OTTలో సినిమా ప్రమోషన్స్, ప్రభాస్ “కల్కి”తో మొదలు, ఎక్కడికి వెళ్తుందో

ఓటిటి తన విశ్వరూప ప్రదర్శన చేస్తోంది. అయితే ఓటిటిని మన తాత్కాలిక అవసరాలు కోసం బుజ్జగించి, మరీ భుజాన ఎత్తుకుంటే. భవిష్యత్తులో అది మన భుజాలు దిగదు.

Update: 2024-05-30 12:31 GMT

మీకు గుర్తుందో లేదో... ఆ మ‌ధ్య టిక్కెట్ ధ‌ర‌ల విష‌యంలో తెలుగు నిర్మాత‌లు కాస్త తొందరపాటు వ్యూహాన్ని అనుస‌రించారు. ముందుగా భారీగా ధ‌ర పెంచేసి విక్ర‌యించారు. ఆ బాదుడు త‌ట్టుకోలేక ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ థియేట‌ర్ కి దూర‌మ‌య్యారు. దీంతో ఓపినింగ్స్ కూడా రాకపోయేసరికి నాలుక కరుచుకుని... వెంట‌నే టిక్కెట్ ధ‌ర‌లు త‌గ్గించి ట్ర‌య‌ల్ వేసారు. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అయ్యింది. నిర్మాత‌ల‌కి వాస్తవం అర్దమయ్యే లోగా డ్యామేజ్ జరిగిపోయింది. ఈ గ్యాప్ లో జనం ఓటిటిలకు జారుకున్నారు.

ఇప్పుడు చాలా సినిమాలకు మినిమం జనం కూడా రాక, లేక థియేటర్స్ హ్యాలీడే ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్దితి ఏంటయ్యా అంటే టిక్కెట్ ధ‌ర‌లు స‌హా ఓటీటీ కూడా థియేట‌ర్ ఆక్యుపెన్సీపై ప్ర‌భావం చూపిస్తోంది. సినిమా భ‌విష్య‌త్ ఓటీటీదే అన్న‌ది వాస్త‌వమనేది ఒప్పుకోవాల్సిన విషయంగా మారింది. అయితే ఈ క్రమంలో ఓటిటి తన విశ్వరూప ప్రదర్శన చేస్తోంది. అయితే ఓటిటిని మన తాత్కాలిక అవసరాలు కోసం బుజ్జగించి, మరీ భుజాన ఎత్తుకుంటే. భవిష్యత్తులో అది మన భుజాలు దిగదు. సినిమాలు ఓటిటిల కోసమే తీసుకోవాలి. హాలీవుడ్ లో అదే జరుగుతోంది. స్టార్ డైరక్టర్స్ సినిమాలు కూడా చాలా వరకూ డైరక్ట్ ఓటిటి రిలీజ్ కు వెళ్తోంది.

వాస్తవానికి తెలుగులో ఈ రోజు పెద్ద , చిన్న సినిమాలు అన్ని ఓటిటి సంస్దల దయా దాక్షణ్యాలపై ఆధారపడుతన్నాయి. ఓటిటి బిజినెస్ కాలేదని చాలా సినిమాలు రిలీజ్ లు ఆగిపోయాయి. చిన్న సినిమాల్లో చాలా వరకూ ఓటీటీనే నమ్ముకుని నిర్మాణం జరుగుతున్నాయి. అయితే షూటింగ్ జరుపుకుంటన్న సినిమాలన్నీ ఓటిటి సంస్దలు కొనుక్కుంటాయనే అయితే నమ్మకం లేదు.సవాలక్ష రూల్స్ తో ఓటిటి సంస్దలు నిర్మాతలతో ఆడుకుంటున్నాయి.

ఇక స్టార్స్ సినిమాలకు అయితే ఓటిటిలో ఎంత వస్తుంది అనేదానిపై నిర్మాణ వ్యయం ఆధారపడి ఉంటోంది. చాలా సార్లు ఓటిటిలో ఫలానా హీరో సినిమాకు ఎంత మార్కెట్ ఉందనే దానిపైనే ఆ హీరో రెమ్యునరేషన్ ఆధారపడి ఉంటోందంటే అతిశయోక్తి కాదు. ఇలా ఓటిటి అనేది సినిమాకు ప్రధాన ఆదాయ వనరుగా కనిపిస్తోంది.

అయితే ఈ ఓటిటి వలనే సినిమాలు థియేటర్స్ కు వెళ్లి జనం చూడటం లేదని చాలా మంది దర్శక, నిర్మాతలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అందుకు అడ్డుకట్ట వెయ్యాలని ఆ మధ్య టాలీవుడ్ నిర్మాతలు స్ట్రైక్ చేసి మరీ తీసుకున్న నిర్ణయాల్లో థియేటర్ రిలీజ్ కు ఓటిటి రిలీజ్ కి మధ్య కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలని. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాలకూ ఇది వర్తిస్తుందని చెప్పారు. సరే జరిగితే మంచిదే కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం దానికేమాత్రం అనుకూలంగా కనిపించడం లేదు పట్టుమని మూడు వారాలు దాటకుండా పెద్ద బ్యానర్ ల సినిమాలు కూడా కూడా ఓటిటిలో వచ్చి పడుతున్నాయి.

సినిమా డిజాస్టర్ అయితే ఓటిటిలో తొందరగా వస్తే తప్పేంటనే లాజిక్ లో న్యాయముంది. ఎందుకంటే ఆలస్యం చేస్తే జనంలో వీటి మీదున్న కనీస ఆసక్తి కూడా చచ్చిపోతుంది. అది వచ్చే వ్యూస్ కి గండి పెడుతుంది. వాటిని రెండు నెలల పాటు ఆపి ఉంచితే నిర్మాతకు ఓటిటి సంస్థలు ఇచ్చే రేట్ తగ్గిపోతుంది. పైగా ఫలితం తెలిసిపోయి ఉంటుంది కాబట్టి మరీ లేట్ అయితే ఆ ఏం చూస్తాంలే అని జనం లైట్ తీసుకునే ప్రమాదం ఉంది. . సో ఇలా చేయడం కరెక్టే అన్నారు. అయితే ఓ మాదిరి సినిమాలుకూడా ఎక్కువ డబ్బు వస్తుందని ఓటిటిలో తొందరగా వదిలేస్తున్నారు.

ఇప్పుడు పరిస్దితి ఎలా తయారైందంటే థియేట‌ర్ ర‌న్ లో స‌క్సెస్ ..ఫెయిల్యూర్ ని బ‌ట్టి కాకుండా ఓటీటీ సంస్దల వారి స్ట్రాటజీలపై ధ‌ర నిర్దారించ‌బ‌డుతోంది. తొలుత ఓటీటీలో సినిమా నాలుగు వారాల త‌ర్వాత రిలీజ్ అయ్యేది. అటుపై అదే రిలీజ్ ఆరు వారాల‌కు పోడిగించారు. ఇప్పుడు మ‌రో రెండు వారాలు క‌లిపి ఎనిమిది వారాల‌కు తోసేసారు. ఇదంతా కేవ‌లం థియేట‌ర్ కి ఆడియ‌న్స్ రాక‌పోవ‌డం చేత త‌లెత్త‌ిన స‌మ‌స్య‌. ఓటీటీ వ్య‌వ‌స్థ‌ని ఎంకరేజ్ చేసింది నిర్మాత‌లే. ఇప్పుడ‌దే ఓటీటీ నిర్మాత‌ల‌కు గుది బండ‌గా మారింది.

ఓ సర్వే ప్రకారం నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌‌ వినియోగం భారత్ లో బాగా పెరిగింది. ముఖ్యంగా భారతదేశంలో కల్పిత కథలు, చారిత్రక గాథలు, థిల్లర్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నారని సదరు రిపోర్ట్ సారాంశం. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీసెస్‌తో పాటు ఎడ్యుకేషన్ యాప్స్ డిమాండ్ కూడా పెరిగింది. గ్లోబల్ వెబ్ ఇండెక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ రిపోర్ట్ ప్రకారం చూసినా టెలివిజన్ కన్నా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌‌ గ్రోత్ ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి వేరే దారి లేదు. ఇక ఇప్పుడు మరో కొత్త ట్రెండ్. ఈ ఓటిటి సంస్దల్లో పెద్ద సినిమాల ప్రమోషన్స్ సైతం మొదలెట్టారు.

ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు నటిస్తున్న భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” . ఈ సినిమాపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ సరిపోవటం లేదని అభిమానులు అంటున్నారు. కేవలం సినిమాలో హీరో నడిపే వెహికల్ బుజ్జి మీదే ప్రమోషన్స్ కాన్సంట్రేట్ చేస్తున్నారని అవి మాస్ గా లేకపోవటంతో సామాన్యుడుకు చేరటం లేదని అంటున్నారు. రిలీజ్ కు నెల లోపే టైమ్ ఉండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అలాంటిదేమీ లేదు కావాలని హైప్ తగ్గిస్తున్నారని అని కొందరు వాదన.

ఈ క్రమంలో థియేటర్స్ రిలీజ్ కంటే ముందు ఓటిటిలో ఓ క్రేజీ ప్రీల్యూడ్ ని మేకర్స్ ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. ఓటీటి సంస్థ అమెజాన్ ప్రైమ్ (Prime Video) వారు ఈ విషయమై ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ అవైటెడ్ యానిమేటెడ్ ప్రీల్యూడ్ ని ఈ అర్ధ రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్ కి తీసుకురానున్నారు. అయితే ఈ ఓటిటిలోకి వస్తున్నా ఈ ట్రీట్ లో ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఉందని ఇప్పుడు మేకర్స్ చెప్తున్నారు.

అయితే ఓటిటి ఉన్న వాళ్ళే దీన్ని చూడగలుగుతారు. అదీ అమేజాన్ ప్రైమ్ సబ్ స్క్రిక్షన్ ఉన్నవారికే మాత్రమే ఇది అందుతుంది. మరి మిగతా వారి పరిస్దితి ఏమిటి అంటున్నారు. అమేజాన్ తో అగ్రిమెంట్ లో భాగంగా నాగ్ అశ్విన్ ఇలాంటి ఎక్సక్లూజివ్ కంటెంట్ వారికి ఇస్తున్నట్లు చెప్తున్నారు. ఇలా ఓటిటిలో ప్రమోషన్ కనుక క్లిక్ అయితే రేపటి నుంచి ప్రతీ పెద్ద సినిమా నెట్ ప్లిక్స్, అమేజాన్ ప్రైమ్ లలో ప్రత్యేకమైన ప్రమోషన్స్ మొదలెడుతుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే ఆ ప్రమోషన్స్ తో కలిపే సినిమా రేటుని ఈ ఓటిటి సంస్దలు ఫిక్స్ చేస్తాయి కాబట్టి.

ఈ రాత్రి 12 గంటలకు బుజ్జి అండ్ భైరవ ఈ యానిమేటెడ్ వీడియోలో ఎలాంటి ట్రీట్ ని పంచుతారా అని పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News