Air VISTARA- ఈ రాత్రితో ముగిసిపోనున్న ఎయిర్ 'విస్తారా' చరిత్ర!
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా (VISTARA) కథ నవంబర్ 11వ తేదీ అర్థరాత్రితో ముగుస్తుంది. 2015 జనవరిలో ప్రారంభమైన ఎయిర్ విస్తారా పేరు చరిత్రకెక్కనుంది.
By : The Federal
Update: 2024-11-11 15:32 GMT
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా (VISTARA) కథ నవంబర్ 11వ తేదీ అర్థరాత్రితో ముగుస్తుంది. 2015 జనవరిలో ప్రారంభమైన ఎయిర్ విస్తారా పేరు చరిత్రకెక్కనుంది. సరసమైన ధరలకు ప్రయాణీకులను మాత్రమే తీసుకువెళ్లేలా వెలిసిన ఈ సంస్థ పేరు ఇక మాసిపోనుంది. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త వెంచర్ ఇది. ఈ విమానయాన సంస్థ పుట్టినపుడు ఎందరెందరో ప్రశంసలను అందుకుంది. సరికొత్త ఆశలు, ఆకాంక్షలు, కలలను మోసుకొచ్చింది. శ్రేష్ఠతకు మారుపేరుగా నిలిచింది. ఇలాంటి సంస్థ మరొకటి రాదేమోనన్నట్టుగా గత పదేళ్లు కొనసాగింది.
ఇండియన్ ఏవియేషన్ లో టాటాలకు విశిష్ట స్థానం ఉంది. జేఆర్డీ టాటా మార్గదర్శక సూత్రాలు, దూరదృష్టికి వారసత్వంగా నిలిచిన విస్తారా... టాటా గ్రూప్ కే చెందిన ఎయిర్ ఇండియాలో (AIR INDIA) విలీనం అవుతుంది. నవంబర్ 12 నుంచి ఈ విలీనం అమల్లోకి రానుంది. విస్తారా చివరి సర్వీసుగా నవంబర్ 11వ తేదీ రాత్రి ఒక డొమెస్టిక్, ఒక ఇంటర్నేషనల్ విమాన సర్వీసును నడుపనుంది. దీంతో విస్తారా చరిత్ర ముగిసిపోతుంది.
ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా -భారతీయ ఆతిథ్య వెచ్చదనాన్ని- అంతర్జాతీయ విమానయాన ప్రయాణీకులకు అందించిన ఘనత విస్తారా కి ఉంది.
భారతీయ గగన యాన చరిత్రలో విస్తారా ఓ ఆకాంక్షకు చిహ్నం అంటున్నారు ఆ సంస్థ ఉద్యోగులు. ఆ సంస్థతో తమ అనుబంధం- వర్షపు రోజున తాజాగా తయారు చేసిన చాయ్ సువాసన మాదిరిగా విభిన్నంగా, గొప్పగా ఉంటుందని చెబుతున్నారు. మహారాజా స్టైల్లో విమాన ప్రయాణీకులకు స్వాగతం పలకడం కూడా ఈ సర్వీసు ప్రత్యేకత.
విస్తారాకు చెందిన యూకే 986 విమానం నవంబర్ 11వ తేదీ రాత్రి 10.50 గంటలకు ముంబయి నుంచి ఢిల్లీకి వెళ్లే సర్వీసు చివరిది. దీంతో పాటు ఢిల్లీ నుంచి సింగపూర్‌కు వెళ్లే యూకే 115 చివరి సర్వీసు. నవంబర్ 12 నుంచి ‘యూకే’ అనే కోడ్ ఉండదు. ఆ స్థానంలో ఏఐ2XXXX పేరుతో కొత్త కోడ్ రానుంది.
51 శాతం టాటా గ్రూప్, 49 శాతం సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలగలిసి విస్తారా ఏర్పాటైంది. 2015లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ సంస్థ టాటా గ్రూపునకే చెందిన ఎయిర్ ఇండియాతో విలీనం కానుంది. విమానాలు, ఉద్యోగులు, రూట్స్ అన్నీ ఎయిర్ ఇండియాలో భాగమవుతాయి. అనంతరం సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థకు 25.1 శాతం వాటా ఉండబోతోంది. ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనం తరవాత మరో రూ.3,195 కోట్లను సింగపూర్ ఎయిర్‌లైన్స్ పెట్టుబడిగా పెట్టనుంది.