వైఫల్య సంస్కర్తగా మిగిలిపోయిన భట్టాచార్య

వామపక్షాలలోని ఒక వర్గం నాయకులు భట్టాచార్య పారిశ్రామిక విధానాలను ఆయన పదవీకాలం అంతా విమర్శిస్తూనే వచ్చారు.

Update: 2024-08-08 11:10 GMT

పశ్చిమ బెంగాల్ చివరి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు ఉదయం తన నివాసంలో తుది శ్వాస విడిచారు. భట్టాచార్య 2000-2011 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు భార్య, కుమారుడు సుచేతన్‌ ఉన్నారు.

పారిశ్రామిక అనుకూల విధానాలు..

వృద్ధాప్యంలో ఉన్న జ్యోతి బసు నుంచి 2000లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పారిశ్రామిక అనుకూల విధానాలకు తలుపులు తెరిచారు. మార్క్సిస్ట్ సిద్ధాంతాలను పక్కన పెట్టారు.

"నా వైఖరి చాలా స్పష్టం. ఇది పెట్టుబడిదారీ విధానం. నేను దేశంలోని ఒక ప్రాంతంలో సోషలిజాన్ని నిర్మించలేను. సిద్ధాంతపరంగా వారు (వామపక్ష విమర్శకులు) ఈ మాటలను అంగీకరించలేరు.’’ అని 2007 లో ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

2000-2011 మధ్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెట్టుబడులకు రాష్ట్రం కేంద్రంగా మారింది.

2003లో రాష్ట్రం ఐటీ పాలసీని రూపొందించిన రెండేళ్లలోనే 70 శాతం వృద్ధిని నమోదు చేసింది.పెట్టుబడుల విషయంలో గుజరాత్ తర్వాత పశ్చిమ బెంగాల్ రెండవ స్థానంలో నిలిపారు. జపాన్‌కు చెందిన మిత్సుబిషి కెమికల్స్ కార్పొరేషన్, ఇండోనేషియాకు చెందిన సలీమ్ గ్రూప్స్ ..దేశంలోని ఐటీ, సేవా రంగాలు,కార్లు, ఉక్కు తయారీ పరిశ్రమ దిగ్గజాలతో చేతులు కలిపాయి.

జ్యోతిబసు వారసుడిగా భట్టాచార్య పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే ఈ మార్పు సాధ్యమైంది. 2000 డిసెంబరులో జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో CPI (M) అప్పటి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి అనిల్ బిస్వాస్ .. త్యాగాలకు సిద్ధం కావాలని కార్మికులను కోరారు. మిలిటెంట్ ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలకు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అదే సమావేశంలో భట్టాచార్య ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాలకు వ్యతిరేకంగా అప్పటి సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో బి శివరామన్, ఎస్‌యుసిఐ నాయకుడు ప్రోవాస్ ఘోష్ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. వామపక్షాలలోని ఒక వర్గం నాయకులు భట్టాచార్య పారిశ్రామిక విధానాలను ఆయన పదవీకాలం అంతా విమర్శిస్తూనే వచ్చారు.

అజీమ్ ప్రశంశ..

రాష్ట్రంలో 17 ఎకరాల్లో మొదటి ఐటీ క్యాంపస్ ను ఏర్పాటు చేసిన విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ మార్క్సిస్ట్ నాయకుడిని దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా కొనియాడారు. దేశంలో పారిశ్రామిక ప్రగతి కలకత్తా నుంచి మొదలవుతుందని మరో ఐటి కెప్టెన్ టివి మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు.

సహచరులతో విభేధించిన భట్టాచార్య ..

జనవరి 22, 2002న కోల్‌కతాలోని అమెరికన్ సెంటర్‌పై తీవ్రవాదులు దాడి చేసిన తర్వాత..పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అనధికార మదర్సాల వల్ల ఎదురవుతున్న భద్రతాపర బెదిరింపులకు వ్యతిరేకంగా భట్టాచార్య గళం విప్పారు. కొన్ని మదర్సాలు "దేశ వ్యతిరేక" కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని, రాష్ట్రం వద్ద సాక్ష్యాలు ఉన్నాయని కూడా చెప్పారు.ఈ వ్యాఖ్యలు భట్టాచార్జీ సహచరులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వారితో సహవాసాన్ని దూరం చేశాయి.

2006లో సిక్కింలోని భారత్ చైనా సరిహద్దులోని నాథులా మార్గాన్ని వ్యాపార అవసరాల కోసం తెరవాలన్న చైనీయులు డిమాండ్ కు భారత్ అంగీకారం తెలిపింది. ఆ సందర్భంలో ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని ఆహ్వానం అందినా ఆయన హాజరు కాలేదు. ఆ కార్యక్రమానికి ఏ మంత్రిని కూడా పంపలేదు.

వివాదాలకు కేంద్రంగా..

మృదుస్వభావి అయిన భట్టాచార్య 1990 ప్రారంభంలో తన గురువు జ్యోతిబసుతో కత్తులు దూశారు. పాలనలో అవినీతికి పాల్పడ్డారన్న కారణంతో భట్టాచార్జీ మంత్రివర్గం నుంచి వైదొలిగారు. అలా నిష్క్రమించిన రెండు నెలల్లోనే మంత్రివర్గంలోకి ఆయనను మళ్లీ తీసుకున్న ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదో అర్థమవుతోంది.

సమాచార, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా ఉన్నపుడు.. రైటర్స్ బిల్డింగ్‌లోని ప్రెస్ కార్నర్‌ను కూల్చివేసి, సెక్రటేరియట్‌లోకి జర్నలిస్టులు రాకుండా చేశారు. 1987 నుంచి 1996 మధ్య కాలంలో సమాచార, సాంస్కృతిక మంత్రిగా 1996 నుంచి నవంబర్ 2000 వరకు హోం వ్యవహారాల మంత్రిగా కూడా భట్టాచార్య పనిచేశాడు.

కవి, నాటక రచయితగా..

నెరిసిన బొచ్చు, కళ్లద్దాలు ధరించిన భట్టాచార్యకి కళలంటే మక్కువ. సంస్కృతి పట్ల అభిరుచి ఎక్కువ. తన అభిమాన రచయిత కొలంబియన్ నవలా రచయిత గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్. ఆయన అనేక రచనలను భట్టాచార్య బెంగాలీలోకి అనువదించారు కూడా. బెంగాల్, దేశంలోని సమకాలీన రాజకీయాలు, అంతర్జాతీయ సమస్యలపై భట్టాచార్జీ స్వయంగా అనేక పద్యాలు, పదికి పైగా నాన్ ఫిక్షన్స్ రాశారు. అతని చివరి పుస్తకం నాజీ జర్మనీ ఆర్ జోన్మో ఓ మృత్యు (ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నాజీ జర్మనీ) 2018లో ప్రచురితమైంది. బెంగాల్‌లో పారిశ్రామికాభివృద్ధి గురించి కూడా రాయాలనుకున్నారు. కాని ఆ కళ నెరవెరలేదు.

వైఫల్య సంస్కర్తగా..

పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం అవసరమైన భూ సేకరణకు వ్యతిరేకంగా సింగూర్, నందిగ్రామ్‌లో భారీ ఉద్యమాలు నడిచాయి. ఇది చివరికి బెంగాల్‌లో కమ్యూనిస్ట్ శకం అంతం కావడానికి, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మమతా బెనర్జీ ఎదుగుదలకు దారితీసింది.

భట్టాచార్య ఎదుగుదల, పతనం దివంగత మిఖాయిల్ గోర్బచేవ్ రాజకీయ పంథాను ప్రతిబింబిస్తుంది. గోర్బచేవ్ సంస్కరణలు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నానికి దారితీశాయి.

Tags:    

Similar News