'ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్' (సోనీ లివ్) వెబ్ సిరీస్ రివ్యూ!

ఇంతకీ ఈ సీరిస్ ఎలా ఉంది. ఏయే విషయాలను ఈ సీరిస్ లో చర్చించారు. కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Update: 2024-11-29 11:44 GMT

హిస్టారికల్ ఫిక్షన్ సినిమాలు, సీరిస్ లు మనకు బాగా తక్కువ. వివాదాస్పదమవుతాయని వాటి జోలికి పోవడానికి ఇష్టపడరు. లేకపోతే ఇదే టైటిల్ తో చాలా ఏళ్ళ క్రితమే పుస్తకం వచ్చినప్పటికి ఇన్నేళ్ల దాకా సినీరంగం పట్టించుకోకపోవటం ఏమిటి...మొత్తానికి దర్శకుడు నిఖిల్ అద్వానీ ఈ ధైర్యం చేశారు. స్కామ్‌ 1992, స్కామ్ 2003,మహారాణి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సిరీస్‌ల‌ తర్వాత, సోనీ లివ్ లో అత్య‌ధిక వ్యూస్ ద‌క్కించుకున్న వెబ్‌సిరీస్‌గా ఫ్రీడ‌మ్ ఎట్ మిడ్‌నైట్ నిలిచింది. ఈ వెబ్‌సిరీస్ హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడీ సీరిస్ మన దేశ చరిత్రను తెలుసుకోవాలనుకునే వాళ్లందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఇంతకీ ఈ సీరిస్ ఎలా ఉంది. ఏయే విషయాలను ఈ సీరిస్ లో చర్చించారు. కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

మే 1946లో అంటే దేశ స్వాతంత్య్రానికి 15 నెలలు ముందు కథ మొదలవుతుంది. బ్రిటిష్ వారు వెళ్లిపోవడానికి రంగం సిద్దం అయ్యింది. అయితే ఇంకా ఏయే టెర్మ్స్ తో దేశాన్ని వదిలిపెడతారనే క్లారిటీ లేదు. అదే సమయంలో ముస్లింలీగ్ దేశాన్ని విడదీసి పాకిస్తాన్ ని వేరే దేశంగా ప్రకటించాలని పట్టుపడుతోంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో అప్పటి వైశ్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ దేశాన్ని విభజన చేసి ఇవ్వడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేస్తాడు. దాంతో పాకిస్తాన్ .. పశ్చిమ బెంగాల్ .. పంజాబ్ ప్రాంతాల విషయంలో చర్చలు జరుగుతూ ఉంటాయి.

అయితే భారతదేశం నుంచి ఏ ప్రాంతాన్ని విభజించడానికి కూడా తాము ఒప్పుకోమని మహాత్మా గాంధీ .. జవహర్ లాల్ నెహ్రూ .. సర్దార్ వల్లభాయ్ పటేల్ బలంగా చెబుతారు. కానీ మహమ్మద్ అలీ జిన్నా మాత్రం, ముస్లిమ్స్ కోసం ఒక ప్రత్యేకమైన దేశం కావాలనీ, పాకిస్థాన్ ను ప్రత్యేకమైన దేశంగా ప్రకటించవలసిందేనని తేల్చి చెబుతాడు. ఈ విషయంలో తాము అనుకున్నట్టుగా జరగకపోతే, ఆయుధాలు పట్టడానికి కూడా సిద్ధంగానే ఉన్నామని హెచ్చరిస్తాడు. ఆయన చేసిన మరికొన్ని వ్యాఖ్యల కారణంగా చాలా ప్రాంతాలలో అల్లర్లు మొదలవుతాయి. అప్పుడు గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం నిర్ణయం తీసుకున్నారు. నెహ్రూ ఆ నిర్ణయానికి సపోర్ట్ చేసారా, పాకిస్తాన్ విభజన వెనక జరిగిన రాజకీయ విషయాలు ఏమిటనేది ఈ సీరిస్ పూర్తిగా చూస్తే తెలుస్తుంది.

ఎలా ఉంది

సాధారణంగా స్వాతంత్య్ర కాలం నాటి విషయాలను ప్రస్తావించే సినిమాలు కానీ సీరిస్ లు కానీ స్వాతంత్య్ర ఉద్యమం కానీ, బ్రిటిష్ వారు పెట్టిన ఇబ్బందులు, త్యాగాలు వీటి చుట్టూనే ఉంటాయి. అయితే ఈ సీరిస్ వాటిని కంటెంట్ విషయంలో విభేదిస్తుంది. అప్పటి రాజకీయ పరిస్దితులు, ఆలోచనలును లోపలికి వెళ్లి చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. కొంత కల్పితం ఉన్నా సీరిస్ నిజం అనే ఆలోచనలను కలిగిస్తుంది. స్టీవెన్ స్పీల్ బర్గ్ చేసిన లింకన్ (2012) సినిమాని ఈ సీరిస్ కు మోడల్ గా పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. రాజకీయ ఆలోచనలను బోర్ కొట్టకుండా తెరకెక్కించడం మామూలు విషయం కాదు. స్వాతంత్య్ర స‌మ‌యంలో దేశంలో ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకున్నాయ‌న్న‌ది క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా ఈ వెబ్‌సిరీస్‌లో చూపించాల‌నే దర్శకుడు ప్రయత్నం చాలా వరకూ సక్సెస్ అనిపిస్తుంది.

ఈ సీరిస్ లో దేశ స్వాతంత్య్రం అనేది ప్రధానమైన కథాంశమే అయినా.. అసలు ఇండియాను ఎలా రెండు ముక్కలు చేసారు అనేదే ఈ సిరీస్‌లో మెయిన్ ప్లాట్. ఆ పాయింట్ చుట్టూనే కథ, కథనం తిరుగుతుంది. పాకిస్తాన్ విభజన కోసం జిన్నా చేసే ప్రతీ పనిని.. అతడి కుట్రలను ఎలా అడ్డుకోవాలని నెహ్రూ, పటేల్ పడిన తర్జన భర్జనలను ఈ సిరీస్ హైలెట్ చేస్తుంది. మధ్య మధ్యలో వచ్చే బ్రిటీషర్ల సీన్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ సీరిస్ చాలావరకూ ఎటు వైపు మొగ్గక..అప్పటి పరిస్థితులను ఉన్నదున్నట్లు చెప్పడానికి ట్రై చేసినట్లు అర్థమవుతుంది.

ఎవరెలా చేశారు

గాంధీజీగా చిరాగ్ వోరా .. నెహ్రూ గా సిద్ధాంత్ గుప్తా .. సర్దార్ వల్లభాయ్ పటేల్ గా రాజేంద్ర చావ్లా .. మహమ్మద్ అలీ జిన్నాగా ఆరిఫ్ జకారియా .. మౌంట్ బాటెన్ గా ల్యూక్ మెక్ గిబ్న అందరూ నటన పరంగా బాగా చేసారు కానీ లుక్ లే ఇంకాస్త జాగ్రత్త పడాల్సి ఉంది. టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. ప్రకాష్ సినిమాటోగ్రఫీ , అశుతోష్ పాఠక్ నేపథ్య సంగీతం, శ్వేత వెంకట్ ఎడిటింగ్ చాలా నీట్ గా ఉంది. కాకపోతే కాస్తంత స్లో గా ఉంది.

చూడచ్చా

దేశ భక్తి ఉన్నా లేకపోయినా దేశ విభజన ఎలా జరిగింది. అప్పటి పరిస్థితులు ఏమిటి..ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే విషయాలు తెలుసుకోవటానికైనా ఈ సీరిస్ చూడచ్చు.

ఎక్కడ చూడచ్చు

సోనీ లివ్‌ లో 7 ఎపిసోడ్స్ తో ఉన్న ఈ సీరిస్ తెలుగులో ఉంది

Tags:    

Similar News