కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ విద్యార్థుల నివాళులు ఎందుకంటే..
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు ఎన్నికల సంఘానికి సంతాప సభ నిర్వహించారు. ముస్లిం మైనారిటీలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించలేదనే..
ముస్లిం మైనారిటీలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ వినూత్న నిరసన తెలిపారు ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులు. అనవసరమైన వాటికి స్పందించే సీఈసీ దీనిపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అదే యూనివర్శిటీలోని ఓ స్మారక స్థూపం వద్ద ఓ నోటీసు పెట్టి కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్లకు సంతాపం ప్రకటించారు. ఇప్పుడీ విషయం దేశవ్యాప్తంగా వివాదాన్ని సృష్టించింది.
ఇదీ విషయం..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తులు లాక్కుంటారని.. తాళి బొట్లు గుంజుకుంటారని.. సంపదను ముస్లింలకు పంచుతారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. వాటిని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని, కేంద్ర ఎన్నికల సంఘం మోదీపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పాంచ్‌న్యాయ్‌లో భాగంగా చేపడతామన్న కులగణన బీజేపీకి రుచించ లేదు. హిందువుల ఆస్తులు లాక్కుని ముస్లింలకు పంచుతారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఓ ఎన్నికల సభలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మినహా చాలా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అయినా పట్టించుకోలేదు. ఢిల్లీ పోలీసు కమిషనర్ కి స్వయంగా సీపీఎం నేతలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తూ ఢిల్లీ యూనివర్శిటీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థులు నిరసన తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరినా ఎటువంటి కదలిక లేదు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులు వినూత్నం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాళ్లు ఆ స్థూపానికి ఏమని నోటీసు పెట్టారంటే... స్వతంత్రంగా వ్యవహరించిన కేంద్ర ఎన్నికల సంఘం పదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇప్పుడు ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆస్పత్రిలో చేరి ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈనెల 21న అంటే (21 ఏప్రిల్ 2024)న మరణించింది. ఈ విషయాన్ని తెలియజేయడానికి మేము చింతిస్తున్నాం.. అని రాసిపెట్టారు.
ఈ నోటీసు కింద కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఫోటోను అంటించారు. ఆ ఫోటోలో ముగ్గురు కమిషనర్లు ఉన్నారు. ఆ ఫోటోకు దండ వేసి నివాళులు అర్పించారు. రెస్ట్ ఇన్ పీస్ ఆఫ్ డెమెక్రసీ, ఈసీఐ, ఫెయిర్ ఎలక్షన్ అని కింద రాశారు. ప్రస్తుతం ఈ చిత్రం ఢిల్లీలో వైరల్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ పని చేసింది ఎవరనే దానిపై ఆరా తీస్తూ హాస్టళ్లను తనికీ చేస్తున్నారు. అనుమానితులను పట్టుకుని విచారిస్తున్నారు. హాస్టళ్లను ఖాళీ చేయించే ఆలోచన చేస్తున్నారు. విద్యార్థులకు మద్దతుగా కొన్ని రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. ఈ వివాదం ఎన్నికల నాటికి ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.