Clarkson’s Farm: మన OTT పాపాలను కడిగేస్తుంది!

సెక్సు, డ్రగ్స్,హింస, హత్యలు, తుపాకులు, చంపుకోవటాలు, నరుక్కోవడాలు, కొట్టుకోవడాలు, మోసాలు, కుట్రలు, చూసి ఆలసియారా? అయితే, ఈ ప్రశాంత ఆశ్రమం చూడండి;

Update: 2025-05-29 02:48 GMT

నిన్న వ్యవసాయంలో కొత్త ప్రయత్నాలు చేస్తున్న మిత్రుడు శ్రీనివాసరావు గారిని కలిశాను. 

వ్యవసాయాన్ని ఆధునికతతో మిళితం చేస్తూ, సమాజం, ప్రకృతి,  వ్యవసాయదారుల మధ్య సుస్థిర సంబంధాన్ని నెలకొల్పే లక్ష్యంతో పనిచేస్తున్నారాయన. వీరు హైదరాబాద్ లో కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ (CSA) మోడల్‌ను ప్రవేశపెట్టి, సహ-వ్యవసాయదారులుగా సభ్యులను చేర్చుకుంటూ, పంటల లాభాలను పంచుకుంటు, సురక్షితమైన, సేంద్రీయ ఆహారాన్ని అందించడమే కాకుండా, ప్రకృతితో అనుబంధాన్ని పెంపొందించే జీవనశైలిని కూడా ప్రోత్సహిస్తున్నారు.

మూడు కోతుల సందేశం గుర్తుందిగా: చెడు చూడకు, మాట్లాడకు, వినకు. నేను ఎప్పుడు చెడు మాట్లాడలేదు కానీ, చూడ్డం, వినడం మాత్రం అంతే లేదు. కానీ, కరోనాతో OTT మూలంగా చూడని చెత్త లేదు. దృశ్య దాష్టికాలను విపరీతంగా చూసేసాను. ఎలా తగ్గించుకోవాలో తెలియక, నా సబ్స్క్రిప్షన్లు తొలగించాను, కానీ నా మనసు ఓ దిగులుతో నిండిపోయింది. బహుశా చిత్రగుప్తుడు నా ఖాతాలో అతి ఎక్కువగా చెడు చూసిన క్యాటగరికి చేర్చి ఉంటారని నా నమ్మకం. ఆయన్ను కలిశాక ఇలా పంచుకోవాలని తోచడంతో రాస్తున్నాను.

ప్రపంచంలోని అన్ని భాషల్లోని సెక్సు, డ్రగ్స్,హింస, మానభంగాలు, హత్యలు, తుపాకులు, చంపుకోవటాలు, నరుక్కోవడాలు, బాంబులు, కొట్టుకోవడాలు, మోసాలు, కుట్రలు, దగా, అడ్డు అదుపు లేని క్రూరత్వం చూసి అలసిపోయాను. ఎదో జుగుప్స వెంటాడేది. మానసికంగా కృంగిపోయాను. ఇవి తప్ప వేరే ఏమి లేవా అనే ఓ ఆలోచనతో సతమతమౌతూ సాగుతూపోతున్న తరుణంలో, ఏ ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వ లేదు. పుస్తకం పట్టాను. కొంచం పర్వాలేదనిపించినా, మనసు సమాధాన పడలేదు.
ఎక్కడ పోతే అక్కడే వెతుకోవాలన్నట్టు, OTT లోనే నా అన్వేషణకు సమాధానం Clarkson’s Farm అనే సిరీస్ రూపంలో దొరికింది. Jeremy Clarkson, అనే ప్రఖ్యాత బ్రిటిష్ టీవీ సంపాదకుడు చేసిన ఓ బిగ్ బాస్ లాంటి వాతావరణంలో తన 1000 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ, తాను అనుభవించే సంఘటలను, కష్టాలను, సంతోషాలను, ఆశను రేకెత్తించే శైలిలో డార్క్ కామెడీ ను మిళితం చేసి ఓ బ్రిటీష్ రైతు జీవితాన్ని ఆవిష్కరించడం నభూతో నభవిష్యత్ అన్నట్టుగా మలిచిన తీరు నా అన్వేషణకు ఫలితం దొరికినట్టైయింది.
ముందుగా నాకొక రకమైన ప్రశాంతతగా దొరికినట్టనిపించింది. నిజం చెప్పాలంటే, అది ఒక OTT ఆశ్రమంలా చేరినట్టనిపించింది. ఇందులో తుపాకులు లేవు, మలుపైన కథలు లేవు, నైతిక పతనాలు లేవు. కానీ, మానవ సమాజం మొదటి వృత్తిని ఉటంకిస్తూ సాగే కథనం అమృతం తగినట్టు. ఎండలో ఐస్ క్రీం తింటున్నట్టు. గోదావరి ఒడ్డున నడిచినట్టు, కృష్ణా తీరంలో సేద తీరినట్టుగా ఉండడం మరిచిపోలేని ఓ అనుభూతి. ఆ హాస్యంలోని వ్యంగం. వ్యవసాయంలోని సునిసత్వాన్ని ఒక్క మనిషి ప్రయాణాన్ని చూపించడంతో నేను పులకించిపోయాను.
Clarksonకు వ్యవసాయం గురించి ఏమీ తెలియని, కానీ నేర్చుకోవాలనుకునే జిజ్ఞాసతో, తనకు భూమితో సంబంధం ఏర్పరుచుకుంటున్న ఆలోచన బహు మధురం. ఇది నవ్వులు తెప్పించటమే కాదు, కొంత అసహనానికి గురిచేస్తుంది, కానీ అంతకన్నా ఎక్కువగా, ఇది మన మనసులను గెలుచుకొంటుంది. తాను వ్యవసాయంలో తడబాటు పడడాన్ని చూస్తూ, నేనూ ఒకింత నేర్చుకున్నాను. అది వినోదం మాత్రమే కాదు, ఆ అనుభూతి నాలో మనిషిగా ఎదగడానికి ఓ కొత్త పునాది వేసిందని చెప్పాలి.
వ్యవసాయంలో ట్రాక్టర్ నడపడం నుండి విత్తనాలు చల్లడం, పాదులు కట్టడం, చదును చెయ్యడం, వ్యవసాయ ఉత్పత్తి సంబంధిత వ్యాపారాలు చేసే ప్రయత్నాలు, వాటికి అధికారుల నుండి అనుమతులు తెచ్చుకునేందుకు పడే కష్టాలు, ఆవులకు ,గొర్రెలను, పందులను తన ఫారంలో పెంచడం, వాటి ఆరోగ్యాలు చూసుకోవడం నుండి కాన్పులు చేయడం వరకు ఓ జీవిత కాలాన్ని మన కళ్ళ ముందు కట్టి పడేసారు. వాతావరణ మార్పును ఎంతో ఆచరణాత్మకంగా చూపించడం పెద్ద సాహసం, దర్శకుడి నైపుణ్యం, మనందరికీ, పాలకులకు గుర్తించమని కొట్టిన చెంప దెబ్బ సహజం. ఆ జంతువులను కసాయి కొట్టుకు పంపిన తరువాత అతను అనుభవించే నిశ్శబ్దం మానవీయం.
Jeremy Clarksonకు ప్రపంచ వ్యాప్తంగా చాల గొప్ప పేరుంది. ఎలాంటి పేరంటే;స్వతహాగా తలబిరుసుతనం, చాల పెద్ద పొగరుబోతు. వగరుబోతు. మనిషి రూపంలోని ఆంబోతు కూడా. చెప్పాలనుకున్న దానికి నియంత్రణ ఉండదు. కానీ, వ్యవసాయం అతనిలో ,అతని ద్వారా మనకు ఏదో ఓ తెలియని మానవత్వ స్పర్శ లాంటిది ఉండడం చాల ముచ్చట గొలిపే విశేషం. చేస్తున్న పనిలో తప్పులు చేయడం, వినమ్రంగా నేర్చుకోవడం, నిశ్శబ్దంగా ప్రకృతిని ఆరాధించడం మనల్ని కట్టిపడేస్తుంది. ఇప్పటికి మూడు సీజన్ లు ముగిసి, ప్రస్తుతం నాల్గవ సీజన్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమౌతోంది, ఇక చూడామని ప్రత్యేకంగా చెప్పవలిసిన అవసరం లేదనుకొంటాను.
ఆ మట్టిలోకి మునిగిన ఓ దృశ్యంలో,నేను నా మీద పేరుకుపోయిన ఎన్నో సీరీస్లో చూసిన దృశ్య దాష్టికాల పాపాలను కడిగేసుకున్నాను. నాలో ఓ నవీనత్వ కోణాన్ని చేర్చింది. ఇది కేవలం ఒక సీరీస్ కాదనిపించింది; ఇది మనం ఎప్పుడో మర్చిపోయిన వ్యవసాయాన్ని తిరిగి గుర్తు చేసే ప్రతిబింబం లాగా అనిపించింది. నన్ను చూసుకొనే, తెలుసుకొనే, ఆవిష్కరించుకొనే అవకాశాన్ని ఇచ్చింది

-రామ్.సి


Tags:    

Similar News