ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ల వైపు చూస్తున్న భారత్
ఎస్ యూ-57, ఎఫ్- 35 కోసం చర్చలు ప్రారంభించిన రక్షణ శాఖ;
By : Praveen Chepyala
Update: 2025-07-09 06:24 GMT
ఐదో తరం స్టెల్త్ యుద్ద విమానాల కొనుగోలు చేయడానికి భారత్ ప్రయత్నిస్తోందని, కొన్ని కీలక మిత్రదేశాలతో చర్చలు జరుపుతోందని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు.
జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం తెలిపారు. భారత వైమానిక దళం బలం రోజురోజుకి తగ్గిపోతోందని, ఎయిర్ ఫోర్స్ బలం వెంటనే పెంచుకోవాలని వాంఛిస్తున్న తరుణంలో సింగ్ ఈ విషయం వెల్లడించారు.
సాంకేతిక బదిలీపై భారత్ దృష్టి
భారత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కు త్వరలో ఐదో తరం యుద్ద విమానాలను కొనుగోలు చేయవచ్చనే నివేదికలు బయటకు వస్తున్న తరుణంలో న్యూఢిల్లీ వెంటనే చర్యలకు ఉపక్రమిస్తోంది.
ఇందుకోసం రష్యా తయారీ ఎస్ యూ -57, అమెరికన్ ఎఫ్-35 వంటి వాటిని కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సింగ్ సమాధానమిస్తూ స్టెల్త్ జెట్ ల కొనుగోలు విషయంలో భారత్ స్వల్పకాలిక సాంకేతిక బదిలీపై దృష్టిసారిస్తోందని, ప్రపంచ భాగస్వాములతో చర్చలు కొనసాగుతున్నాయని, కానీ ఇవన్నీ ప్రాథమిక దశలోనే ఉన్నాయని చెప్పారు.
‘‘స్వల్పకాలంలో ఐదో తరం యుద్ధ విమానాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి మేము పరిశీలిస్తున్నాము’’ అని సింగ్ అన్నారు. ఆధునాతన సామర్థ్యాలను నిర్మించాల్సిన అవసరాలను కూడా ఆయన ఎత్తి చూపారు.
‘‘మేము ఐదవతరం యుద్ధ విమానాల కార్యక్రమం పై మా భాగస్వాములతో మాట్లాడుతున్నాము. ప్రస్తుతానికి ఆ చర్చలు మీడియాతో పంచుకునే వరకూ చేరుకోలేదు’’ అని సింగ్ అన్నారు.
స్వదేశీ ప్రాజెక్ట్
భారత్ ఇప్పటికే స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాప్ట్ (ఏఎంసీఏ, అమ్కా) కార్యక్రమాన్ని ప్రారంభించగా, దాన్ని కొనసాగించే అవకాశం ఉందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. స్వల్పకాలంలో ఐదోతరం యుద్ధ విమానాలు పొందవచ్చో లేదో కీలక మిత్రదేశాలు, భాగస్వాములతో మాట్లాడుతోందని సింగ్ బదులిచ్చారు. ఈ పని మీడియా దృష్టికి రాకుండా జరగాలన్నారు.
దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఇంజిన్ అభివృద్దిని జాతీయ లక్ష్యంగా పరిగణించాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. భారత్ కు ఏకకాలంలో 2.5 వార్ చేయడానికి కనీసం 42 స్క్వాడ్రన్ల యుద్ద విమానాలు అవసరం ఉంటుందని వ్యూహకర్తలు భావించారు. కానీ ప్రస్తుతం మన దగ్గర కేవలం 31 స్క్వాడ్రన్ల విమానాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి దళాల సన్నద్దతపై ప్రభావం చూపుతున్నాయి.
ఎస్ యూ - 57, ఎఫ్- 35..
భారత్ స్టెల్త్ ఫైటర్ జెట్ ల కోసం రెండు దేశాలతో పాటు, స్వదేశీ ఆమ్కా ప్రాజెక్ట్ పైన దృష్టి పెట్టింది. లాక్ హీడ్ మార్టిన్ కు చెందిన ఎఫ్- 35, రష్యా తయారీ ఎస్ యూ - 57 లను పరిశీలిస్తోంది. ఇప్పటికే రష్యా, అమెరికా రెండు కూడా తమ ఫైటర్ జెట్లను అమ్మడానికి ఆసక్తి చూపించాయి.
ఎఫ్ -35 వర్సెస్ ఎస్ యూ -57
ఎఫ్ -35 అమెరికా తయారీది. ఇది సింగిల్ ఇంజిన్ మల్టీరోల్ విమానం. ఆయుధాలు లేకుండా 13.3 టన్నుల బరువు, ఉండగా 29. 5 బరువు గల ఆయుధాలను మోసుకెల్లగలదు.
దీనిలో ఆధునాతన సెన్సార్ ఫ్యూజన్, ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్, నెట్ వర్క్ సెంట్రిక్ ఆపరేషన్ లతో ఉంటుంది. ఎఫ్-35 లో మూడు వెర్షన్ లు ఉన్నాయి. ఎఫ్ 35 ఏ వెర్షన్ ధర 82 మిలియన్ డాలర్లుగా కాగా, దాని నిర్వహణ ఖర్చులు కూడా చాలా ఎక్కువ.
ఎస్ యూ -57 అనేది రెండు ఇంజిన్లతో నడిచే ఫైటర్ జెట్. దీని బరువు 18 టన్నులు, 35 టన్నులతో బరువు ను మోసుకెళ్లగలదు. ఈ ఇది క్రూయిజ్ పనితీరు కనపరిచినప్పటికీ, పూర్తి స్థాయి స్టెల్త్ ను పరిజ్ఞానం లేదు.
దీని ఒక్కో యూనిట్ వ్యయం 35- 45 మిలియన్ డాలర్లుగా ఉంది. విడి భాగాలు, మౌలిక సదుపాయాల కోసం అదనపు ఖర్చులు అదనం. ఎస్ యూ -57 లో అభివృద్ది, సాంకేతిక భాగస్వామ్యానికి న్యూఢిల్లీని, క్రిమ్లిన్ ఆహ్వానిస్తోంది.
అమ్కా ఇంజన్..
విదేశాల నుంచి ఫైటర్ జెట్ లను కొనుగోలు చేయడమే కాకుండా, ప్రముఖ ఏరోస్పేస్ సంస్థల దృష్టిని ఆకర్షించిన ఆమ్కా కోసం స్వదేశీ ఇంజిన్ ను అభివృద్ది చేయాలని భారత్ యోచిస్తోంది.
అమ్కా అనేది ఐదో తరం ట్విన్ ఇంజిన్స్ అన్ని వాతావరణాలకు అనువైన స్టెల్త్ ఫైటర్ ఇది ఆకాశంలో ఆధిపత్యం ప్రదర్శించగలదు. మెరుగైన ఎలక్ట్రానిక్ యుద్ద కార్యకలాపాల కోసం రూపొందించబడింది.
ఈ ప్రాజెక్ట్ ను ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ(ఏడీఏ) పర్యవేక్షిస్తోంది. ఇందులో హచ్ఏఎల్ కు ఎలాంటి పాత్ర లేదు.
మే నెలలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) స్వదేశీ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ కోసం నమూనాను అధికారికంగా ఆమోదించడంతో అమ్కా కార్యక్రమం కొత్త దశలోకి ప్రవేశించినట్లు అయింది.
ప్రభుత్వం ఆమ్కా ప్రోటో టైప్ ల అభివృద్ధికి పోటీతత్వ చట్రం కింద గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది మొదటిసారిగా ప్రభుత్వ, ప్రైవేట్ భారతీయ సంస్థలు కాంట్రాక్ట్ కోసం బిడ్డింగ్ చేయడానికి అనుమతిస్తుంది.
ఆధునీకరణకు ప్రొత్సాహం..
‘‘ఈఓఐ(ఆసక్తి వ్యక్తీకరణ), ఆర్ఎఫ్ఐ( సమాచార అభ్యర్థన)లను ఏడీఏ లేదా ఏరోనాటికల్ డెవలప్ మెంట్స్ ఏజెన్సీ జారీ చేసింది. వారు కొన్ని ప్రాథమిక రౌండ్ల చర్చలు జరిపారని నేను భావిస్తున్నాను’’ అని రక్షణ కార్యదర్శి చెప్పారు.
భారతదేశ వ్యూహాత్మక అవసరాలు, దీర్ఘకాలిక పారిశ్రామిక లక్ష్యాలు, కార్యాచరణ అవసరాలకు ఈ ప్రతిపాదనలు ఎంతవరకూ సరిపోతాయనే దానిపై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని నివేదించబడింది.