'పొన్‌మాన్' సినిమా రివ్యూ

మరో ఇంట్రస్టింగ్ మళయాళీ కథనం;

Update: 2025-04-04 06:26 GMT

ఓటీటీల పుణ్యమా అని తెలుగువారికి కూడా సుపరిచితుడు అయిపోయాడు మళయాళ నటుడు బసిల్ జోసెఫ్. వరసపెట్టి ‘జయ జయ జయ జయహే’, ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’, ‘సూక్ష్మదర్శిని’ వంటి చిత్రాలతో ఓటీటీలో హిట్ కొట్టాడు. ఫన్, సహజత్వంతో కూడిన ఇతని సినిమాలు మనవాళ్లను బాగానే ఆకట్టుకుంటున్నాయి. తాజాగా 'పొన్‌మాన్' సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా మళయాళంలో చిన్న సినిమాగా వచ్చి పెద్దగా వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు ఓటీటీలో నూ బాగా చూస్తున్నారు. ఇంతకీ ఈ చిత్రం కథేంటి,సినిమా హైలెట్స్ ఏమిటో చూద్దాం.

స్టోరీ లైన్

గోల్డ్‌ జ్యువెలరీ సేల్స్‌ ఏజెంట్ పీపీ అజేశ్‌ (బసిల్‌ జోసెఫ్‌) రెగ్యలర్ సేల్స్ మ్యాన్ కాదు.పెళ్లికూతురి కుటుంబం అవసరం మేరకు నగలు ఇచ్చి, వాటికి సరిపడా డబ్బును కట్న కానుకలు, చదివింపుల రూపంలో వచ్చిన వాటితో జమ చేసుకొని వెళ్లిపోతుంటారు. ఇదంతా ఓ అగ్రిమెంట్ తో ముందుకు వెళ్తుంటాడు. మాగ్జిమం పెళ్లి వారి దగ్గర డబ్బు వసూలు చేయడంలో సక్సెస్ అవుతూంటాడు.

అలా లో మిడిల్ క్లాస్ కు చెందిన స్టెఫీ (లిజోమోల్‌ జోసే) పెళ్లికి 25 సవర్ల బంగారం నగలు తెచ్చి ఇస్తాడు. ముందుగా అనుకున్నట్లుగానే పెళ్లి పూర్తయ్యాక వచ్చిన కానుకలు లెక్కేస్తే ఇచ్చిన బంగారం వాల్యూ లో సగం కూడా రావు. అప్పుడు చదివింపుల మేరకు డబ్బు మినహాయించుకుని మిగిలిన నగలు ఇవ్వాలని అడుగుతాడు. శోభనం రాత్రి పూర్తయ్యాక ఇస్తామంటారు. తెల్లారేసరికి పెళ్లి కొడుకు తన కొత్త పెళ్ళాన్ని తీసుకుని ఉదయాన్నే వెళ్లిపోతాడు. ఇది ఊహించని అజేశ్ వారి వెంటపడతాడు. ఆమె అత్తారింటికి సైతం వెళ్ళాడు.

రొయ్యల చెరువులో పనిచేసే స్టెఫీ భర్త మరియానో (సాజిన్‌ గోపు) చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అతని నుంచి నగలు రాబట్టి వెనక్కి రావడం కష్టమనే అందరూ బెదిరిస్తారు. కానీ అజేశ్ భయపడడు. ఆ ఊళ్లోనే మకాం వేస్తాడు. అజేశ్‌ ఆ నగలను ఎలా తిరిగి రాబట్టాడు? స్టెఫీ భర్త మరియానో నుంచి ఎలాంటి ట్విస్ట్ లు ఎదురయ్యాయి? చివరికి ఏమైంది అనేది చిత్ర కథ.

విశ్లేషణ

జి.ఆర్. ఇందుగోపన్ నవల 'నాలన్చు చెరువుక్కర్' ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ జ్యోతిష్ శంకర్ తొలిసారి మెగా ఫోన్ పట్టి డైరెక్ట్ చేసారు. ఈ సినిమా పైకి బంగారు నగలు వసూలు చుట్టూ తిరిగిన, కథలో ప్రధాన యాంగిల్ వరకట్నం. తమ కుమార్తెల వివాహాల కోసం భారీగా అప్పులు చేయవలసి వచ్చే కుటుంబాల దుస్థితి కథలో అంతర్గత సమస్యే . అయినా అటువైపు నుండి కాకుండా వివాహ సమయంలో ఓ కుటుంబానికి నగలు ఇచ్చి, బహుమతిగా ఇచ్చిన డబ్బును సేకరించే ఏజెంట్ దృక్కోణం నుండి ఈ చిత్రాన్ని నడిపించారు.

ఇది చాలా ప్రత్యేకమైన పాత్ర. అజేష్ (బాసిల్ జోసెఫ్)లో నటుడుని మరోసారి బయటకు తగ్గడానికి రాసినట్లు ఉంటుందా పాత్ర. కథ చివర్లో మనం అతన్ని బాగా తెలుసుకునే వరకు దానిలో కఠినమైన వాడిగా కనిపిస్తాడు.కొత్త తరహా పాత్ర, కాంప్లికేట్ తో ఇంట్రెస్టింగ్ గా నడిపారు. అయితే అనుకున్న స్థాయిలో అయితే సినిమాలో ఫన్ లేదు.

బాసిల్ జోసెఫ్ అనగానే మనం కామెడీ ఆశిస్తాం. అది బాగా తక్కువ ఉంది. అయితే క్లైమాక్స్ దాకా ఇంట్రెస్టింగ్ గా నడిపారు. తన నగలు తిరిగి వసూలు చేసేందుకు అజేశ్‌ వేసే ప్లాన్‌, మారియానో చేతిలో నుంచే వాటిని తీసుకునే సన్నివేశాలు ఉత్కంఠతో సాగుతూనే చివరి వరకు ఎంటర్టైన్మెంట్ ని పంచుతాయి. ఆఖరులో అజేశ్‌, స్టెఫీల మధ్య ఒక ఆహ్లాదకరమైన సీన్ తో ఇచ్చిన ముగింపు బాగుంది.

ఎవరెలా చేశారు.

ఈ సినిమాలో అజేశ్‌గా బాసిల్ జోసెఫ్ నటన బాగుంది. నిజాయితీ కలిగిన వ్యక్తిగా, కష్టాలు ఎదురైనప్పుడు తెలివి తేటలు, ధైర్యం కలగలిసిన వ్యక్తి పాత్రలో ఒదిగిపోయారు. నూటికి నూరుపాళ్లూ న్యాయం చేశాడు. సిన్సియ‌ర్ ఎఫెక్ట్ పెట్టాడు. స్టెఫీగా లిజోమోల్‌ జోసే, మారియానోగా సాజిన్‌, బ్రూనోగా ఆనంద్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ గానూ సినిమా బాగుంది. డైరెక్టర్ చాలా చోట్ల తెరపై చూస్తున్న సీన్ లైవ్ లో జరుగుతుందేమో అన్నంత ఫీల్ కలిగించాడు. కథలో ప్రేక్షకుడిని లీనం చేయడంలో దర్శకుడు చాలా చోట్ల మెప్పిస్తాడు. చిన్న సినిమా అయినా క్వాలిటీ విష‌యంలో రాజీ ప‌డ‌లేదు. వినిపించిన రెండు పాటలు బాగున్నాయి. సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ కథకి తగినట్టుగా సెట్టయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

చూడచ్చా

నిరభ్యంతరంగా ఫ్యామిలీతో కలిసి చూడచ్చు. నచ్చుతుంది.

ఎక్కడుంది.

జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉంది.

Tags:    

Similar News