చితికిన సిరియా భవిష్యత్తేమిటి?
దౌత్యవేత్తలు ఏమంటున్నారంటే...
By : Praveen Chepyala
Update: 2024-12-10 11:40 GMT
తిరుగుబాటుదారుల చేతికి చిక్కిన సిరియా, అరబ్, పశ్చిమాసియా పరిస్థితులపై భారతీయ మాజీ దౌత్యవేత్తలు స్పందించారు. కొంతకాలం ఈ ప్రాంతం అస్థిరంగా ఉండబోతుందని అంచనా వేశారు. ఆ దేశంలోని ప్రతిపక్ష శక్తులు కలిసి ఉంటూ అభివృద్ధికి తలుపులు తెరుస్తాయో లేదో వేచి చూడాలని, అప్పుడే అన్ని విషయాలు తేటతెల్లం అవుతాయని అన్నారు. 2011 లో సంభవించిన అరబ్ విప్లవం తరువాత ఏర్పడిన అన్ని ప్రభుత్వాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయనే విషయాన్ని వారు పరోక్షంగా ప్రస్తావించారు.
మత కలహాలు జరిగే అవకాశం'
అసద్ ప్రభుత్వం కూలిపోయాక దేశంలోని అనేక ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలబోయాయి. చాలా మంది అధికారులు ఇళ్లకే పరిమితం కావడంతో ఎక్కడిపనులు అక్కడ నిలిచిపోయాయి. అయితే తిరుగుబాటు దళాలు శాంతియుత, సమ్మిళిత రాజకీయ ప్రక్రియకు పిలుపునిచ్చాయి.
సిరియా పరిణామంపై మాజీ విదేశాంగ కార్యదర్శి అనిల్ వాధ్వా మాట్లాడుతూ.. ఇప్పుడు దేశంలో పరిస్థితులు సరిగా లేవని అభిప్రాయపడ్డారు. తిరుగుబాటు నాయకుడు అబూ మహ్మద్ అల్ జోలానీ తాను "మైనారిటీలను గౌరవిస్తాను" అని చెబుతూనే.. అందరూ ఒకే రకమైన మతాన్ని అవలంభించాలని షరతు విధించాడు. ఇది దేశంలో మత కలహాలకు దారి తీస్తుందని వధ్వా అంచనా వేశారు. ఇది కేవలం సిరియాపైనే కాకుండా మొత్తం ఆ ప్రాంతంపై ప్రభావం చూపుతాయని అన్నారు.
ముగింపు కాదు.. ప్రారంభమైంది..
"ఇది చాలా త్వరగా పరిష్కారమయ్యే విషయం అని నేను అనుకోను. ఆసక్తి ఉన్న సమూహాలు ఈ తిరుగుబాటుతో ప్రభావితమవుతాయి. మైనారిటీలు ప్రతిఘటించడం ప్రారంభిస్తారు. కాబట్టి, సిరియాలో ఈ కథ ముగింపు కాదు, ప్రారంభం" అని వాధ్వా జాతీయ మీడియాకు చెప్పారు.
యుఎస్‌ను ప్రస్తావిస్తూ.. అమెరికన్లు "చమురు క్షేత్రాలను నియంత్రించడంలో సంతోషంగా ఉన్నారు", కాబట్టి వారు తమ దళాలను అక్కడకు చేర్చారు. "కొంతకాలం ఇది అస్థిరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను," అని వధ్వా చెప్పారు.
అరబ్ రిపబ్లిక్ ఐక్యత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు అన్ని పార్టీలు కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూనే, సిరియాలో జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షిస్తున్నట్లు MEA తెలిపింది. ప్రస్తుతం అసద్ రష్యా చేరుకున్నట్లు వార్తలు ప్రసారం అయ్యాయి. తిరుగుబాటుదారులు డమాస్కస్ చేరుకోవడానికి కొన్ని గంటల ముందే ఆయన విమానం టేకాఫ్ అయినట్లు తెలుస్తోంది.
అసద్ ప్రభుత్వం కుప్పకూలడం పై పశ్చిమ దేశాలు సంతోషం వ్యక్తం చేశాయి. 50 సంవత్సరాల తరువాత సిరియా ప్రజలకు స్వాత్రంత్య్రం లభించినట్లు అవి ఓ ప్రకటనలో తెలిపాయి.