ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమీర్ ఖాన్.. ఎందుకంటే..

ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినట్లు వైరల్ అవుతున్న వీడియో పై ఆమీర్ ఖాన్ కార్యాలయం స్పందించింది. దీనిపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు..

Update: 2024-04-18 08:23 GMT

సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్ది ప్రయోజనాలతో పాటు తలనొప్పులు కూడా అధికమవుతున్నాయి. ముఖ్యంగా డీప్ ఫేక్ సాంకేతికత ప్రముఖులపై అనవసర వివాదాలు సృష్టిస్తోంది. తాజాగా బాలీవుడు మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమీర్ ఖాన్ కాంగ్రెస్ పార్టీని సపోర్టు చేస్తున్నట్లు ఉన్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

మొదట అది ఎప్పటిదో పాత వీడియో అంటూ వార్తలు వచ్చాయి. కానీ అసలు విషయం ఏంటంటే అది డీప్ ఫేక్ వీడియో అని తేలింది. దీని తాజాగా ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. " డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించి పేరు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం" అని ముంబై పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 419 , 420 (మోసం), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు అయినట్లు తెలిసింది. ఆమీర్ ఖాన్ కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబైలోని ఖార్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించి సవరించినట్లుగా భావించే 27-సెకన్ల క్లిప్‌లో, ఆమీర్ ఓ పార్టీ గురించి మాట్లాడటం ఉంది. వివాదాస్పద డీప్‌ఫేక్ వీడియో దశాబ్దం నాటి టెలివిజన్ షో 'సత్యమేవ్ జయతే' ఎపిసోడ్‌లోని సన్నివేశాన్నిఈ వీడియోలో ఉపయోగించుకుంది.
ఆమీర్ ఖాన్ గతంలో ఎన్నికల కమిషన్ ప్రచారాల ద్వారా ఓటర్లకు అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించారు. అతను ఏ రాజకీయ పార్టీని ప్రోత్సహించలేదని ఆయన ప్రతినిధి మంగళవారం మీడియాకు చెప్పారు.
" అమీర్ ఖాన్ తన 35 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీని సపొర్టు చేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. గత ఎన్నికలలో.. ఎన్నికల కమిషన్ ప్రజా చైతన్య ప్రచారాల ద్వారా అవగాహన పెంచడానికి ఆమీర్ ఖాన్ ను సంప్రదించింది. అవి కేవలం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించినవి. వాటిలో కూడా ఏ పార్టీని సపోర్టు చేయలేదు" అని ఖాన్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
"అమీర్ ఖాన్ ఫలానా రాజకీయ పార్టీని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల వైరల్ అవుతున్న వీడియోతో మేము ఆందోళన చెందాం. ఇది ఫేక్ వీడియో, పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేయాలనుకుంటున్నారు. అందుకే కేసు ఫైల్ చేసి విచారణ జరపాలని పోలీసులను కోరాము” అని ఖాన్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
Tags:    

Similar News