ట్రంప్ కోసం అక్రమ వలసదారులపై భారత్ కీలక నిర్ణయం
18 వేల మందిని తిరిగి తీసుకురావడానికి ఏర్పాట్లు,;
By : Praveen Chepyala
Update: 2025-01-22 07:46 GMT
అమెరికాలో కొత్తగా కొలువుదీరిన ట్రంప్ ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పడానికి భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న 18 వేల మంది పౌరులను వెనక్కి తీసుకోవడానికి న్యూఢిల్లీ సిద్ధమవుతోంది. యూఎస్ ప్రభుత్వం గుర్తించిన 18 వేలమందిని బహిష్కరించే ప్రక్రియను భారత ప్రభుత్వం ధృవీకరించి డిపోర్టేషన్ ప్రారంభిస్తుందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది.
అయితే అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులు సంఖ్య అంతకుమించి ఉంటుందని వారి సంఖ్య స్పష్టంగా తెలియదని వార్తా నివేదిక పేర్కొంది. వీరిలో ఎక్కువగా గుజరాత్, పంజాబ్ కు చెందిన వారే అధికంగా అని తెలుస్తోంది.
అక్రమాలు.. వ్యాపారం..
అనేక ఇతర దేశాల మాదిరిగానే, భారత్ కూడా ట్రంప్ పరిపాలనను శాంతింపజేయడానికి, వాణిజ్య బెదిరింపులను తప్పించుకోవడానికి తెరవెనక ప్రయత్నాలు చేస్తోందని అని బ్లూమ్ బెర్గ్ నివేదిక వెలువరించింది.
భారత్ ఇలా అక్రమ వలసదారులను వెనక్కి తీసుకుంటే యూఎస్ లోకి ప్రవేశించే చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ మార్గాలైన స్టూడెంట్ వీసాలు, నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం హెచ్ వన్ బీ ప్రొగ్రామ్ లను ట్రంప్ పరిపాలన కాపాడుతుందని భారత్ భావిస్తోంది. అమెరికా అందించిన అధికారిక డేటా ప్రకారం.. 2023 లో మంజూరైన 3,86, 000 వేల హెచ్ వన్ బీ వీసాలలో దాదాపు మూడువంతుల మంది భారతీయ పౌరులే ఉన్నారు.
అధికారికంగా స్పందించారా?
భారత్ - అమెరికా సహాకారంలో భాగంగా అక్రమ వలసలను అరికట్టేందుకు ఇరుపక్షాలు ఈ ప్రక్రియలలో నిమగ్నమై ఉన్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. దేశం నుంచి యూఎస్ కి చట్టపరమైన వలసలకు మరిన్ని మార్గాలను సృష్టించడానికి ఇది జరుగుతుందని ఆయన చెప్పారు. అయితే 2024 లో యూఎస్ సరిహద్దులు అక్రమంగా క్రాస్ చేసిన వారిలో భారతీయులు కేవలం 3 శాతం మాత్రమే ఉన్నారని డేటా పేర్కొంది.
పెరుగుతున్న భారతీయ అక్రమ వలసదారులు..
అయితే ఇటీవల కాలంలో భారత్ నుంచి అక్రమంగా అమెరికా కు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇందులో ఎక్కువగా కెనడా బార్డర్ ను వాడుకుంటున్నారు. లండన్ లోని కింగ్స్ కాలేజ్ లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ అయిన హర్ష్ పంత్ బ్లూమ్ బెర్గ్ తో మాట్లాడానికి అక్రమ వలసలు ట్రంప్ పరిపాలనకు న్యూఢిల్లీ ఒక మార్గం చూపిస్తుందని చెప్పారు. గత ఏడాది అక్టోబర్ లో అమెరికా నుంచి వచ్చిన విమానం 100 మందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది.
ఖలిస్తాన్ మద్ధతుదారులా?
అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయుల్లో కొందరు ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతుదారులు కావచ్చని నివేదిక పేర్కొంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూఢిల్లీ అధిక దిగుమతి పన్నులు అమెరికన్ వ్యాపారాలను దెబ్బతీశాయని, భారతీయ వస్తువులపై పరస్పర సుంకాలు విధిస్తున్నాయని పదేపదే ఫిర్యాదు చేశారు.