విలేజ్ బ్యాక్‌డ్రాప్ 'ఆనందలహరి' సిరీస్ రివ్యూ!
తూర్పు – పడమర కలిసినప్పుడు...
ఈస్ట్ గోదావరి కుర్రాడు ఆనంద్ (అభిషేక్) సఖినేటిపల్లి సర్పంచ్ కొడుకు. బిటెక్‌లో ఫెయిల్ అయినా పాస్ అయ్యానని చెప్పే స్మార్ట్ లయర్. రోజంతా తాగి తిరుగుతూ, తన దారి తానే చూసుకునే అహంకారపు అబ్బాయి. అతనికి “పెళ్లి చేస్తే బాగుపడతాడు” అనేది తండ్రి చివరి ఆశ. అదే క్షణంలో లహరి (భ్రమరాంబ) అనే వెస్ట్ గోదావరి అమ్మాయి జీవితంలోకి అడుగుపెడుతుంది.
లహరి — క్రమశిక్షణలో పెరిగిన పశ్చిమ గోదావరి జిల్లా అమ్మాయి. కానీ లోపల మాత్రం నగరజీవితం, స్వతంత్రం, ఉద్యోగం అనే కలలతో నిండిపోయి ఉంటుంది. పెళ్లి అంటే అస్సలు ఇష్టం లేదు... కానీ ఒక అనుకోని సంఘటనతో తల్లి “ఇప్పుడే పెళ్లి” అని నిర్ణయించి ముందుకు వెళ్లి ఒప్పిస్తుంది.
దీంతో తూర్పు – పడమర జిల్లాల రెండు కుటుంబాలు ఒకటవుతాయి. ఆనంద్ – లహరి పెళ్లి కుదురుతుంది. లహరి ఎన్ని రకాలుగా ఆ పెళ్లిని చెడగొట్టాలనుకున్నా… విధి, కామెడీ, డ్రామా అన్నీ కలసి ఆమె ప్లాన్‌లను తారుమారు చేస్తాయి.
పెళ్లి తర్వాత అసలు కథ మొదలవుతుంది. హైదరాబాద్‌లో కొత్త జీవితం మొదలు. లహరి స్వేచ్ఛ కోరుకుంటుంది, తన కార్పొరేట్ కెరీర్ కోసం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు హాజరవుతుండగా, ఆనంద్ మాత్రం పని పాటా లేకుండా “ఇంటి దగ్గరే జీవితం” అంటాడు. ఇద్దరి మధ్య రోజూ తగాదాలు, మాటల యుద్ధాలు. అయినా ఆనంద్ తాగుతూ,బేవార్స్ గా బ్రతుకుతూ ఇంట్లోని వస్తువులు ఆన్ లైన్ లో అమ్మేస్తుంటాడు. ఆమె అతన్ని బెడ్ రూమ్ కి సైతం దూరం పెడుతుంది. అయినా మారడు.
దాంతో అతని తండ్రి డబ్బు ఇవ్వడం ఆపేస్తాడు — కానీ ఆ డబ్బులు లహరి చేతికి ఇస్తాడు. అక్కడి నుంచి మొదలవుతుంది కొత్త గేమ్.
డబ్బు కోసం భార్య చెప్పిన పనులు చేసే భర్త! అలా ఇద్దరి మధ్య దూరం పెరిగి, విడిపోవాలనే స్థితికి చేరుతుంది…అప్పుడు ఏమౌతుంది. చివరకు ఆనంద్ మారుతాడా? లేదా ఈ పెళ్లి ఒక "మిర్రర్ గేమ్"లా ముగుస్తుందా?
విశ్లేషణ
ఇది మన చుట్టూ రోజూవారీ జీవితంలో జరిగే చిన్నచిన్న జీవన క్షణాలని “స్లైస్-ఆఫ్-లైఫ్” కథగా చెప్పే ప్రయత్నం.ఇప్పటి యూత్ మనస్తత్వాలని ప్రతిబింబించేలా పాత్రలు రాసుకున్నారు. కుర్రాళ్లు బీరు తాగుతూ, ప్రేమలో తేలిపోతూ, ఏ దిశా లేకుండా జీవిస్తుంటే — అమ్మాయిలు కెరీర్, ప్రేమ, కుటుంబం మధ్య సమతౌల్యం కోసం ప్రయత్నిస్తారని అని తేల్చారు. రచయిత పెళ్లిని సోషల్ కంట్రాక్ట్ కంటే పర్సనల్ ఎవల్యూషన్ టెస్టుగా చూపించాలని ప్రయత్నించాడు.
కథ నిర్మాణం పరంగా “ఆనందలహరి” ఒక సింపుల్ two-worlds-collide narrative. ఈస్ట్ గోదావరి vs వెస్ట్ గోదావరి — భౌగోళిక వ్యత్యాసాన్ని న్యారేటివ్ యంత్రంగా ఉపయోగించడం మంచి డెసిషన్. అది సహజంగానే భాష, యాస, సంస్కృతి, ఆచారాలు, ప్రవర్తనా శైలిలో తేడాలు చూపడానికి ఉపకరిస్తుంది. కానీ స్క్రిప్ట్‌లో ఈ తేడాలు డ్రామాటిక్ పాయింట్స్‌గా మలచబడలేదు. అవి కేవలం సినిమాటిక్ టెక్స్చర్ లా మాత్రమే ఉపయోగమయ్యాయి. కంటెంట్ కు కావాల్సిన టెన్షన్ ఇవ్వలేకపోయాయి.
ఆనంద్ క్యారెక్టర్ ఆర్క్ “తాగుబోతు నుండి బాధ్యతగల వ్యక్తి” గా చూపాలనుకున్నారు, కానీ అది ఎమోషనల్ కర్వ్ల్ లా కాకుండా “సీన్ల సమాహారం” లా కనిపిస్తుంది, .
ఈ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్‌లుగా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త కాన్ఫ్లిక్ట్ తీసుకురావడం కంటే, ఉన్న సన్నివేశాలే పొడిగించబడ్డాయి. సీన్లలోని “లాగ్” వల్ల డ్రామాటిక్ పంచ్ తగ్గిపోయింది.
అలాగే ఈ సీరిస్ లో ఉన్న అతి పెద్ద ఇబ్బంది— హాస్యం పెద్దగా లేకపోవడం. సాధారణంగా ఈ జానర్‌లో గ్రామీణ నేపధ్యం ఉన్న రొమాంటిక్ కామెడీలకి సిట్యువేషనల్ హాస్యం ప్రాణం అనే విషయం మర్చిపోయారు.
ఫైనల్ థాట్
“ఆనందలహరి” ఒక మంచి కాన్సెప్ట్‌తో ప్రారంభమై, సగం దారిలో సినిమాటెక్ ఫార్ములాలో చిక్కుకుంది. గ్రామీణ అస్తిత్వం, ప్రాంతీయ ఐడెంటిటీ, స్వేచ్ఛ అనే మూడు పొరలు ఉన్నా, వాటిని కలిపి ఒక పసందైన డ్రామాగా తీర్చలేకపోయింది.
అయితే గోదావరి తీర ప్రాంతాల జీవన శైలిని, వారి ఆత్మాభిమానాన్ని, ఫ్లెక్సీలపై ఉన్న ప్రేమను ఈ షో అత్యంత నిజాయితీగా, లోపలినుండి చూసినవాడు మాత్రమే చూపగలిగేలా ఆవిష్కరించింది. కొన్నిసార్లు భాష కాస్త క్రూడ్‌గా, రఫ్‌గా అనిపించొచ్చు — కానీ అది పాత్రల సహజ స్వభావం వల్లే, ఆకర్షణ కోసం చేసిన ప్రయత్నం కాదని అర్దమవుతుంది. ప్రేమ, అహంకారం, హాస్యం, స్వేచ్ఛ… అన్నీ ఒకే గదిలో కలిసి బతికే కథ ఇది.
చూడచ్చా
సీరియస్ గా చెప్పాలంటే సీరిస్ కాదు — మన కాలం, మన సంబంధాల సత్యం! కాబట్టి ఓ లుక్కేయచ్చు. ఆశించిన స్దాయిలో కిక్కు ఇవ్వదు కానీ నిరాశపరచదు.
ఎక్కడ చూడచ్చు
ఆహా ఓటీటి లో తెలుగులో ఉంది