'పెండ్యులం' మూవీ రివ్యూ!
ఈ సినిమా ఎలా ఉంది. చూడదగ్గదేనా వంటి విషయాలు చూద్దాం.;
మొదటి నుంచీ మలయాళ సినిమా ఇండస్ట్రీలో థ్రిల్లర్ జానర్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంట్రస్టింగ్ కథ,కథనం, రియలిస్టిక్ యాక్షన్, నిశ్శబ్దంగా ఏర్పడే సస్పెన్స్ లతో మలయాళ థ్రిల్లర్‌లు ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లపై భారీ విజయం సాధిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మలయాళ థ్రిల్లర్‌లపై భారీ ఆసక్తి చూపిస్తూ సరికొత్త కథలను ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి చిత్రాల్లో ఒకటి ‘పెండ్యులం’ (Pendulum). సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఇప్పుడు మన ముందుకు వచ్చింది, ఈ సినిమా ఎలా ఉంది. చూడదగ్గదేనా వంటి విషయాలు చూద్దాం.
పెండులమ్ కాన్సెప్టు ఏంటంటే?
ఈ కథ ఒక సాదాసీదా మామూలు మనిషి అసాధారణ కథ. పేరు మహేష్ నారాయణన్ (విజయ్ బాబు). అతనో డాక్టర్. తన కుటుంబంతో కలిసి ఓ ట్రిప్‌కి వెళ్తాడు. అక్కడ ఒక రాత్రి తర్వాత అంతా మారిపోతుంది .మరుసటి రోజు ఉదయాన్నే మహేశ్ రోడ్డుపక్కన పొదల్లో స్పృహలేకుండా పడిఉంటాడు. రాత్రి తనని ఓ లారీ ఢీ కొట్టిందని భార్య శ్వేతతో మహేశ్ చెబుతాడు. ఆ మాటలను ఆమె నమ్మదు కొట్టిపారేస్తుంది.
అయితే ఆ లారీ నెంబర్ కూడా తాను చూశానని మహేశ్ చెబుతాడు. ఆ తరువాత అందుకు సంబంధించిన ఎంక్వైరీ చేస్తే, 15 ఏళ్ల క్రితమే ఆ లారీని డిస్పోజ్ చేశారని తెలిసి షాక్ అవుతాడు. తను ఎప్పుడూ చూడని కొన్ని ప్రదేశాలు ఇంతకుముందే చూసినట్టుగా ఎందుకు అనిపిస్తున్నాయి?
15 ఏళ్ల క్రితమే డిస్పోజ్ చేయబడిన లారీ, తనని ఎలా ఢీకొట్టింది? అనే విషయం మహేశ్ కి అర్థం కాదు. అయితే అదంతా వేరే వారి కలల్లోకి వెళ్లటం వల్ల వచ్చిందని తెలుస్తుంది. అలా వేరే వారి కలల్లోకి వెళ్లటం ఏమిటి, అసలేం జరిగింది, అలా ఎలా జరిగింది అనే విషయం చుట్టూ మిగతా కథ, కథనం జరుగుతుంది.
విశ్లేషణ
"Dreams are not just stories we see at night... Sometimes, they are keys to someone else's locked memories."
"మీరు కలగంటున్నారా... లేక కలే మిమ్మల్ని కలుగంటుందా?" అనే గమ్మత్తైన ప్రశ్నని Pendulum అనే ఈ మలయాళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వేస్తుంది. వాస్తవం – కలల మధ్య చుట్టే గడియారాలా సాగే కథ. ఇది సైకాలజీ, ఎమోషన్స్, ఫ్యామిలీ డైమెన్షన్, మెమొరీ, టైం అన్నీ మిక్స్ అయిన ఒక అనుభూతి – ఒక సైకలాజికల్ మ్యాజిక్ ట్రిప్.
సాధారణంగా హై-కాన్సెప్ట్ సినిమాల విషయంలో, మనల్ని ఆకట్టుకునేది అసలు దాని విజువల్ అద్భుతాలకంటే స్టోరీ టెల్లింగ్, కాన్సెప్ట్. రేజిన్ ఎస్ బాబు దర్శకత్వంలో రూపొందిన Pendulum చిత్రం, పూర్తిగా కొత్తదని చెప్పలేం. ఇది మనం ఇంతకు మునుపే చూచిన Dark, Inception, Edge of Tomorrow వంటి చిత్రాల కాన్సెప్ట్‌లను ఒకే చోట మేళవించినట్లు ఉంటుంది.
సినిమా మొదట ఎత్తుగడ లో కొంత భాగం తడబాటు తో సాగినప్పటికీ, దర్శకుడు రేజిన్ కథను చక్కగా, ఆకట్టుకునే విధంగా ఈ డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ ని మన ముందుకు తీసుకురావడంలో విజయం సాధించాడు.
ఇక ఫస్ట్ హాఫ్ ఎండ్ లో దర్శకుడు రేజిన్ "లూసిడ్ డ్రీమ్" అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తాడు. ఇది Time Travel కి సంబంధించిన ఐడియాతో కలుస్తుంది. ఇందులో నాకు ఆసక్తిగా అనిపించిన అంశం నటుడు ప్రకాశ్ బేరే పోషించిన పాత్ర ద్వారా లూసిడ్ డ్రీమింగ్ గురించి ఇచ్చిన వర్ణన.
ఈ కథలో డాక్టర్ మహేష్ ఎందుకు ఈ కలల్లోకి వచ్చాడు అనేది అర్థం చేసుకోవడంలో కొంత క్లిష్టత ఉంది. అయితే, ఈ ఫాంటసీ ప్రపంచంలో కాలాన్ని ఒక సరళరేఖ (linear) గా కాకుండా, యూనివర్స్ గా తీసుకుంటే, చాలా విషయాలు క్లియర్ గా అర్దమవుతాయి.
టెక్నికల్ గా చూస్తే...
ఈ సినిమా కు స్క్రీన్ ప్లే ఇంకాస్త అర్దమయ్యేలా రాసుకుని ఉండాల్సింది. అరుణ్ దామోదరన్ ఫొటోగ్రఫీ, జీన్ జాన్సన్ మ్యూజిక్, సూరజ్ ఎడిటింగ్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. తెలుగు డైలాగులు బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్ లు పెద్దగా వాడలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. ఆర్టిస్ట్ లు బాగా చేసారు.
ఫైనల్ థాట్
పెండుల్యం (Pendulum) సినిమా కాన్సెప్ట్ పరంగా సంపూర్ణంగా పరిపూర్ణమైన సినిమా కాదనేది నిజం. టైమ్ ట్రావెలింగ్, లూసిడ్ డ్రీమింగ్ వంటి కాన్సెప్ట్స్ ఆధారంగా ఇప్పటివరకు వచ్చిన ఎన్నో సినిమాలు, పుస్తకాల ద్వారా చర్చించబడిన ఆలోచనల నుండి ప్రేరణ పొందినట్లు అనిపిస్తుంది. అయితే ఇది వాటినుంచి కాపీ చేసినట్లు కనిపించదు. ఈ సినిమాలో పోటెన్షియల్ ఉంది, కానీ అది పూర్తిగా బయిటకు రాలేదనిపిస్తుంది. ఏదైమైనా కాన్సెప్ట్ గొప్పది, దాన్ని పూర్తిగా సామాన్య ప్రేక్షకుడికి అర్దమయ్యేటట్లు చెప్పలేకపోయారు.
చూడచ్చా
పజిల్ లాంటి ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ సినిమాల అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది
ఎక్కడుంది
ఈటీవీ విన్ ఓటిటి లో తెలుగులో ఈ సినిమా ఉంది