‘ఉత్తరం’ ఓటీటీ షార్ట్ స్టోరీ రివ్యూ

ఈ ఉత్తరం లఘు చిత్రం ఎలా ఉంది. అసలు ఈ చిత్రంలో ఏమి రాసారు, ఎవరికి రాసారో చూద్దాం.;

Update: 2025-04-11 11:30 GMT

ఉత్తరం కోసం ఎదురుచూడని మనిషి, ఇల్లు ఒక టైమ్ లో లేవు. దూరాన్న ఉన్న కొడుక్కి తండ్రి రాసిన ఉత్తరం ఎంతో అపురూపం. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చిన విషయాన్ని చెప్పే ఉత్తరం అమూల్యం. అలాగే ప్రేమలో ఉన్నవారికి మనసులో మాటని నోరువిప్పి చెప్పలేక కవితల కవ్వింతలతో రాసి ప్రేమ లేఖ ఉత్తరం అద్బుతం.

వేసవి వస్తే సెలవులకు పిల్లలతో కలిసి ఇంటికి రమ్మని పిలుస్తూ కూతురు, అల్లుడికి ఆప్యాయంగా రాసిన ఉత్తరం అర్జెంట్ అవసరం. మధ్య మధ్యలో లేఖ సాహిత్యం అనేది కూడా ఒక ప్రపంచం, అవన్నీ ఇప్పుడు కనుమరుగవడం బాధాకరం. మారుతున్న కాలంతోపాటే కాలగమనంలో కలిసి ఉత్తరాన్ని మళ్లీ గుర్తు చేస్తూ వచ్చింది ఓ చిన్న సినిమా లాంటి షార్ట్ ఫిల్మ్ “ఉత్తరం”. ఈటీవీ విన్ లో వచ్చిన ఈ ఉత్తరం లఘు చిత్రం ఎలా ఉంది. అసలు ఈ చిత్రంలో ఏమి రాసారు, ఎవరికి రాసారో చూద్దాం.

స్టోరీ లైన్ :

ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లైన భార్యా భర్తలు చిన్ని, బాలాదిత్య (బాలాదిత్య, పూజిత పొన్నాడ) దూరంగా ఉండాలి కాబట్టి ఉంటారు. కానీ ఇద్దరూ ప్రతీ క్షణం ఒకరినొకరు తలుచుకుంటూ సెల్ ఫోన్ లో పలకరించుకుంటారు. పలకరిస్తుంటారు. పరవశిస్తూంటారు. ఆ క్రమంలో పుట్టింట్లో ఉన్న చిన్ని కు ఇప్పుడంటే తాము సెల్ ఫోన్ తో శ్రమిస్తున్నాం కానీ అప్పుడు తన నానమ్మ టైమ్ లో ఎలా ఈ ఎడబాటుకు చెందిన అనుభూతులు పంచుకునేవారు అనేది ఆసక్తికరమైన విషయం గా మారుతుంది. దీంతో అదే ప్రశ్నని తన నానమ్మ (తులసి)ని అడుగుతుంది.

అప్పుడు తులసి తన గత జ్ఞాపకాల లోకి తొంగి చూస్తుంది. అప్పటి జెనరేషన్ తాలుకూ ఎమోషన్స్ ఎలా ఉత్తరాల్లో బంధీగా ఉండేవో, అవి ఎంతటి భావ వీచికలు , తమ గుండెల్లో బరువును ఎలా కొలిచేవో చెప్పుకొస్తుంది. అంతేకాదు తను తన భర్త దగ్గర నుంచి అందుకున్న మొదట ఉత్తరం వెనుక జరిగిన కొన్ని సరదా సంఘటనలను చెప్పుకొస్తోంది. అదేమిటి... అప్పటికి ఇప్పటికి మన జీవితాల్లో వచ్చిన మార్పుని ఉత్తరం ఎలా వ్యక్తీకరించిందో తెలియాలంటే ఈ చిన్న షార్ట్ ఫిల్మ్ చూడాల్సిందే.

ఎలా ఉంది

‘ఎప్పుడూ ఫోనేనా? అయినా మీ మెసేజ్‌ల్లో ఇన్ఫర్మేషన్‌ తప్ప ఎమోషన్‌ ఉండదు’ అనే చిన్న వాక్యంలో మన జీవితాల్లో నిండిపోయిన సెల్ ఫోన్ గురించి సుతి మెత్తటి వార్నింగ్ ఇస్తూ ఈ షార్ట్ ఫిల్మ్ సాగుతోంది. అలాగే ఉత్తరం కోసం వీధివాకిలి వైపు ఎదురుచూసి, రాగానే గబగబా చదివేసి, గుండెలు నింపుకొని, తిరిగి జాబ్ రాయడంలో ఉన్న ఆత్మ సంతృప్తిని వివరిస్తుంది. 'గుండె గొంతులో కొట్లాడటం'

'మనసు ఆర్తితో ద్రవించడం' వంటి విషయాలకు అర్దాన్ని గుర్తు చేస్తుంది. టోటల్ గా ఈ జనరేషన్ కోల్పోతున్న ఓ నోస్ట్రాలజీని మన ముందు ఉంచుతుంది.

ఇక దర్శకుడు సతీశ్‌ వేగేశ్న గుండెల నిండా భావోద్వేగం నింపుకుని దాన్ని పచ్చని పైరు పొలాల సాక్షిగా మన ముందు ఉంచుతారు. ‘శతమానం భవతి’ ని గుర్తు చేస్తూ ఈ కథ కూడా గ్రామీణ జీవిత కుటుంబ అనుబంధాలను అలవోకగా అల్లేసుకుంటుంది. దర్శకత్వం ఈ కథలో పూజిత పొన్నాడ, తులసి, బాలాదిత్య లు ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యారు. దాదాపు 30 నిమిషాల నిడివితో రూపొందిన ఈ కథ కుటుంబంతో కలిసి హాయిగా చూడొచ్చు. ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు, సంభాషణలు లేవు.

చూడచ్చా

ఉత్తరంలాగేనే తక్కువ పదాలతో పొందికగా ఉంటూ చాలా విషయాలను అంతర్గతంగా పొందు పరుచుకుని వచ్చింది ఈ లఘు చిత్రం “ఉత్తరం”. ఖచ్చితంగా మనం షేర్ చేసుకోదగ్గ ఎమోషన్. నిరూసపరచదు. నిట్టూర్చే అవసరం ఇవ్వదు.

ఎక్కడుంది

ఈటీవీ విన్ లో ఉచితంగా ఈ ఉత్తరాన్ని వీక్షించవచ్చు. తెలుగులో ఉంది

Tags:    

Similar News