ఈవీఎంలపై మరోసారి సుప్రీంకోర్టుకు ‘ఇండి’ కూటమి
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో నిర్ణయం
By : 491
Update: 2024-12-11 06:11 GMT
ఈవీఎంల పై మరోసారి అనుమానం వ్యక్తం చేస్తూ ఇండి కూటమి పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమైంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ ఘోర పరాజయం ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశాయి. ఎన్సీపీ ఒకప్పటి అధినేత శరద్ పవార్ దీనిపై ఎక్స్ వేదికగా విమర్శలు చేయగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై కౌంటర్ ఇచ్చారు. తరువాత నాందేడ్ జిల్లా యంత్రాంగం, ఎన్నికల సంఘం, వివిధ పార్టీల అభ్యర్థులు కలిసి నిర్వహించిన తనిఖీలో ఈవీఎంతో, వీవీప్యాట్లు సరిపోలినట్లు ప్రకటించింది.
అయినప్పటికీ సంతృప్తి చెందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ మధ్య నిన్న సాయంత్రం జరిగిన సమావేశంలో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.
మహారాష్ట్రలో ఎన్‌సిపితో సహా ప్రతిపక్షాలు అవమానకరమైన ఓటమిని చవిచూసిన తరువాత ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున కొంత ముందస్తు ప్రణాళిక అవసరమని వారు భావించిన తరువాత ఈ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు.
ఢిల్లీలో గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో AAP విజయం సాధించింది. కానీ ఈ సారి కేజ్రీవాల్ కు విజయం నల్లేరుమీద నడక కాదని తెలిసింది. అవినీతి కేసులో పీకల్లోతులో కూరుకుపోవడం, ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకత, బీజీపీ దూకుడుతో ఢిల్లీ అధికార పార్టీ లో దడపుట్టింది.
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే విషయాన్ని ఎన్సీపీ( శరద్ పవార్) నేత ప్రశాంత జగ్తాప్ వెల్లడించారు. పూణెలోని హడప్సర్ స్థానం నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. పోలింగ్ కు మూడు రోజుల ముందు వరకు మహారాష్ట్రలో ఓటర్ల పేర్లను తొలగించి, కొత్త పేర్లు చేర్చారని సమావేశంలో జగ్తాప్ ఆరోపించారు. దీనికి సంబంధించిన డేటా కూడా తన వద్ద ఉందని జగ్తాప్ అన్నారు.
ఈవీఎంలను సమర్థించిన సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం..
ఇంతకుముందు కూడా ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంలను బ్యాన్ చేయాలని, బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అయితే సర్వోన్నత న్యాయస్థానం ఈ పిటిషన్ లను కొట్టివేస్తూ ఈవీఎంలకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇటీవల దాఖలైన ఓ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేస్తూ కూడా.. ‘‘ ప్రతిపక్షాలు గెలిచినప్పుడు ఈవీఎంలు బాగున్నాయి కానీ.. ఓడితే ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపిస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
"ఈవీఎంలు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. అవి నిమిషానికి నాలుగు ఓట్లకు ఓటు వేయడాన్ని పరిమితం చేయడం ద్వారా బూత్ క్యాప్చర్‌ను సమర్థవంతంగా తొలగించాయి. తద్వారా అవసరమైన సమయాన్ని పొడిగించాయి. తద్వారా బోగస్ ఓట్లను చొప్పించడాన్ని తనిఖీ చేస్తాయి" అని కోర్టు ఈ ఏడాది ప్రారంభంలో విచారణ సందర్భంగా పేర్కొంది.
అంతేకాకుండా, ఈవీఎంలు చెల్లని ఓట్లను కూడా తొలగించాయని, ఇవి పేపర్ బ్యాలెట్‌లతో ప్రధాన సమస్యగా ఉన్నాయని, కౌంటింగ్ ప్రక్రియలో తరచుగా వివాదాలకు దారితీస్తుందని కోర్టు పేర్కొంది.
ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) స్లిప్పుల తప్పనిసరి లెక్కింపులో ఎలాంటి వ్యత్యాసాలు కనిపించలేదని ఎన్నికల సంఘం మంగళవారం ధృవీకరించింది. ప్రతిపక్ష కూటమి MVA లేవనెత్తిన ట్యాంపరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటూ మొత్తం 288 నియోజకవర్గాల్లో ధృవీకరణ ప్రక్రియ జరిగింది.
అంచనాలు తారుమారు..
ఈవీఎంలు ప్రతిపక్ష ఇండి కూటమికి, ఎన్‌డీఏకు మధ్య తీవ్ర సమస్యగా మారాయి. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల ప్రక్రియను, ఈవీఎంలను తారుమారు చేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. హర్యానాలో జరిగిన ఎన్నికల్లో మొదటగా కాంగ్రెస్ లో లీడ్ లో కొనసాగి.. తరువాత అనుహ్యంగా వెనకబడింది. చివరకు బీజేపీకి 48 సీట్లు రాగా, కాంగ్రెస్ కు 37 సీట్లు మాత్రమే వచ్చాయి. వరుసగా మూడు సార్లు గ్రాండ్ ఓల్డ్ పార్టీ హర్యానాలో అధికారం కోల్పోయింది.
లోక్ సభలో అనూహ్యంగా సత్తా చాటిన కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సత్తా చతికిల పడింది. ఎగ్జిట్ పోల్స్ లో అక్కడ కాంగ్రెస్ కు ఆధిక్యం లభిస్తుందని చెప్పాయి. అలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంవీఏ, మహాయుతి మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని కూడా అంచనా వేశాయి.. కానీ ఫలితాల్లో ఆ కూటమి ఖంగుతింది.
మరాఠా అసెంబ్లీలో 288 సీట్లలో 235 స్థానాలను గెలుచుకుని, మహాయుతి భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చారు. కేవలం నాలుగు నెలల్లోనే పాలక కూటమి ఇన్ని సీట్లు ఎలా గెలుచుకున్నాయో అని ఉద్దవ్ ఠాక్రే అనుమానం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన జార్ఖండ్ లేదా జమ్మూ కాశ్మీర్‌లో ఈవీఎంల చట్టబద్ధతను ఇండి కూటమి ప్రశ్నించలేదని బీజేపీ విమర్శలు గుప్పించింది.