టిబెట్ లో భారీ భూకంపం, 53 మంది మృతి
నేపాల్, భారత్ లో ప్రకంపనాలు, ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు;
By : Praveen Chepyala
Update: 2025-01-07 11:41 GMT
టిబెట్ లో సంభవించిన భారీ భూకంపం కారణంగా 53 మంది ప్రజలు మరణించగా, 62 మంది గాయాలపాలయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8 గా నమోదయిందని చైనా మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి.
భూకంపం తరువాత కూడా పలుమార్లు భూమి కంపించింది. దీని తీవ్రతకు నేపాల్, భారత్ లోనూ కంపనాలు నమోదయ్యాయి. మన దేశంలోని బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్ లో ఈ ప్రభావం కనిపించింది. ముఖ్యంగా నేపాల్ లో తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
టిబెట్ లోని డింగ్రి కౌంటీలోని షిగేజ్ ప్రాంతంలో చైనా కాలమానం ప్రకారం ఉదయం 9.05 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు రీజినల్ డిజాస్టర్ రిలీఫ్ హెడ్ క్వార్టర్ కార్యాలయం పేర్కొంది. చనిపోయిన వారి వివరాలను చైనా లోని జిన్హువా న్యూస్ ప్రకటించింది. 53 మంది అధికారికంగా మృతి చెందినట్లు, 62 మంది గాయాలు పాలైనట్లు వెల్లడించింది.
6.8 కాదు.. 7. 1.. భారత్, అమెరికా కేంద్రాల ప్రకటన
టిబెట్ లో సంభవించిన భూకంపం పై అమెరికా, భారత్ సైతం స్పందించాయి. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ప్రకటించాయి. భూకంప కేంద్రం చైనాలోని షిజాంగ్ లోని టింగ్రి కౌంటీకి నార్త్ ఈస్ట్ లోకి 90 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొన్నాయి. ఇవి హిమాలయా ప్రాంతాలకు దగ్గర ఉందని వెల్లడించాయి. అయితే చైనా మాత్రం దీని తీవ్రతను తక్కువ చేసి చూపింది. భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రం ఉందని జిన్హువా న్యూస్ ఏజెన్సీ వార్తలు ప్రసారం చేసింది.
వణికిన ఖాట్మండ్
టిబెల్ లో భూకంపం సంభవించడంతో పొరుగున ఉన్న నేపాల్ భూమి కంపించింది. దాని తీవ్రత ఏకంగా నాలుగు జిల్లాలో కనిపించడంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ముఖ్యంగా కావ్రే పాలన్ చోక్, సింధూ పాలన్ చోక్, ధాడింగ్, సోలో కుంభూ జిల్లాలో ఈ ప్రభావం బాగా కనిపించింది. ఇళ్లతో పాటు కరెంట్ స్తంభాలు, వైర్లు కొద్ది సేపు పాటు కంపించాయి. దాదాపు ఆరుసార్లు భూమి వణికింది. ఈ తీవ్రత 5 కి పైగానే ఉంది. అన్ని కంపనాలు ఉదయం 7 ఏడు గంటల లోపు సంభవించాయి.
2015 నాటి దుర్ఘటన మరిచిపోని నేపాలీలు..
టిబెట్ భూకంప ప్రభావంతో నేపాల్ లో ఉదయం భూమి కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఉన్నవి ఉన్నట్లు వదిలి బయటకు పరుగులు తీశారు. 2015 నాటి దుర్ఘటన వారి కళ్ల ముందు మెదిలింది. ఆ రోజు భూకంప ప్రభావంతో దాదాపు 9 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే దేశంలో ఎలాంటి డ్యామేజీ జరిగినట్లు తమకు సమాచారం రాలేదని పోలీస్ స్పోక్ పర్సన్ మీడియాకు వెల్లడించారు.