్రమ వలసల రద్దు పేరిట డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడీ విధానాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు.
14వ రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి పౌరసత్వం వచ్చింది. వందేళ్లుగా ఇది అమల్లో ఉంది. ఇప్పుడు ఇది రద్దు అయితే సుప్రీం కోర్టు లో దీర్ఘకాలిక చట్టపరమైన వివాదాలకు దారితీయవచ్చు. చట్టపరంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర ప్రభావాలను కలిగించవచ్చు. 14వ సవరణకు వ్యతిరేకంగా కోర్టుల్లో వ్యాజ్యాలు నడవచ్చు.
వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రద్దు చేశారు. అమెరికా రాజ్యాంగ 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమించాల్సి ఉంటుంది. తాజాగా దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ‘‘అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదు’’ అని ట్రంప్ ఈసందర్భంగా వ్యాఖ్యానించారు.
ఈసందర్భంగా అమెరికా మాత్రమే ఇలాంటి పౌరసత్వం అందిస్తోందని ట్రంప్ తప్పుగా వ్యాఖ్యానించారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాలు ఈ విధానంలోనే పౌరసత్వాన్ని అందజేస్తున్నాయి. అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది.
ఈ విధానం దాదాపు శతాబ్దకాలంగా అమలులో ఉంది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకూ, టూరిస్టు లేదా స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి అమెరికాలో కాన్పు కాగా పుట్టిన పిల్లలకూ ఈ నియమం వర్తిస్తుంది. ఈ విధానాన్ని రద్దు చేసే ప్రయత్నానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.
కుటుంబాలపై ప్రభావం...
పౌరసత్వం రద్దు వల్ల, పౌరసత్వం లేని తల్లిదండ్రుల బిడ్డలు ఏ ప్రాంతానికీ చెందని వారవుతారు(stateless). ఈ తరహా పిల్లల తల్లిదండ్రులకు ఓ దేశం ఉంటుందేమో గాని వారికి పుట్టిన పిల్లలకు మాత్రం ఏ దేశమూ ఉండకపోవచ్చు. ఇది తరతరాల సమస్యలకు దారితీయవచ్చు.
పౌరసత్వం లేని కుటుంబాలు తమ పిల్లలకు విద్యా లేదా ఆరోగ్య సేవలు పొందడం చాలా కష్టం. దీర్ఘకాలంలో ఆర్థిక ఉత్పాదకత తగ్గే అవకాశం ఉంది. జనన సమయంలో తల్లిదండ్రుల పౌరసత్వ స్థితిని పర్యవేక్షించడానికి కొత్త వ్యవస్థను రూపొందించాల్సి ఉంటుంది. ఇది ఆసుపత్రులకు, స్థానిక ప్రభుత్వాలకు అదనపు భారమవుతుంది.
ఈ విధానం సామాజిక వైరుధ్యాలకు, సామాజిక అంతరాలు పెరగడానికి వీలు కల్పిస్తుంది. ద్వేషభావం మరింతగా పెరుగుతుంది. మానవ హక్కుల సంఘాలు, వలసదారుల సమూహాలు, రాజకీయ ప్రత్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది.
దౌత్య సంబంధాలపై ప్రభావం..
ట్రంప్ తెచ్చిన ఈ విధానాన్ని చాలా దేశాలు అంగీకరించకపోవచ్చు. మానవ హక్కుల పరిరక్షణలో తమకు తామే సాటి అని చెప్పుకునే అమెరికాలోనే మానవ హక్కులు తిరోగమనంలో ఉన్నాయని విమర్శలు రావొచ్చు. అమెరికా గ్లోబల్ ఇమేజ్ దెబ్బతినవచ్చు. దౌత్య సంబంధాలపై ప్రభావం చూపవచ్చు.
గతంలో పౌరసత్వం పొందిన వారికి ఈ విధానం వర్తింపజేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. జాతీయ, అంతర్జాతీయ న్యాయస్థానాలు ఈ విధానాన్ని రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యగా (unconstitutional) ప్రకటించే అవకాశం ఉంది.
ఈ ఉత్తర్వు ఎప్పటి నుంచి అమలు...
ఈ ఉత్తర్వు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు. భవిష్యత్తు కట్-ఆఫ్ తేదీని నిర్ణయించలేదు. ఉదాహరణకు "అమెరికా పౌరులు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు గాని తల్లిదండ్రులకు 2026 జనవరి 1 లేదా ఆ తర్వాత జన్మించిన వారికి పౌరసత్వం కల్పించబడదు" అని స్పష్టం చేస్తే తప్ప ఈ విధానం అమల్లోకి వచ్చినట్టు కాదు. ప్రస్తుతం ఉన్న పౌరులపై ట్రంప్ విధానం ప్రభావం చూపదు. ఏ ప్రాంతానికీ చెందని పిల్లలు పుడితే పరిస్థితి ఏమిటన్నదే చర్చనీయాంశంగా ఉంది.
అందువల్ల ఈ విధానంలో కొన్ని ప్రత్యేకమైన గ్రూపులకు మినహాయింపులు ఇవ్వవచ్చు. ఉదాహరణకు: విదేశాలలో విధుల్లో ఉన్న సైనిక కుటుంబాలు, శరణార్థులు లేదా ఆశ్రయం కోరేవారు.
జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు పుట్టుక స్థానాన్ని (jus soli) కాకుండా పారంపర్య పద్ధతిని (jus sanguinis) ఆధారంగా పౌరసత్వం అందిస్తాయి. అమెరికా ఇలాంటి నమూనాను స్వీకరిస్తే, చట్టపరమైన, సాంస్కృతిక మార్పులు అవసరం అవుతాయి.
పౌరసత్వ హక్కు రద్దు విధానం చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. సాంఘిక విభజనలను తగ్గించేందుకు, స్పష్టమైన కట్-ఆఫ్ తేదీ, చట్టపరమైన సరైన నిర్మాణం, స్టేట్ లెస్ ను నివారించే మెళుకువలతో దీనిని అమలు చేయడం అవసరం.