ప్రపంచంలోని ఏ శక్తి మా ఏకీకరణను ఆపలేదు: చైనా అధ్యక్షుడు
తైవాన్ కు షీ జిన్ పింగ్ కొత్త సంవత్సర వార్నింగ్ లు;
By : Praveen Chepyala
Update: 2025-01-01 07:48 GMT
చైనా అధినేత షీ జిన్ పింగ్ మరోసారి తైవాన్, దాని మద్దతుదారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా తైవాన్ తో తమ ఏకీకరణను ఆపలేదని అన్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా జిన్ పింగ్ సీసీటీవీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ అక్కడ, ఇక్కడ ఉన్నది ఒకే కుటుంబం, ఎవరూ మా కుటుంబ బంధాన్ని విచ్ఛిన్నం చేయలేరు. అలాగే ఎవరూ కూడా మా చారిత్రక జాతీయ ఏకీకరణను అడ్డుకోలేరు’’ అని ఆయన అన్నారు.
చైనా చాలా సంవత్సరాలుగా తైవాన్ తమ భూభాగంగా ప్రకటిస్తూ వస్తోంది. ఈ ద్వీపంలో ప్రస్తుతం 23 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. అయితే బీజింగ్ క్లెయిమ్ లను తైపీ తిరస్కరిస్తూ వస్తోంది. మాదో స్వతంత్య్ర దేశమని దాని వాదన.
2024 లో తైవాన్ పై పెరిగిన చైనా ఒత్తిడి..
చైనా అధినేతగా పగ్గాలు చేపట్టిన తరువాత జిన్ పింగ్ తైవాన్ పై ఒత్తిడి పెంచే చర్యలను వేగవంతం చేశారు. ముఖ్యంగా గత ఏడాది అనేకసార్లు వ్యూహత్మక ఎత్తుగడలతో తైవాన్ ను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. దాని గగనతలాన్ని యుద్ద విమానాలతో నింపేయడం, తైవాన్ ప్రాదేశిక జలాల్లోకి యుద్ధ నౌకలను పంపి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు.
చైనా ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యూహం పన్నిందని, దాని ఎత్తుగడలను జాగ్రత్తగా గమనిస్తున్నామని తైపీ అధికారులు చెబుతున్న మాట. కానీ చైనా ఎంత చేసిన తైపీ ఎదురుదాడికి దిగడం లేదు.
ముఖ్యంగా తైవాన్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఉద్రికత్తలు పెరిగాయి. గత సంవత్సరం అధ్యక్షుడిగా వ్యాపార వేత్త లియ్ చింగ్ టెయిన్ బాధ్యతలు చేపట్టారు. ఆయన చైనా వ్యతిరేకి. తమది సార్వభౌమ దేశమని ప్రకటించారు. దీంతో చైనా ఆయనను ‘ సెపరేటిస్టు’ గా అభివర్ణించింది. తైవాన్ ను సైనిక శక్తితో లాక్కుకునే వాదనను తోసిపుచ్చలేమని కూడా హెచ్చరించింది.
తైవాన్ ప్రజాస్వామ్యంలో.. చైనా నియంతృత్వంలో..
తైవాన్ ఓ ప్రజాస్వామ్య దేశం. అక్కడ చాలాకాలంగా ఎన్నికలు జరగుతున్నాయి. గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తోంది. కానీ అందుకు విరుద్ధంగా చైనా కమ్యూనిస్టు నియంతృత్వ దేశంగా ఉంది. కానీ తైవాన్ ను తన సొంత దేశంలోని ఓ భాగంగా చైనా ప్రకటించుకుంటూ వస్తోంది.
అందుకు సమ్మతించని దేశాలకు ధమ్కీలు ఇస్తోంది. కానీ తైవాన్ మాత్రం బలంగా దీన్ని ప్రతిఘటిస్తోంది. ‘‘ మాకు ఇక్కడ ప్రజలే సుప్రీం. వారి భవిష్యత్ ను వారే నిర్ణయించుకుంటారు’’ అని తైపీ భావన. ఈ వాదననకు పశ్చిమ దేశాల మద్దతు ఉంది.
తైవాన్ ను ప్రపంచంలోని మిగిలిన దేశాలతో ఒంటరిగా చేయడానికి చైనా అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తనకున్న దౌత్య మార్గాలను ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగా అనేక దేశాలతో అది వన్ చైనా పాలసీకి అనుగుణంగా ప్రకటనలు ఇప్పించుకుంటోంది.
అమెరికా చాలా కాలంగా తైవాన్ తో వ్యూహాత్మక సంబంధాలను నెరుపుతోంది. చైనా చెబుతున్న మాటలను అది పెడచెవిన పెడుతోంది. చాలా పెద్ద మొత్తంలో అది ఆయుధాలను విక్రయించి సైనికంగా అండగా నిలబడుతుంది. తైవాన్ ప్రజాస్వామ్యానికి తాము అండగా ఉంటున్నామని వాషింగ్టన్ వాదన. అలాగే కమ్యూనిజం అడ్డుకోవడానికి కూడా తైవాన్ ను వైట్ హౌజ్ ఉపయోగించుకుంటోంది.